చిరుతల దాడిలో నలుగురికి గాయాలు
ABN , Publish Date - Feb 03 , 2026 | 04:39 AM
అనంతపురం జిల్లాలో చిరుతలు విరుచుకుపడ్డాయి. నార్పల, బుక్కరాయసముద్రం మండలాల పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ, రైతులు, గొర్రెల కాపరులపై దాడి చేశాయి.
నార్పల, బుక్కరాయసముద్రంలో కలకలం
నార్పల, బుక్కరాసముద్రం, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లాలో చిరుతలు విరుచుకుపడ్డాయి. నార్పల, బుక్కరాయసముద్రం మండలాల పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ, రైతులు, గొర్రెల కాపరులపై దాడి చేశాయి. దీంతో నలుగురు గాయపడ్డారు. కొందరు దాడుల నుంచి తప్పించుకున్నారు. నార్పల మండలం బొందల వాడ రైతులు కొనంకి రంగయ్య, లక్ష్మీదేవి పొలాల్లో పనులు చేస్తుండగా మూడు చిరుతలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపరిచి వెళ్లిపోయాయి. ఆ తరువాత గ్రామ శివారులో ఉన్న గొర్రెల కాపరి నారాయణస్వామిపై దాడి చేశాయి. విషయం తెలుసుకున్న గ్రామస్థులు చిరుత పులులను చంపడానికి కర్రలు తీసుకుని వెళ్లారు. ఈ లోగా మూడూ మాయమయ్యాయి. పొలాలు, గుట్టల్లో గాలించిన గ్రామస్థులు, చిరుత పులి అనుకుని అడవి పిల్లిని చంపేశారు. గాయపడ్డ ముగ్గురిని 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే, బుక్కరాయసముద్రం మండలం సంజీపురం శివారులో కనుమ ఆదినారాయణమ్మ (60)పై చిరుత దాడి చేసింది. మొక్కజొన్న పంటకు నీరు కట్టేందుకు హెచ్చెల్సీ 22వ డిస్ట్రిబ్యూటరీ వద్దకు సోమవారం ఉదయం ఆమె వెళ్లగా అక్కడ చిరుత దాడి చేసింది. ఆమె భయపడకుండా చేతిలో ఉన్న పారతో చిరుత తలపై మోదడంతో అక్కడి నుంచి పారిపోయింది. బాధితురాలిని స్థానికులు 108 వాహనంలో అనంతపురం సర్వజన వైద్యశాలకు తరలించారు. అదే గ్రామానికి చెందిన రైతు మల్లికార్జున రెడ్డి దిచక్ర వాహనంపై వెళుతుండగా మరో రెండు చిరుతలు ఎదురుపడ్డాయి. ఆయన వెంటనే వెనుదిరిగి దాడి నుంచి తప్పించుకున్నారు. అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలాలను పరిశీలించారు. చిరుతలను బంధించేందుకు బోనులను సిద్ధం చేశారు. చిరుతల సంచారం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, పోలీసు, అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.