New Year Greetings: కొత్త ఏడాదిలో రెట్టింపు సంతోషం, సంక్షేమం, అభివృద్ధి
ABN , Publish Date - Jan 01 , 2026 | 07:14 AM
నూతన సంవత్సరం సందర్భంగా ఆంధప్రదేశ్ ప్రజలకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ వేర్వేరుగా శుభాకాంక్షలు తెలిపారు.
గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం నూతన సంవత్సర శుభాకాంక్షలు
అమరావతి, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సరం సందర్భంగా ఆంధప్రదేశ్ ప్రజలకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ వేర్వేరుగా శుభాకాంక్షలు తెలిపారు. ‘నూతన సంవత్సరం అందరికీ ఉల్లాసం, ఆనందం, శాంతి, శ్రేయస్సును అందించాలి. నూతన ఏడాది అందరికీ కొత్త అవకాశాలను తెస్తుందని ఆశిద్దాం’ అని గవర్నర్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందిస్తూ... ‘కూటమి ప్రభుత్వానికి 2025 మరచిపోలేని విజయాలను, ఎన్నో మైలు రాళ్లను అందించింది. అనేక సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి పనులకు నాంది పలికింది. ఏ రంగంలో చూసినా 2025 కేవలం ఒక గడిచిన సంవత్సరం కాదు. నాటి విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్‌ను వికాసం వైపు నడిపించిన గొప్ప మలుపు. ఇదే స్ఫూర్తితో 2026 నూతన సంవత్సరం అందరి జీవితాల్లో కొత్తకాంతులు నింపాలని మనసారా కోరుకుంటున్నా. కొత్త ఏడాదిలో ప్రజలకు రెట్టింపు సంతోషం, సంక్షేమం, అభివృద్ధి అందించేందుకు కృషి చేస్తానని మాటిస్తున్నా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని సీఎం పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓ ప్రకటన చేస్తూ... ‘గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 క్యాలెండర్ ఇయర్‌లో కూటమి ప్రభుత్వం ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది’ అని పేర్కొన్నారు.