అదిగో పులి.. ఇదిగో తోక!
ABN , Publish Date - Feb 03 , 2026 | 04:42 AM
అదిగో పులి అంటే.. ఇదిగో తోక అన్న చందంగా ఉంది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని పరిస్థితి.
తొర్రేడు పరిసరాల్లోనే పులి
మొక్కజొన్న తోటలో ఉందంటున్న అధికారులు
సీతానగరం మండలంలో కనిపించిందంటున్న మరికొందరు
మూడు మండలాల ప్రజలు గజగజ
రాజమహేంద్రవరం రూరల్, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): అదిగో పులి అంటే.. ఇదిగో తోక అన్న చందంగా ఉంది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని పరిస్థితి. మండలంలోని తొర్రే డు గ్రామంలో ఆదివారం పశువులను చంపి దొరక్కుండా పారిపోయిన పెద్దపులి ట్రాప్ కెమెరాలు, బోను, వల నుంచి తప్పించుకుంది. బోను, సీసీ కెమెరాలు పెట్టిన మార్గంలో కాకుండా, రివర్స్‌లో వెళ్లి రోడ్డు దాటుకొని మరో చోటుకు చేరింది. సోమవారం ఉదయం గ్రామ పంచాయతీ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న పాత భవనంలో పులి పాదముద్రలు కనిపించడంతో గ్రామస్థులు ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. వారు పరిశీలించి పులి పాదం గుర్తులుగా నిర్ధారణ చేశారు. పులి గ్రామానికి చేరువలో మొక్కజొన్న తోటలో ఉందంటూ చెప్పిన అధికారులు దాని జాడ కనిపెట్టకపోవడంతో గ్రామస్థులు బెంబేలెత్తిపోతున్నారు. పాదముద్రలు కూడా గంట క్రితానివే అంటూ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో తెలిపిన అధికారులు కనీసం డ్రోన్ కూడా ఉపయోగించలేదు. సాయంత్రం 4గంటల సమయంలో డ్రోన్‌తో గాలించినా జాడ కనిపెట్టలేకపోయారు. సుమారు 4 గంటల ప్రాంతంలో సీతానగరం మండలం ముగ్గళ్లలో పులి జాడ కనిపించిందంటూ అటవీశాఖ అధికారులకు ఫోన్ రావడంతో అటు వెళ్లారు. తొర్రేడు పక్క గ్రామం వెంకటనగరం ఇసుక ర్యాంపు ప్రాంతంలో కనిపించిందని కూలిపనులకు వెళుతున్న కొంతమంది చెబుతున్నారంటూ రెవెన్యూ అధికారులు తెలిపారు. దీంతో ఒక్క పులే మూడు మండలాల్లో తిరుగుతోందా.. అది మరొకటా అన్న సందిగ్ధం నెలకొంది. పులి జాడ అటు సీతానగరం నుంచి రాజమహేంద్రవరం రూరల్ వరకు కనిపించడంతో మూడు మండలాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.