సామాజిక న్యాయ సాధనకు ఉద్యమిద్దాం
ABN , Publish Date - Feb 20 , 2026 | 11:37 PM
సామాజిక న్యాయ సాధనకు ఉద్యమిద్దామని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రయ్య అన్నారు.
పత్తికొండ టౌన్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): సామాజిక న్యాయ సాధనకు ఉద్యమిద్దామని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రయ్య అన్నారు. జాతీయ సమితి పిలుపులో భాగంగా శుక్రవారం స్థానిక సీఆర్ భవన్ నుంచి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ సర్కిల్‌లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు పెరిగిపోయాయన్నారు. దేశంలో 75 శాతం సంపద కేవలం పది శాతం కార్పొరేట్ శక్తుల చేతుల్లోనే దాగి ఉందన్నారు. సామాజిక అసమానతల కారణంగా పేదరికం, నిరుద్యోగం పెరిగి పోయిందన్నారు. పాలకులను ప్రశ్నించే విధంగా పౌర సమాజం నిర్మాణానికి చైతన్యవంతులు కావాలన్నారు. సామాజిక న్యాయ సాధన దిశగా కమ్యూనిస్టులు నిర్వహించే ఆందోళన కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, జిల్లా కార్యవర్గ సభ్యులు నభిరసూల్, నాయకులు గురుదాస్, కారన్న, వీరన్న, రంగన్న, నెట్టికంటయ్య, సుంకన్న, నరసింహులు, రవికుమార్ పాల్గొన్నారు.
కార్పొరేట్ సంపదపై పన్నులు విధించాలి
ఆదోని రూరల్: కార్పొరేట్ సంపదపై పన్నులు విధించి సామాజిక న్యాయం సాధించాలని సీపీఐ నాయకులు సుదర్శన, వీరేష్, కల్లుబావి రాజులు తెలిపారు. శుక్రవారం అంతర్జాతీయ, సామాజిక న్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్ కూడలి వద్ద సమావేశాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ మోదీ పాలనలో కార్పొరేట్ సంస్థలకు రూ.20లక్షల కోట్లు రుణమాఫీ రాయితీ ఇచ్చారన్నారు. పేదవాడి నుంచి పన్నులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు బడుగు బలహీన వర్గాల పేదలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు.
అందరికీ సామాజిక న్యాయం చేయాలి
మద్దికెర: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాలందరికీ సామాజిక న్యాయం చేయాలని సీపీఐ మండల ఇనచార్జి రాజాసాహేబ్ అన్నారు. శుక్రవారం ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం పురస్కరించుకుని స్థానిక డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ముందు నిరసన తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ దేశంలో సంపద కొంత మంది చేతుల్లోనే కేంద్రీకృతమైందన్నారు. పన్నుల ద్వారా సేకరించిన సంపదను పేదలకు అందించాలన్నారు. దేశంలో ఎంతో మంది నిరుపేదలు ఉన్నారని, వారిని ధనవంతులు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి నాగరాజు, మాజీ కార్యదర్శి డా.వలి సాహేబ్, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కోదండరాముడు, తదితరులున్నారు.