Visakhapatnam: విశాఖలో రేపటి నుంచి లైట్ హౌస్ ఫెస్టివల్
ABN , Publish Date - Jan 08 , 2026 | 05:13 AM
లైట్ హౌస్ ఫెస్టివల్‌కు విశాఖపట్నం సిద్ధమవుతోంది. వీఎంఆర్‌డీఏ పార్కు వెనుకనున్న ఖాళీ స్థలంలో శుక్ర, శనివారాల్లో రెండు రోజులపాటు ఈ ఫెస్టివల్ జరగనుంది.
విశాఖపట్నం, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): లైట్ హౌస్ ఫెస్టివల్‌కు విశాఖపట్నం సిద్ధమవుతోంది. వీఎంఆర్‌డీఏ పార్కు వెనుకనున్న ఖాళీ స్థలంలో శుక్ర, శనివారాల్లో రెండు రోజులపాటు ఈ ఫెస్టివల్ జరగనుంది. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. సముద్ర తీర ప్రాంతాన ఉన్న లైట్ హౌస్‌ల ను పర్యాటక కేంద్రాలుగా మార్చాలని, ఆర్థికంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రతి ఏటా లైట్‌హౌస్ ఉత్సవాలు నిర్వహించాలని డీజీఎల్‌ఎల్‌ను ఆదేశించింది. ఈ క్రమంలో తొలి లైట్‌హౌస్ ఫెస్టివల్‌ను 2023లో గోవాలో, 2024లో పూరీలో ఏర్పాటు చేశారు. మూడోసారి విశాఖలో ఈ నెల 9, 10 తేదీలలో నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో పర్యాటకులు, నగర ప్రజలను ఆకర్షించేలా కళా, సాంస్కృతిక ప్రదర్శనలు, ఫుడ్ స్టాళ్లు వంటివి ఏర్పాటు చేస్తారు. ఉత్సవాలకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి సురేశ్ గోపి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తదితర ప్రముఖులు వస్తున్నారు.