ఘర్షణ ఆపేందుకు వెళ్లి .. ఒకరి బలి
ABN , Publish Date - Jun 09 , 2026 | 05:54 AM
భూమి రీసర్వే విషయంలో తలెత్తిన చిన్నపాటి వాగ్వాదం ఒకరి హత్యకు దారితీసింది. పోలీసుల కథనం మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం మొరసనపల్లి పంచాయతీ..
శ్రీసత్యసాయి జిల్లాలో ఘటన
చిలమత్తూరు, జూన్ 8(ఆంధ్రజ్యోతి): భూమి రీసర్వే విషయంలో తలెత్తిన చిన్నపాటి వాగ్వాదం ఒకరి హత్యకు దారితీసింది. పోలీసుల కథనం మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం మొరసనపల్లి పంచాయతీ ఎస్.ముద్దిరెడ్డిపల్లికి చెందిన శివప్పకు, భూమయ్యగారిపల్లికి చెందిన రామచంద్రప్పకు సర్వే నంబర్ 66లో ఉన్న భూమి విషయంలో వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు భూ రీసర్వే కోసం సోమవారం ఆ పొలం వద్దకు వెళ్లి రీ సర్వే చేస్తుండగా శివప్ప అడ్డుకున్నాడు. ఆ పొలంలో తనకు హక్కు ఉందని, ఈ విషయంపై కోర్టులో కేసు నడుస్తోందని, కోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు రీ సర్వే నిలిపివేయాలని డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో భూమి అనుభవంలో ఉన్న రామచంద్ర కుటుంబ సభ్యులకు, శివప్పకు గొడవ జరిగింది. దీంతో రెవెన్యూ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత కూడా ఇరువర్గాల మధ్య వాగ్వాదం కొనసాగి, తీవ్ర ఆగ్రహానికి లోనైన శివప్ప, కొడవలితో రామచంద్రపై దాడి చేయగా తీవ్రగాయాలయ్యాయి. అక్కడే ఉన్న భూమయ్యగారిపల్లికి చెందిన రామకృష్ణ(48) అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అతని తలపై శివప్ప కొడవలితో నరికాడు. అక్కడికక్కడే కుప్పకూలిన రామకృష్ణను ఆస్పత్రికి తరలించేందుకు 108కు సమాచారం అందించి, అతన్ని పొలం నుంచి మొరసనపల్లికి తీసుకువచ్చారు. అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది రామకృష్ణను పరీక్షించి, మృతి చెందినట్టు తెలిపారు. గాయపడ్డ రామచంద్రనును ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన శివప్ప చిలమత్తూరు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఏఎస్పీ మహేష్, సీఐ జనార్దన్, లేపాక్షి ఎస్‌ఐ నరేంద్ర ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రామకృష్ణ భార్య రాధ ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.