Share News

ఆదోనిలో ’భూ’ రాజకీయం..

ABN , Publish Date - Apr 27 , 2026 | 11:45 PM

ఆదోనిలో ‘భూ’ రాజకీయం పతాకస్థాయికి చేరింది.

 ఆదోనిలో ’భూ’ రాజకీయం..
బోర్డును విరగొట్టిన దుండగులు

ప్రభుత్వ భూమిలో

ఏర్పాటు చేసిన బోర్డు ధ్వంసం

అర్ధరాత్రి కబ్జాదారుల

’సైలెంట్‌’ ఆపరేషన్‌

ప్రజాప్రతినిధులు, అధికారులతో

డీల్‌ కుదిరినట్లు అనుమానాలు?

ఆదోని, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): ఆదోనిలో ‘భూ’ రాజకీయం పతాకస్థాయికి చేరింది. ఇది ప్రభుత్వ భూమి అంటూ అధికారులు ఏర్పాటు చేసినా బోర్డునే కబ్జాదారులు ధ్వంసం చేసేశారు. ఎమ్మెల్యే, అధికారుల హెచ్చరికలను బేఖాతర్‌ చేశారు. ఆ దోని మండగిరి ప్రాంతంలోని సర్వే నంబర్‌ 630/ఏలో 3.33 ఎకరాల రస్తా పోరంబోకు భూమి చుట్టూ ఇప్పుడు ’పొలిటికల్‌ గేమ్‌’ నడుస్తోంది. 2026 మార్చి 4న ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చిన ’భూ బకాసురులు’ కథనం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఎమ్మెల్యే పార్థసారథి, సబ్‌కలెక్టర్‌ అజయ్‌కుమార్‌, తహసీల్దార్‌ శేషఫణి రంగంలోకి దిగి క్షేత్రస్థాయి విచారణ జరిపారు. ఆ భూమి ప్రభుత్వానిదేనని తేల్చి చెబుతూ ఏప్రిల్‌ 9న అధికారికంగా బోర్డును ఏర్పాటు చేశారు. అయితే ఆ బోర్డును ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం స్థానికంగా చర్చానీయాంశంగా మారింది. కబ్జాదారులతో లోపాయికారీ ఒప్పందాలు కుదిరాయని, అందుకే బోర్డును ధ్వంసం చేసినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధులు ఒకవైపు భూములను కాపాడాలని చెబుతూనే మరోవైపు కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో అసలు సూత్రధారుల ఎవరన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికారులు ఇప్పటికైనా స్పందించి ధ్వంసమైన బోర్డు స్థానంలో శాశ్వత రక్షణ చర్యలు చేపడతారా..? లేక ఈ వివాదాన్ని ఇలాగే వదిలేస్తారా అన్నది వేచి చూడాలి.

Updated Date - Apr 27 , 2026 | 11:45 PM