Former CJI Justice N V Ramana: భాష అంతరిస్తే..జాతి అంతరించినట్టే
ABN , Publish Date - Jan 06 , 2026 | 05:13 AM
ఒక జాతి చరిత్ర, సంస్కృతి, వారసత్వం, ఆలోచనలకు ప్రాణం లాంటిది భాష అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.
మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్య
గుంటూరు(తూర్పు), జనవరి 5(ఆంధ్రజ్యోతి): ఒక జాతి చరిత్ర, సంస్కృతి, వారసత్వం, ఆలోచనలకు ప్రాణం లాంటిది భాష అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. అదే అంతరిస్తే జాతి పూర్తిగా అంతరించినట్లేనని స్పష్టం చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తెలుగును అభ్యసిస్తే ఉద్యోగాలు రావని చేస్తున్న విషప్రచారాన్ని అడ్డుకోవడంలో భాషాభిమానులు విఫలమవుతున్నారని అభిప్రాయపడ్డారు. కొన్ని రాష్ట్రాల్లో మాతృభాషను బోధించే పాఠశాలలు కూడా లేవని, ఏపీలో ఈ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పారు. మన సామెతలు, వ్యంగ్యాలు, ఛలోక్తులకు దూరమవుతున్నామన్నారు. పిలల్లకు తెలుగుపై మమకారం పెంచేలా తల్లిదండ్రులు కృషి చేయాలని సూచించారు. ప్రాథమిక విద్య తెలుగులో జరగాలని, ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో విధిగా తెలుగు భాషా శాఖను ఏర్పాటు చేయాలని, శాసనాలు, ఉత్తర్వులు తెలుగులోనే ఉండాలనే తీర్మానాలు చేసి ప్రభుత్వానికి అందజేయాలని తెలుగు మహాసభల నిర్వాహకులకు ఆయన సూచించారు.