లే ‘అవుట్’లు!
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:14 AM
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన కాలనీల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. సెంటు, సెంటున్నర చొప్పున ప్రభుత్వం వచ్చిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలు సదుపాయాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. అంతర్గత రోడ్లు అభివృద్ధికి నోచుకోకపోవడంతో వర్షాకాలం ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ వేసవిలోనైనా రోడ్లను అభివృద్ధి చేయాలని వేడుకుంటున్నారు.
-ప్రభుత్వ కాలనీల్లో కనీస సౌకర్యాలు కరువు
- వైసీపీ హయాంలో ఆర్భాటంగా లే అవుట్‌ల ఏర్పాటు
- సెంటు, సెంటున్నర చొప్పున స్థలాల కేటాయింపు
- మౌలిక సదుపాయలు కల్పించకుండా వదిలేసిన నాటి పాలకులు
- ఇళ్లు నిర్మించుకున్న వారికి తప్పని నరకయాతన
- అంతర్గత రోడ్లు అభివృద్ధి చేయాలని వేడుకోలు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన కాలనీల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. సెంటు, సెంటున్నర చొప్పున ప్రభుత్వం వచ్చిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలు సదుపాయాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. అంతర్గత రోడ్లు అభివృద్ధికి నోచుకోకపోవడంతో వర్షాకాలం ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ వేసవిలోనైనా రోడ్లను అభివృద్ధి చేయాలని వేడుకుంటున్నారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
గత వైసీపీ ప్రభుత్వంలో జిల్లాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 665 లేఅవుట్‌లలో 86,084 గృహాలను నిర్మాణం చేసేందుకు గాను లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. వీటిలో 65,043 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించగా, ఇప్పటి వరకు 33,783 గృహాల నిర్మాణాలను లబ్ధిదారులు పూర్తిచేశారు. మరో 29,403 గృహాల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరు నాటికి లబ్ధిదారులతో నూతన గృహాల ప్రవేశం చేయించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.
అధ్వానంగా రోడ్లు
కాలనీల్లోని రోడ్లను మెరక చేయకపోవడంతో గృహాల నిర్మాణం చేసేవారు, గృహాల నిర్మాణం పూర్తిచేసుకుని అక్కడ నివాసం ఉంటున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో ఈ లే అవుట్‌లలో మెరక పనులు నామమాత్రంగా చేసి బిల్లులు పెట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పంచాయతీరాజ్ విభాగానికి ఈ కాలనీల్లో అంతర్గత రహదారుల పనులను చేయించే బాధ్యతలను అప్పట్లో అప్పగించారు. వైసీపీ ప్రభుత్వంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, తదితరాల నేపథ్యంలో పనులు సక్రమంగా జరగలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాలనీల్లో గృహనిర్మాణాల పనులు తప్ప అంతర్గత రహదారులు, తాగునీరు, విద్యుత సౌకర్యం వంటి పనులు అంతంత మాత్రంగానే చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది కాలనీల్లో అంతర్గత రహదారుల అభివృద్ధికి సంబంధించి పనులు చేసేందుకు ఎలాంటి ప్రతిపాదనలు లేవని పంచాయతీరాజ్ అధికారులు చెబుతున్నారు. గతంలో రూపొందించిన పనులను చేసేందుకు మాత్రమే అవకాశం ఉందని, కొత్తగా నిధుల కేటాయింపులు ఏమీ జరగలేదని అధికారులు అంటున్నారు.
వర్షం వస్తే అడుగు పెట్టలేం..
లేఅవుట్‌లలో అంతర్గత రహదారులను అభివృద్ధి చేయకపోవడంతో అక్కడ నివాసం ఉండేవారు పడే ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. కొద్దిపాటి వర్షానికే బురదకయ్యలుగా మారుతున్నాయి. గోతులు పడి నడవడానికే ఇబ్బందికరంగా తయారవుతున్నాయి. ఉదాహరణకు మచిలీపట్నం సౌత మండల పరిధిలో రుద్రవరంలో ఏర్పాటు చేసిన రెండు లే అవుట్‌లలో వందలాది గృహాలను లబ్ధిదారులు నిర్మించుకున్నారు. గృహాల మధ్య అంతర్గత రహదారులకు సంబంధించిన పనులు కనీసంగానైనా చేయలేదు. దీంతో ఈ కాలనీలో నివాసం ఉంటున్నవారు ఇళ్లలోకి వెళ్లాలంటే పలు ఇక్కట్ల పాలవుతున్నారు. వర్షాకాలంలో కొద్దిపాటి వర్షానికే అంతర్గత రహదారులు బురదకయ్యలుగా మారిపోవడంతో బురద లోనే రాకపోకలు సాగించాల్సిన దుస్థితి నెలకొంది.
- గుండుపాలెం పంచాయతీ పరిధిలోని పల్లెపాలెం, వాడపాలెం పంచాయతీ పరిధిలోని వెంకట దుర్గాంబపురం తదితర ప్రాంతాల్లో ఇళ్లస్థలాలుగా ఇచ్చిన భూమి పల్లపు ప్రాంతంలో ఉంది. ఈ లేఅవుట్‌లో రహదారుల నిర్మాణ పనులు చేయకపోవడం, నల్లరేగడి నేల కావడంతో అక్కడ నివాసం ఉండేవారు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీకావు.
-మచిలీపట్నం నగరానికి చెందిన 16 వేల మంది పేదలకు కరగ్రహారంలోని లేఅవుట్‌లో సెంటు భూమి చొప్పున ఇళ్లస్థలాలు ఇచ్చారు. ఇక్కడ అంతర్గత రహదారులకు సంబంధించిన ఒక్క పనీ జరగలేదు.
-గన్నవరం మండలం కేసరపల్లి లేఅవుట్‌కు వెళ్లేందుకు రూ.3 కోట్లతో వంతెన నిర్మాణం కోసం అనుమతులు మూడేళ్ల క్రితం వచ్చాయని ప్రకటించారు. కానీ ఇంతవరకు ఈ వంతెన పనులు ప్రారంభించనేలేదు. ఎకరం భూమి రూ.70 లక్షల చొప్పున 60 ఎకరాలు కొనుగోలు చేసి 3వేల మందికి ఇక్కడ ఇళ్లస్థలాలు ఇచ్చారు. ఈ లేఅవుట్‌కు దారి కోసం వంతెన నిర్మాణాన్ని మాత్రం చేయకుండా పక్కనపెట్టేశారు. దీంతో ఇక్కడ గృహాలు నిర్మాణం చేసుకున్న లబ్ధిదారులు సరైన దారిలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలోని లే అవుట్‌లలో అంతర్గత రహదారులను మెరక చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ తరచూ అధికారులకు సూచిస్తున్నా, ఆ దిశగా అడుగులు పడనిస్థితి నెలకొంది. ఈ వేసవిలోనైనా లేఅవుట్‌లలో అంతర్గత రహదారులను మెరక చేయించాలని ప్రజలు కోరుతున్నారు.