ప్రతి నీటిబొట్టును ఒడిసి పడుదాం
ABN , Publish Date - May 06 , 2026 | 12:23 AM
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రతి నీటిబొట్టూ ఒడిసి పడుదామని, భూగర్భ జలాల పెంపే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రోడ్డు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డి అన్నారు.
భూగర్భజలాల పెంపే ప్రభుత్వ లక్ష్యం
మంత్రి బీసీ జనార్దన రెడ్డి సుడిగాలి పర్యటన
కొలిమిగుండ్ల, మే 5 (ఆంధ్రజ్యోతి): వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రతి నీటిబొట్టూ ఒడిసి పడుదామని, భూగర్భ జలాల పెంపే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రోడ్డు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డి అన్నారు. మండలంలోని హనుమంతుగుండం, బందార్లపల్లె, గోర్విమానుపల్లె, పెట్నికోట, కొలిమిగుండ్ల గ్రామాల్లో మంగళవారం మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. హనుమంతుగుండం పెద్ద చెరువులో స్వయంగా మంత్రి ఎక్స్‌కవేటర్ నడుపుతూ పూడికతీత పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మండలంలో ఐదు చెరువులను కలుపుతూ జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా 22 కి.మీ. పొడవున కాలువ పూడికతీత పనులు చేపడుతున్నామని తెలిపారు. భూగర్భ జలాల సంరక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి ఎనలేనిదని మంత్రి బీసీ అన్నారు. కాలువ పూడికతీత పనుల్లో భాగంగా సారవంతమైన మట్టి రైతుల పొలాలకు తరలించుకునే అవకాశం ఏర్పడిందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రాజెక్టుల సంరక్షణ, నీటి వనరుల సంరక్షణను గాలికి వదిలేసిందని విమర్శించారు. అనంతరం బందార్లపల్లె చెక్ పోస్ట్ సమీపంలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, టీడీపీ నాయకులు నంద్యాల రామేశ్వర్ రెడ్డి, మూలే రామేశ్వర్ రెడ్డి, వీఆర్ లక్ష్మీరెడ్డి, హుస్సేన రెడ్డి, ప్రకాశరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.