Share News

ఎల్‌జీ పాలిమర్స్‌తో ఎందుకు పరిహారం ఇప్పించలేదు?

ABN , Publish Date - Jun 11 , 2026 | 04:04 AM

జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2020 మే 7న ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీలో స్టైరిన్‌ విషవాయువు లీకై పన్నెండు మంది మృతిచెందారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు.

ఎల్‌జీ పాలిమర్స్‌తో ఎందుకు పరిహారం ఇప్పించలేదు?

  • నాడు 12 మంది కార్మికుల మృతి

  • జగన్‌ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలే

జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2020 మే 7న ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీలో స్టైరిన్‌ విషవాయువు లీకై పన్నెండు మంది మృతిచెందారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించింది. కేజీహెచ్‌ ఆస్పత్రికి వెళ్లి పరిహారం పంచిపెట్టారు. అవన్నీ ప్రభుత్వ నిధులు. సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సంబంధిత కంపెనీ నుంచి పరిహారం ఇప్పిస్తారు. కానీ ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ యాజమాన్యానికి, జగన్‌కు మధ్య ఏ ఒప్పందం జరిగిందో తెలియదు గానీ ఆ కంపెనీ నుంచి ఆయన సీఎంగా ఉండగా బాధితులకు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇప్పించలేకపోయారు. ఆ కంపెనీ నుంచి భారీగా ముడుపులు అందాయని సమాచారం. బాధితులకు ప్రభుత్వం నుంచి పరిహారం ఇచ్చి, కంపెనీ ఇచ్చిన నిధులు మింగేశారనేది ఆరోపణ. ఇవన్నీ ఆయన మరిచిపోయారు. ఇప్పుడు స్టీల్‌ ప్లాంటు ప్రమాద బాధితులకు ఒకవైపు కంపెనీ నుంచి చట్టబద్ధంగా పూర్తి పరిహారం ఇప్పిస్తూ, మరో వైపు ప్రభుత్వం తరఫున రూ.25 లక్షలు చొప్పున ఇప్పిస్తుంటే.. అది సరిపోదని విశాఖపట్నం వచ్చి గగ్గోలు పెడుతున్నారు. స్టీల్‌ప్లాంటు బాధితులకు పరిహారంతో పాటు శాశ్వత ఉద్యోగాలు ఇవ్వడానికి కేంద్ర ఉక్కు శాఖా మంత్రి కుమారస్వామి అంగీకరించారు. వారి పిల్లల చదువులు, నివాసానికి క్వార్టర్‌ సదుపాయం కల్పిస్తామన్నారు.


సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణమేదీ?

ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటన జరిగినప్పుడు నాడు సీఎం హోదాలో ఉన్న జగన్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఒక్క ఇటుక కూడా వేయలేదు. విషవాయువు పీల్చిన బాధితులకు హెల్త్‌కార్డులు అందజేసి, జీవితాంతం ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు. అయితే అసలు కార్డులే ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ కంపెనీ బాధితులు 20 వేలమందిని గుర్తించి వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం ఇప్పించింది. అలాగే వారి కోసం ట్రస్ట్‌ ఏర్పాటు చేయించి, దాంతో ఆర్‌ఓ ప్లాంటు నిర్మించి తాగునీరు అందిస్తున్నారు. సమీపంలోని గోపాలపట్నం ఆస్పత్రిని 30 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేసి బాధితులకు వైద్యం అందిస్తున్నారు. జగన్‌ హయాంలో జరిగిన నష్టానికి కూడా కూటమి ప్రభుత్వమే న్యాయం చేసింది. వాస్తవాలు ఇలా ఉండగా.. నాడు ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనలో తాను బాధితులకు ఎంతో మేలు చేసినట్టు జగన్‌ ప్రచారం చేసుకుంటున్నారు.

Updated Date - Jun 11 , 2026 | 04:05 AM