Share News

బుట్టా రేణుకకు షాక్‌!

ABN , Publish Date - Feb 22 , 2026 | 03:45 AM

వైసీపీ కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠ శివలకు చెందిన ఆస్తులు ఇ-వేలం వేసేందుకు బెంగళూరుకు చెందిన లైఫ్‌ ఇన్సురెన్స్‌ కార్పొరేషన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్ఎల్‌) బహిరంగ నోటీసు జారీ చేసింది.

బుట్టా రేణుకకు షాక్‌!

  • వైసీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలానికి మళ్లీ ‘ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్ఎల్‌’ నోటీస్‌

  • ఆ సంస్థ నుంచి 340 కోట్ల రుణం

  • వడ్డీ, అసలు కట్టకపోవడంతో రూ.782 కోట్లకు చేరిన అప్పు

  • మార్చి 24న ఆస్తుల ఇ-వేలం

కర్నూలు, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): వైసీపీ కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠ శివలకు చెందిన ఆస్తులు ఇ-వేలం వేసేందుకు బెంగళూరుకు చెందిన లైఫ్‌ ఇన్సురెన్స్‌ కార్పొరేషన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్ఎల్‌) బహిరంగ నోటీసు జారీ చేసింది. మార్చి 24న నిర్వహించే ఇ-వేలంలో పాల్గొనే బిడ్డర్లు 23న ఇ-బిడ్‌ ఫారం దాఖలు చేయాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. బుట్టా దంపతులు తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో ‘ఎల్‌ఐసీ హెచ్‌ఎ్‌ఫఎల్‌’, దానిని రాబట్టుకునే చర్యలకు సిద్ధమైంది. ఇప్పటికే రెండు మూడు సార్లు వేలం వేయగా, ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో మరోసారి ఆమె ఆస్తులు వేలం వేసేందుకు సిద్ధమయ్యారు. బుట్టా రేణుక దంపతులు 2018లో రంగారెడ్డి జిల్లా కూకట్‌పల్లి, కేవీహెచ్‌బీ కాలనీ సర్వే నంబరు 1009, ఫేజ్‌-6 వద్ద గల 3,833.28 చదరపు గజాల విస్తీర్ణంలోని మెరీడియన్‌ స్కూల్‌ స్థిరాస్తిని ‘ఎల్‌ఐసీ హెచ్‌ఎ్‌ఫఎల్‌’ వద్ద ఉమ్మడిగా తనఖా పెట్టి దాదాపు రూ.340 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. వీరికి హైదరాబాద్‌లో బుట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బుట్టా కన్వెన్షన్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, మెరీడియన్‌ ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌.. వంటి పలు వ్యాపార, విద్యా సంస్థలున్నాయి. అప్పు తీసుకున్న మొదట్లో క్రమం తప్పకుండా నెలవారీ కంతులు చెల్లిస్తూ వచ్చారు. ఆ తరువాత నుంచి చెల్లించకపోవడంతో పలుమార్లు ఆ సంస్థ నోటీసులు పంపింది. అయినా, స్పందించలేదని తెలుస్తోంది. రుణం అసలు, వడ్డీ కలిపి ప్రస్తుతం రూ.782.07 కోట్లకు చేరిందని ‘ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్ఎల్‌’ అధికారులు ఇ-వేలం నోటీ్‌సలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇచ్చిన అప్పు వడ్డీతో సహా రాబట్టుకోవడానికి బెంగళూరు బ్రాంచి అధికారులు వేలం నోటీస్‌ జారీ చేశారు.


వాస్తవంగా బుట్టా దంపతులకు చెందిన ఆస్తులు హైదరాబాద్‌లోని ప్రైమ్‌ లొకేషన్లలో ఉన్నాయి. ఇవి భారీ డిమాండ్‌ ఉన్న ఆస్తులు. అయినా కూడా గతంలో నిర్వహించిన వేలంలో ఎవ్వరూ పాల్గొనకపోవడం గమనార్హం. బుట్టా రేణుక 2014లో కర్నూలు వైసీపీ ఎంపీగా పోటీచేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో ఆమెకు టికెట్‌ దక్కలేదు. 2024 ఎన్నికల్లో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా కొనసాగుతున్నారు. ఆస్తుల వేలంపై రేణుక వివరణ కోసం ఫోన్‌లో ప్రయత్నించగా, ఆమె అందుబాటులోకి రాలేదు.

Updated Date - Feb 22 , 2026 | 03:46 AM