రాష్ట్రవ్యాప్తంగా లీగల్ ఎయిడ్ క్లినిక్‌ల ఏర్పాటు
ABN , Publish Date - Jan 26 , 2026 | 04:16 AM
రాష్ట్రవ్యాప్తంగా లీగల్ ఎయిడ్ క్లినిక్‌లు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వంతో చర్చించి, తగిన చర్యలు తీసుకుంటామని హైకోర్టు న్యాయమూర్తి...
ప్రభుత్వంతో చర్చించి చర్యలు తీసుకుంటాం: జస్టిస్ మానవేంద్రనాథ్
పార్వతీపురం జిల్లా కలెక్టరేట్‌లో ప్రారంభం
పార్వతీపురం, జనవరి 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా లీగల్ ఎయిడ్ క్లినిక్‌లు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వంతో చర్చించి, తగిన చర్యలు తీసుకుంటామని హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ పేర్కొన్నారు. ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్‌లో లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రెవెన్యూ సమస్యలపై పలువురు అర్జీదారుల ఫిర్యాదులను స్వీకరించారు. వాటిని పరిశీలించి, పరిష్కార మార్గం చూపాలని న్యాయసేవా సహాయకులకు ఆదేశించారు. అనంతరం జస్టిస్ మానవేంద్రనాఽథ్ రాయ్ మాట్లాడుతూ.. ‘పార్వతీపురం మన్యం జిల్లాలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం చేపట్టిన కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అభినందనీయులు. లోక్‌అదాలత్ ద్వారా పెండింగ్ కేసులను రాజీ చేసుకోవచ్చు’ అని పేర్కొన్నారు. కాగా, రథసప్తమి సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రం పార్వతీపురం శివారులో ఉన్న సూర్యపీఠంలో జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ ప్రత్యేక పూజలు చేశారు. ఆదిత్యునికి పట్టు వస్ర్తాలు అందించి కల్యాణోత్సవాన్ని తిలకించారు.