జనాభా దామాషాన బీసీలకు రిజర్వేషన్లు
ABN , Publish Date - Apr 11 , 2026 | 03:10 AM
జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని కేంద్రంతో చర్చించాలని బీసీ సంక్షేమ సంఘాల నేతలు సీఎం చంద్రబాబును కోరారు.
కేంద్రంతో చర్చించి ఒప్పించండి.. సీఎంను కోరిన బీసీ సంఘ నేతలు
అమరావతి, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని కేంద్రంతో చర్చించాలని బీసీ సంక్షేమ సంఘాల నేతలు సీఎం చంద్రబాబును కోరారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు, జాతీయ జె.శ్రీనివాస గౌడ్ నేతృత్వంలో సంఘ నేతలు శుక్రవారం సచివాలయంలో సీఎంను కలిసి వినతి పత్రాలు అందించారు. బీసీలకు రక్షణ చట్టాన్ని కూడా త్వరితగతిన తీసుకురావాలని కోరారు. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు, కేంద్రంతో మాట్లాడి ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయించడంతో పాటు ఓబీసీ సబ్‌ప్లాన్ రూపొందించి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, ప్రభుత్వ శాఖల్లో బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. సీఎం మాట్లాడుతూ కేంద్రం పరిధిలో ఉన్న అంశాలను వారితో సంప్రదించి నెరవేర్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. బీసీలకు పూర్తి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. బీసీల అభ్యున్నతి, సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు.