Share News

కామెడీ స్కిట్లు.. పౌరాణిక పాత్రలు

ABN , Publish Date - Mar 07 , 2026 | 05:32 AM

నిత్యం ప్రజా జీవితంలో బిజీబిజీగా ఉండే ప్రజా ప్రతినిధులు పాటలు, నాటకాలు, కామెడీ స్కిట్లతో అలరించారు. ఏపీ శాసన వ్యవస్థ ఏర్పాటు చేసిన రెండో విడత ఆటవిడుపు వేదికలో తమలోని కళానైపుణ్యాన్ని ప్రదర్శించారు.

కామెడీ స్కిట్లు.. పౌరాణిక పాత్రలు

  • సాంస్కృతిక కార్యక్రమాల్లో అదరగొట్టిన శాసనసభ్యులు

  • గత ప్రభుత్వ లోపాలను చూపిన ‘ప్రజా దర్బార్‌’ స్కిట్‌

(ఆంధ్రజ్యోతి- విజయవాడ సిటీ)

నిత్యం ప్రజా జీవితంలో బిజీబిజీగా ఉండే ప్రజా ప్రతినిధులు పాటలు, నాటకాలు, కామెడీ స్కిట్లతో అలరించారు. ఏపీ శాసన వ్యవస్థ ఏర్పాటు చేసిన రెండో విడత ఆటవిడుపు వేదికలో తమలోని కళానైపుణ్యాన్ని ప్రదర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వివిధ రకాల కళలు ప్రదర్శించి మెప్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమాలను వీక్షించిన సాటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఈలలు, చప్పట్లతో వారిని ప్రోత్సహించారు. ఈ ప్రదర్శనను శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుతో కలిసి సీఎం చంద్రబాబు వీక్షించారు. చప్పట్లతో సభ్యులను ఉత్సాహపరిచారు. విజయవాడలోని అంత్రాలక్జ్‌ ఫంక్షన్‌ హాలులో శుక్రవారం ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది.


భీముడి పాత్రలో ఒదిగిన డిఫ్యూటీ స్పీకర్‌

డిప్యూటీ స్పీకర్‌ రఘురామరాజు మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం ఘట్టంలోని భీముడి పాత్రలో అలరించారు. ‘ఓరోరి సుయోధన..’ అంటూ గుక్కతిప్పుకోకుండా పద్యాన్ని ఆలపిస్తూ, గద తిప్పుతూ వీరోచితమైన హావభావాలను ప్రదర్శించారు. కాగా, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరపాండ్య కట్టబొమ్మన పరకాయ ప్రవేశం చేశారా అన్నట్లు మంత్రి కందుల దుర్గేశ్‌ నటించారు. చేతికి, కాళ్లకు సంకెళ్లు కట్టుకుని వేదికపై వచ్చి.. నాటి స్వాతంత్య్ర పోరును తన నటనతో కళ్ల ముందుకు తెచ్చారు. మేజర్‌ చంద్రకాంత్‌ చిత్రంలో ఎన్టీఆర్‌ నటించిన ‘పుణ్యభూమి నా దేశం నమో నమామి’ అనే పాటను ఛీప్‌ విప్‌ జీవీ ఆంజనేయులు ప్రదర్శించారు. అతనితో పాటు ఈ పాటలో కనిపించే శివాజీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, వీరపాండ్య కట్టబొమ్మన పాత్రల్లో ఎమ్మెల్యేలు వర్ల కుమార్‌రాజా, సునీల్‌కుమార్‌, మంత్రులు వాసంశెట్టి సుభాష్‌, కందుల దుర్గేశ్‌ అలరించారు. ఇక నేటి ప్రజా జీవన శైలి, ఎమ్మెల్యేల తిప్పలు, ప్రజారంజక పాలనకు ప్రజా ప్రతినిధులు తీసుకోవాల్సిన చర్యలను ప్రజా దర్బార్‌ స్కిట్‌ ద్వారా జీవీ ఆంజనేయులు బృందం వివరించింది. ఇందులోని పలు పాత్రల్లో ఎమ్మెల్యేలు కుమార్‌రాజా, కామినేని శ్రీనివాస్‌, విష్ణుకుమార్‌రాజు, సునీల్‌కుమార్‌ తదితరులు నటించారు. గత వైసీపీ ప్రభుత్వం సామాజిక పింఛన్‌ల పేరుతో కోటీశ్వరులకు పథకాన్ని కట్టబెట్టిన తీరును ప్రదర్శించారు. ఆహో ఆంధ్ర భోజా.. అంటూ శ్రీకృష్ణ దేవరాయుల పాత్రలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు అద్భుత ప్రదర్శన ఇచ్చారు.


నవ్వులు పూయించిన ‘స్పందన’

ఎమ్మెల్యేలు ఈశ్వరరావు, విజయకుమార్‌ స్పందన పేరుతో చేసిన కామెడీ స్కిట్‌ అందరినీ నవ్వించింది. 15 నిమిషాలకు పైగా ఈ స్కిట్‌ వీక్షకులను అలరించింది. ఇక చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరూ ఆదరిరించి, నేతన్నలకు అండగా నిలుద్దామని మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ వేదిక ద్వారా పిలుపునిచ్చారు. రుద్రవీణ చిత్రంలోని లలిత ప్రియ కమలం.. అనే పాటను ఎమ్మెల్యే విజయకుమార్‌ ఆలపించారు. ఘంటసాల సంగీత కళాశాల విద్యార్ధులు పాత చిత్రాల్లోని పాటలను ఆలపించి అలరించారు. నృత్య కళాశాల విద్యార్ధులు కూచిపూడి నాట్య ప్రదర్శన ఇచ్చారు. సాంస్కృతిక ప్రదర్శనలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.

Updated Date - Mar 07 , 2026 | 05:34 AM