Share News

అవిశ్వాసం ఓ అరాచకం

ABN , Publish Date - Mar 11 , 2026 | 05:24 AM

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వారి అరాచకత్వానికి, కపటనీతికి నిదర్శనమని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టీడీపీపీ) నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అవిశ్వాసం ఓ అరాచకం

  • ప్రతిపక్షాలకు మెజారిటీ లేకున్నా రాజకీయ డ్రామాలు

  • లోక్‌సభలో టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఆగ్రహం

న్యూఢిల్లీ, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వారి అరాచకత్వానికి, కపటనీతికి నిదర్శనమని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టీడీపీపీ) నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చ సందర్భంగా.. ఆయన టీడీపీ తరఫున అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడారు. ఈ తీర్మానం కేవలం రాజకీయ లబ్ధి కోసం ఆడుతున్న డ్రామా అని విమర్శించారు. ఇది సభా గౌరవాన్ని తగ్గించేలా ఉందన్నారు. స్పీకర్‌ను తొలగించాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 94(సి) ప్రకారం సభలో సంపూర్ణ మెజారిటీ ఉండాలని, అయితే.. కనీస బలం లేని ప్రతిపక్షాలు ఇలాంటి తీర్మానాన్ని తీసుకరావడం వెనుక.. వార్తల్లో నిలవాలనే ఆరాటం తప్ప మరేమీ లేదని ఎద్దేవా చేశారు.

అప్రజాస్వామికంగా ఏపీ విభజన

2014 ఫిబ్రవరి 18న పార్లమెంటు తలుపులు మూసేసి, ప్రత్యక్ష ప్రసారాన్ని ఆపేసి నాటి కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన బిల్లును లోక్‌సభలో పాస్‌ చేయడం ప్రజాస్వామ్య చరిత్రలోనే బ్లాక్‌ డేగా నిలిచిపోతుందని లావు విమర్శించారు. ఆ రోజును ఏపీ ప్రజలు మర్చిపోరని అన్నారు. స్పీకర్‌ ఓం బిర్లాపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం అసహనంతో కూడుకున్నదే తప్ప.. ఇందులో పార్లమెంటరీ పనితీరు పట్ల ప్రతిపక్షాలకు నిజాయితీ లేదని జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ విమర్శించారు.


ఎంపీలకు రాష్ట్రపతి తేనీటి విందు

న్యూఢిల్లీ, మార్చి 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతిభవన్‌లోని కల్చరల్‌ సెంటర్‌లో ఏపీ, కర్ణాటక, కేరళ, హరియాణా, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ట్రాల ఎంపీలకు మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, మాజీ ప్రధాని దేవెగౌడ, కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు. ఏపీ నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ ఎంపీలు పాల్గొన్నారు. వీరిలో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, టీడీపీ ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు, ప్రసాదరావు, శబరి, అప్పలనాయుడు, వేమిరెడ్డి, అంబికా లక్ష్మీనారాయణ, బీదమస్తాన్‌రావు, నాగరాజు, బీకే పార్థసారథి, జనసేన ఎంపీ బాలశౌరి, బీజేపీ ఎంపీలు సత్యనారాయణ, పురందేశ్వరి తదితరులున్నారు.


  • హస్తినలో మంత్రి లోకేశ్‌

న్యూఢిల్లీ, మార్చి 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రి లోకేశ్‌ మంగళవారం రాత్రి ఢిల్లీకి వచ్చారు. విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, టీడీపీ ఎంపీలు సాదరస్వాగతం పలికారు. బుధవారం మెటా ఆధ్వర్యంలో నిర్వహించనున్న వాట్సప్‌ సిటిజన్‌ ఎంగేజ్‌మెంట్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ ఫోరమ్‌ సమావేశంలో లోకేశ్‌ పాల్గొననున్నారు.
Untitled-5 copy.jpg

Updated Date - Mar 11 , 2026 | 05:26 AM