లాసెట్ ఫలితాలు విడుదల
ABN , Publish Date - May 19 , 2026 | 05:59 AM
లా కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 4న నిర్వహించిన లాసెట్ ఫలితాలను మంత్రి లోకేశ్ సోమవారం ఎక్స్ ద్వారా విడుదల చేశారు.
అమరావతి, తిరుపతి(విశ్వవిద్యాలయాలు), మే 18(ఆంధ్రజ్యోతి): లా కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 4న నిర్వహించిన లాసెట్ ఫలితాలను మంత్రి లోకేశ్ సోమవారం ఎక్స్ ద్వారా విడుదల చేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఈ పరీక్షలను నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 23,996 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 19,197 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా 80శాతం మంది అర్హత సాధించారు. రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం (పీజీలాసెట్)కు 1904 మంది రాయగా 1752 (92.02శాతం) మంది అర్హత సాధించారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ పరీక్షను 17,533 మంది రాయగా 13,863 (79.07శాతం) మంది అర్హత సాధించారు. ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ పరీక్షను 4559 మంది రాయగా 3582 (78.57శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల కోసం https://cets.apsche.ap.gov.in/LAWCET వెబ్‌సైట్ చూడవ చ్చు. సమగ్ర సమాచారం కోసం 9552300009 నంబరులో సంప్రదించవచ్చు. ఉత్తీర్ణులైన వారిని మంత్రి లోకేశ్, పద్మావతి మహిళా వర్సిటీ వీసీ ఉమ, రిజిస్ట్రార్ ఉష, లాసెట్ కన్వీనర్ సీతాకుమారి అభినందించారు.
టాపర్స్ వీళ్లే...
ఐదేళ్ల బీఎల్/ఎల్‌ఎల్‌బీ ప్రవేశ పరీక్షలో ముప్పా స్నేహ టాపర్‌గా నిలిచారు. చెల్లుంకూరి దీక్షిత రెండో ర్యాంకు, మల్లాది వెంకట నాగ సత్య సాయి అక్షిత మూడో ర్యాంకు సాధించారు. రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం/ఎంఎల్ ప్రవేశ పరీక్షలో గౌరవ్ రాజ్ ఆర్య టాపర్ ర్యాంకు సాధించారు. బుద్ధ ఈశ్మిత రంజిని, పాపాన విశ్వంతి తర్వాతి ర్యాంకులు సాధించారు. మూడేళ్ల బీఎల్/ఎల్‌ఎల్‌బీ ప్రవేశ పరీక్షలో తిరుపతికి చెందిన ఎస్.అఫ్రిద్ బాషా టాపర్‌గా నిలిచారు. టి.శ్రీనివాసరావు, బోగాపురపు హర్షవర్ధన్ తర్వాతి ర్యాంకులు సాధించారు.