Revenue Department: ఎట్టకేలకు కదలిక
ABN , Publish Date - Jan 03 , 2026 | 04:40 AM
ఏళ్లకు ఏళ్లుగా రైతులు, భూ యజమానులను వేధిస్తున్న సమస్యల పరిష్కారం దిశగా రెవెన్యూ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆయా సమస్యలపై ‘ఆంధ్రజ్యోతి’ అనేక సందర్భాల్లో ప్రచురించిన కథనాలతో కదలిక వచ్చింది.
భూ సమస్యలకు పరిష్కారంపై కీలక నిర్ణయాలు
రెవెన్యూ యంత్రాంగానికి స్పష్టమైన విధి విధానాలు
అత్యధిక సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం
జేసీ నుంచి తహశీల్దార్‌కు పది కీలక అధికారాల బదిలీ
మరికొన్ని ఆర్డీవోకు...కొన్ని మాత్రమే జేసీ పరిధిలో
ఎడాపెడా రికార్డులు మార్చేయడం కుదరదు
సంబంధిత పట్టాదారుకు,వ్యక్తులకు నోటీసు ఇవ్వాల్సిందే
లేదంటే చర్యలు.. తప్పు జరిగితే వీఆర్వోదే బాధ్యత
ఐదు రకాల భూములకు మూడు నెలల్లో మోక్షం
22(ఏ) జాబితా నుంచి తొలగించేందుకు తుది గడువు
మార్గదర్శకాలు జారీ చేసిన స్పెషల్ సీఎస్ సాయిప్రసాద్
‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలపై రెవెన్యూ శాఖ స్పందన
రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయాలనుకుంటే సంబంధిత పట్టాదారులు, వ్యక్తులకు నేరుగా నోటీసులు ఇచ్చి తీరాలి. గ్రామ సచివాలయంలో నోటీసు ప్రదర్శించామంటే కుదరదు. ఈ విషయంలో నిబంధనల ఉల్లంఘన జరిగినా, ఫిర్యాదులు వచ్చినా వీఆర్‌ఓ, సంబంధిత అధికారిని బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటారు. రికార్డుల్లో జరిగే ఏ మార్పులకైనా వీఆర్‌ఓనే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఏళ్లకు ఏళ్లుగా రైతులు, భూ యజమానులను వేధిస్తున్న సమస్యల పరిష్కారం దిశగా రెవెన్యూ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆయా సమస్యలపై ‘ఆంధ్రజ్యోతి’ అనేక సందర్భాల్లో ప్రచురించిన కథనాలతో కదలిక వచ్చింది. భూ సమస్యల పరిష్కారంలో జాప్యం నివారణ, ఎడాపెడా భూ రికార్డుల్లో మార్పులకు అడ్డుకట్ట, సిబ్బంది అలసత్వం, నిర్లక్ష్యానికి ‘చెక్’ చెప్పే లా... పౌర సేవలు సులువు చేసేలా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ శుక్రవారం సవివరమైన ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని నిక్కచ్చిగా పాటించి తీరాల్సిందేనని రెవెన్యూ యంత్రాంగానికి స్పష్టం చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా... భూసమస్యలను పరిష్కరించే అధికారాలను వికేంద్రీకరించారు. ప్రతి దానికీ జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా... జేసీ అధికారాలను తహశీల్దార్, ఆర్డీవోలకు బదలాయించారు. దీంతో... మండల స్థాయిలోనే అత్యధిక సమస్యలు పరిష్కారమవుతాయి. మరికొన్ని ఆర్డీవో స్థాయిలో... అతి స్వల్ప సంఖ్యలో మాత్రమే జేసీ స్థాయి పరిశీలనకు వెళతాయి.
తహసీల్దార్ అధికారాలివే...
సివిల్, రెవెన్యూ కోర్టులు ఇచ్చిన ఆదేశాల మేరకు రికార్డుల్లో సవరణలు చేసే అధికారాన్ని తహశీల్దార్‌కు బదలీ చేశారు. ఇంకా భూమి కేటాయింపు, భూ సేకర ణ, ల్యాండ్ అసైన్‌మెంట్, భూమి మార్పిడి, ఒక భూమి ఖాతా నుంచి అవసరం లేని ఆధార్‌ను తొలగించడం, పట్టాదారుకు ఒకటికి మించిన ఖాతాలు ఉన్నట్లయితే అవసరం లేని వాటిని తొలగించడం, ప్రైవేటు నోషనల్ ఖాతాలను రెగ్యులర్‌గా మార్చడం, జీరో ఖాతాలను రెగ్యులర్‌గా మార్చడం... ఈ అధికారాలన్నీ ఇకపై తహశీల్దారుకే ఉంటాయి. అంటే... రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో సింహభాగానికి మండల స్థాయిలోనే పరిష్కారం లభిస్తుంది.
ఆర్డీవో పరిధిలో...: రీ సర్వే గ్రామాల్లో మ్యుటేషన్‌లో సవరణలు అంటే... సర్వే నంబర్, భూమి స్వభావం, పట్టాదారు పేరు, భూమి ఎలా వచ్చింది, సాగుదారు పేరు వంటి వాటిని ఇక ఆర్డీవోనే రికార్డుల్లో నమోదు చేస్తారు. రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్‌ఓఆర్)లో భూమి విస్తీర్ణంలో సవరణ, ల్యాండ్ పార్సిల్ మ్యాప్ (ఎల్‌పీఎమ్)లో తప్పుగా మ్యాప్ చేసిన ఖాతాను సరిదిద్దే అధికారం కూడా జేసీ నుంచి ఆర్డీవోకు బదిలీ చేశారు. ఇంకా, ఎల్‌పీఎమ్‌లో పట్టాదారును చేర్చడం, రికార్డుల్లో మిస్ అయిన సర్వే నంబర్‌ను జతచేయడం, భూమి స్వభావంలో అవసరమున్న సవరణలు వివాద రిజిస్టర్‌లో పేర్లు నమోదు - తొలగింపు అధికారాన్ని కూడా ఆర్డీవోకు అప్పగించారు.
జేసీ వద్ద ఉండే అధికారాలు
ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చే ప్రక్రియనే జేసీ నేతృత్వంలోనే జరగాలని ప్రభుత్వం నిర్దేశించింది. స్వాతంత్య్ర సమరయోధులు, సర్వీసులో ఉన్న సైనికులు, మాజీ సైనికులకు భూములు అసైన్‌మెంట్ చేసే అధికారం జేసీ వద్దే ఉంటుంది.