నకిలీ డెత్ సర్టిఫికెట్లతో 3 కోట్లుస్వాహా!
ABN , Publish Date - Jan 23 , 2026 | 04:06 AM
ప్రకాశం జిల్లాలోని కందుకూరు జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) బ్రాంచ్‌లో క్లెయిమ్‌ల స్కాం చోటుచేసుకుంది! సుదీర్ఘకాలం ఆ బ్రాంచ్ పరిధిలో ఏజెంటుగా ఉండి...
ప్రకాశం జిల్లా కందుకూరు ఎల్‌ఐసీ బ్రాంచ్‌లో క్లెయిమ్‌ల స్కాం
బంధువులు, సన్నిహితుల పేర్లతో ఓ ఏజెంటు చేతివాటం
ఆ సొమ్మంతా బినామీ నామినీలతో తన ఖాతాకే జమ
డీవోగా పదోన్నతి పొందిన సదరు ఏజెంటు సస్పెన్షన్
సమగ్ర విచారణకు రంగంలోకి విజిలెన్స్ టీమ్
కందుకూరు, జనవరి 22(ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లాలోని కందుకూరు జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) బ్రాంచ్‌లో క్లెయిమ్‌ల స్కాం చోటుచేసుకుంది! సుదీర్ఘకాలం ఆ బ్రాంచ్ పరిధిలో ఏజెంటుగా ఉండి, మూడేళ్ల క్రితం డెవలప్‌మెంట్ ఆఫీసరై, ప్రస్తుతం మార్కాపురం బ్రాంచ్‌లో ఉద్యోగిగా మారిన కనిగిరికి చెందిన పూజల శ్రీనివాసరావు కీలక సూత్రధారిగా తెలిసింది. నకిలీ డెత్ సర్టిఫికెట్లతో రూ.3కోట్ల మేర స్వాహా చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఎల్‌ఐసీలో పాలసీ తీసుకున్న తర్వాత పాలసీదారుడు మూడేళ్ల తర్వాత చనిపోతే, లోతైన విచారణ చేయకుండానే క్లెయిమ్‌ను పరిష్కరిస్తారు. ఈ నిబంధనను ఉపయోగించుకున్న సదరు ఏజెంటు కొంతమంది పేర్లతో నకిలీ పాలసీలు చేశాడు. మూడు నాలుగేళ్లు ప్రీమియం కట్టి, ఆ తర్వాత వేర్వేరు తేదీలతో నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలతో క్లెయిమ్‌లు పెట్టారు. అవన్నీ పరిష్కారమై నామినీలుగా పెట్టిన ఆయన కుటుంబసభ్యుల ఖాతాలకు డబ్బు జమయింది. ఈ వ్యవహారంలో పాలసీలకు ఆధార్ అనుసంధానం కాకపోవడాన్ని సదరు ఏజెంట్ సద్వినియోగం చేసుకున్నాడు. ఒకేపాలసీదారుడి పేరుపై అనేక పాలసీలు చేశారు. ఒక వ్యక్తికే వేర్వేరు సంవత్సరాలలో వేర్వేరు తేదీల్లో మూడు డెత్ సర్టిఫికెట్లతో క్లెయిమ్‌లు చేశాడు. విచిత్రం ఏమిటంటే చనిపోయాడని పేర్కొన్న వ్యక్తి పేరుతో మరో 2 పాలసీలు ఫోర్స్‌లో ఉండటం గమనార్హం. దీన్ని ఎల్‌ఐసీలో కొత్తగా వచ్చిన సాఫ్ట్‌వేర్ గుర్తించింది. ఆ తర్వాత కొన్ని పాలసీలకు క్లెయిమ్‌లు రావడాన్ని పట్టుకోవటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
97 క్లెయిమ్‌లపై సమగ్ర విచారణ
నెల్లూరు రీజినల్ ఆఫీసు ఈ అక్రమాన్ని గుర్తించి సమగ్ర విచారణకు విజిలెన్స్ టీంను నియమించింది. నకిలీ డెత్ సర్టిఫికెట్లతో క్లెయిమ్ చేసిన పాలసీలకు కొన్నింటికి నామినీదారులుగా సదరు ఏజెంటు కుటుంబసభ్యులే ఉండగా.. మరికొన్ని పాలసీల నామినీదారులు కూడా తమ అకౌంట్‌కు సొమ్ము జమ కాగానే, ఆ మొత్తాన్ని ఆ ఏజెంటు బ్యాంకు ఖాతాకు బదిలీ చేసినట్లు గుర్తించారు. సదరు ఏజెంటు 2023లో ఎల్‌ఐసీ డెవల్‌పమెంట్ ఆఫీసర్‌గా ఉద్యోగం పొందగా, అంతకుముందు ఏజెంటుగా ఉన్న కాలంలో రెండేళ్లపాటు ఈ వ్యవహారం నడిపించినటు గుర్తించింది. అతడికి సంబంధించిన మొత్తం 97 క్లైమ్‌లపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. డీవో శ్రీనివాసరావుకు సస్పెన్షన్ నోటీసులు ఇచ్చిన ఉన్నతాధికారులు.. ఆయనపై క్రిమినల్ చర్యలకు సిద్ధమైనట్లు తెలిసింది. ఎంతమొత్తంలో స్వాహా జరిగిందన్న దానిపై విజిలెన్స్ టీం విచారిస్తోందని బ్రాంచ్ మేనేజరు జనార్దన్ తెలిపారు.