అమరావతికి చట్టబద్ధత కల్పించాలి
ABN , Publish Date - Jan 28 , 2026 | 06:14 AM
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ(టీడీపీపీ) నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు.
పార్లమెంటు అఖిల పక్ష సమావేశంలో టీడీపీపీ నేత లావు
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ(టీడీపీపీ) నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ తరఫున చేసిన ప్రతిపాదనలను శ్రీకృష్ణదేవరాయలు మీడియాకు వివరించారు. ‘‘పిల్లలపై తీవ్రంగా ప్రభావం చూపుతున్న సోషల్ మీడియాపై ఆంక్షలు విధించాలి. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా 30 రోజుల కంటే ఎక్కువకాలం జైలులో ఉంటే, ఐదేళ్ల కంటే ఎక్కువ నేరచరిత్ర ఉంటే.. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రి వంటి వారే స్వయంగా హోదాల నుంచి తప్పుకోవాలి. చార్జిషీట్ దాఖలై ఉంటే ఎన్నికల్లో పోటీ చేయకూడదు. స్పెషల్ కోర్టు ద్వారా ఒక టైమ్ లిమిట్ పెట్టి ఈ కేసులను విచారించే అంశంపై చర్చించాలి. అలాగే, మూడు రాజధానులంటూ గత వైసీపీ ప్రభుత్వం చేసిన గందరగోళాన్ని తొలగించాలి. ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కలిగించే బిల్లును తీసుకురావాలి. ‘జల్ జీవన్ మిషన్’ ద్వారా రాష్ట్రానికి రూ.26 వేల కోట్లు కేటాయించాలి. గతంలో రూ.26 వేల కోట్లు ప్రకటించినా.. 2019-24 మధ్య కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే వినియోగించారు. వైసీపీ ప్రభుత్వం నుంచి చొరవ లేకపోవడంతో నిధులు నిలిచిపోయాయి. వీటిని పునరుద్ధరించి రాష్ట్రానికి న్యాయం చేయాలి’’ అని సమావేశంలో ప్రస్తావించానని లావు తెలిపారు.