Share News

సైనైడ్‌ కిల్లర్‌కు జీవిత ఖైదు

ABN , Publish Date - Jan 24 , 2026 | 05:22 AM

రైస్‌ పుల్లింగ్‌ కాయిన్స్‌, రంగురాళ్లు పేరిట ఎర వేసేవాడు.. నిజమేనని నమ్మి వచ్చినవారిని ప్రసాదంలో సైనైడ్‌ పెట్టి చంపేసేవాడు..

సైనైడ్‌ కిల్లర్‌కు జీవిత ఖైదు

  • ప్రసాదంలో సైనైడ్‌ కలిపి పది మంది హత్య

  • ఆపై బంగారం, నగదుతో ఉడాయింపు

  • సహకరించిన మరొకరికి పదేళ్ల జైలు శిక్ష

  • ఏలూరు జిల్లా అదనపు సెషన్స్‌ కోర్టు తీర్పు

ఏలూరు క్రైం, జనవరి 23(ఆంధ్రజ్యోతి): రైస్‌ పుల్లింగ్‌ కాయిన్స్‌, రంగురాళ్లు పేరిట ఎర వేసేవాడు.. నిజమేనని నమ్మి వచ్చినవారిని ప్రసాదంలో సైనైడ్‌ పెట్టి చంపేసేవాడు.. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పది మందిని పొట్టనపెట్టుకున్నాడు. ఆపై మృతుల వద్ద ఉన్న బంగారం, నగదుతో పరారయ్యేవాడు. 2019లో ఓ డ్రిల్‌ మాస్టార్‌ను కూడా ఇదే తరహాలో హత్య చేసి పోలీసులకు చిక్కాడు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో ఏలూరులోని 8వ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు... ఆ సైనైడ్‌ కిల్లర్‌కు జీవిత ఖైదు, అతడికి సైనైడ్‌ విక్రయించిన మరో వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఏలూరులో శుక్రవారం రాత్రి ఎస్పీ కిశోర్‌ ఆ వివరాలు వెల్లడించారు.

అసలేం జరిగిందంటే...

ఏలూరు ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన వెల్లంకి సింహాద్రి అలియాస్‌ శివ.. గతంలో అపార్టుమెంటులో వాచ్‌మెన్‌గా పనిచేసేవాడు. తర్వాత రైస్‌ పుల్లింగ్‌ కాయిన్స్‌, రంగురాళ్లు కొనిపెట్టి.. వాటితో డబ్బును, బంగారాన్ని రెట్టింపు చేస్తానని చెప్పేవాడు. బంగారం, డబ్బులు కాజేసేవాడు. తర్వాత విజయవాడకు చెందిన బంగారపు వస్తువులు తయారీదారుడైన అమీనుల్లాబాబు అలియాస్‌ బాబుతో పరిచయమైంది. ఆయన వద్ద నుంచి సైనైడ్‌ తీసుకొచ్చి దాన్ని ప్రసాదంలో కలిపి తన వద్దకు వచ్చేవారికిచ్చి హతమార్చేవాడు. మృతుల వద్ద ఉన్న నగదు, బంగారాన్ని అపహరించేవాడు. ఈ క్రమంలో ఏలూరు అశోక్‌నగర్‌ కేపీడీటీ హైస్కూల్‌లో పీఈటీగా పనిచేస్తున్న మాదేపల్లికి చెందిన కాటి నాగరాజుతో పరిచయం పెంచుకున్నాడు. రైస్‌ పుల్లింగ్‌ కాయిన్‌ కొనిపెడతానని.. దానితో బంగారం, డబ్బులు రెట్టింపు అవుతాయని ఆయనను నమ్మించాడు. 2019 అక్టోబరులో జెరూసలెం నుంచి ప్రసాదం తీసుకువచ్చానంటూ సైనైడ్‌ కలిపిన ప్రసాదాన్ని నాగరాజుకు ఇచ్చాడు. అది తిన్న వెంటనే నాగరాజు మరణించాడు.


దీంతో ఆయన వద్ద ఉన్న రెండు లక్షల నగదు, ఐదు కాసుల బంగారాన్ని తీసుకుని పరారయ్యాడు. నాగరాజు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి.. వెల్లంకి సింహాద్రి, షేక్‌ అమీనుల్లాలను అరెస్టు చేశారు. విచారణలో భాగంగా సైనైడ్‌ కలిపిన ప్రసాదంతో అప్పటికే తొమ్మిది మందిని హతమార్చినట్టు తేలింది. ఏలూరులోని 8వ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టులో ఈ కేసు విచారణ సాగింది. నాగరాజుకు సైనైడ్‌ కలిపిన ప్రసాదాన్ని ఇచ్చి హతమార్చినట్లుగా సింహాద్రిపై నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు, వస్తువులను అపహరించిన కేసులో పదేళ్ల జైలు శిక్ష, రూ.6 వేల జరిమానా విధించారు. ఎస్సీ ఎస్టీ చట్టం కింద మరో జీవిత ఖైదు విధించారు. అతడికి సహకరించిన అమీనుల్లాబాబుకు పదేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ న్యాయాధికారి తీర్పు వెల్లడించారని ఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా ఈ పది హత్యల్లో కృష్ణా జిల్లాలో చేసిన ఒక హత్యకు సంబంధించి సింహాద్రికి ఇప్పటికే జీవిత ఖైదు విఽధించారు. ప్రస్తుత కేసు రెండోది. మరో 8 కేసుల్లో తీర్పులు రావలసి ఉంది.

Updated Date - Jan 24 , 2026 | 08:26 AM