భూ సమస్యలకు ఇక చెక్!
ABN , Publish Date - May 07 , 2026 | 12:24 AM
గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘వన్ మంత.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స్’ కార్యక్రమాన్ని గురువారం నుంచి ప్రారంభించనుంది. మండల స్థాయి అధికారులు గ్రామానికే వచ్చి నాలుగు విడతల్లో గ్రామంలోని సమస్యలన్నీ పరిష్కరించడమే దీని లక్ష్యం.
- నేటి నుంచి ‘వన్ మంత.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స్’ అమలు
- నూతన కార్యక్రమంతో గ్రామాలకు మండలస్థాయి అధికారులు
- రెవెన్యూతో పాటు ఇతర సమస్యలకు అక్కడే పరిష్కారం
- నాలుగు విడతల్లో గ్రామంలో సమస్యలు లేకుండా చేయడమే లక్ష్యం
గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘వన్ మంత.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స్’ కార్యక్రమాన్ని గురువారం నుంచి ప్రారంభించనుంది. మండల స్థాయి అధికారులు గ్రామానికే వచ్చి నాలుగు విడతల్లో గ్రామంలోని సమస్యలన్నీ పరిష్కరించడమే దీని లక్ష్యం.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
గ్రామీణ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూమి సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘వన్ మంత, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్’ పేరుతో అమలు చేయనుంది. గురువారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. భూముల సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటికే రెవెన్యూ క్లినిక్‌లను ఆర్డీవో కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్నారు. దీంతో పాటు కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం)లోనూ వివిధ సమస్యలపై కలెక్టర్ నేతృత్వంలో అర్జీలు స్వీకరిస్తున్నారు. అయినా భూమి సమస్యలు ఇంకా పెండింగ్‌లోనే ఉండిపోతున్నాయి. దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు తాజాగా మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ‘వన్ మంత.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స్’ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. నెల్లూరు జిల్లాలో గతేడాది ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. అక్కడ భూమి సమస్యలు, ఇతరత్రా సమస్యలు పరిష్కారానికి నోచుకుని కొంతమేర సత్ఫలితాలు రావడంతో అన్ని జిల్లాల్లో గురువారం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు.
మొదటి వారం అర్జీల స్వీకరణ
ఎంపిక చేసిన గ్రామాల్లో ‘వన్ మంత.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స్’ కార్యక్రమం గురువారం నిర్వహిస్తారు. బుధవార సాయంత్రం టాంటాం ద్వారా ప్రచారం చేస్తారు. ఉదయం 10 గంటలకు ఎంపిక చేసిన గ్రామాలకు తహసీల్దార్, ఎంపీడీవో, దేవదాయశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్, నీటి పారుదల, రహదారులు భవనాలు, పంచాయతీరాజ్ శాఖల అధికారులు చేరుకుంటారు. సాయంత్రం వరకు అక్కడ ఉంటారు. భూమి సమస్యలకు సంబంధించి అడంగల్‌లో పొరపాట్లు, రికార్డ్ ఆఫ్ రైట్స్(ఆర్‌వోఆర్), 1-బీ, 22-ఏలోఉన్న భూములు, పట్టాదార్ పాస్ పుస్తకాలలో భూమి విస్తీర్ణం తగ్గడం, రైతుల పేర్లు, వారి తల్లిదండ్రుల పేర్లు తప్పుగా నమోదు కావడం, ఇతరత్రా అంశాలకు సంబంధించి రైతులు, ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. ఆయా గ్రామాల్లో రహదారులు, ఇళ్ల స్థలాలు తదితర అంశాలకు సంబంధించిన రెవెన్యూ రికార్డుల్లో ఉన్న వివరాలను చదివి వినిపిస్తారు. కలెక్టర్ పర్యవేక్షణలో ఆర్డీవోలు, డిప్యూటీ, సబ్ కలెక్టర్‌లు ఈ కార్యక్రమాన్ని నోడల్ అధికారి హోదాలో పర్యవేక్షిస్తారు. అప్పటికపుడు పరిష్కరించే సమస్యలు ఏమైనా ఉంటే వాటికి తక్షణమే పరిష్కారం చూపుతారు.
మిగిలిన గురువారాల్లో ఇలా..
మొదటి గురువారం వచ్చిన అర్జీలను పరిశీలించి, ఇందుకు సంబంధించిన అన్ని రికార్డులతో సహా అధికారులు గ్రామాలకు వెళతారు. మొదటి వారంలో ఆయా గ్రామాల్లో వచ్చిన భూమి సమస్యలు, ఇతరత్రా సమస్యలపై వచ్చిన అర్జీల ఆధారంగా ఇరు వర్గాలకు ముందస్తుగానే సమాచారం ఇచ్చి రెండో గురువారం నాడు హాజరు కావాలని చెబుతారు. వారి సమక్షంలోనే రైతుల వద్ద ఉన్న పత్రాలు, రెవెన్యూ రికార్డుల ఆధారంగా వివాదంలో ఉన్న భూముల వద్దకు వెళ్లి సర్వే చేస్తారు. రెవెన్యూ రికార్డులు, సర్వే చేసిన సమయంలో వచ్చిన నివేదికలను రైతులకు వివరిస్తారు. మూడో గురువారం అధికారులు గ్రామాలకు వెళ్లి అన్ని భూములు, ఇతర సమస్యలకు సంబంధించి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలను ఆధారంగా చేసుకుని సమస్యలకు పరిష్కారం చూపుతూ సంబంధిత వివరాలను ఇరుపక్షాల సమక్షంలో రికార్డుల్లో నమోదు చేస్తారు. నాలుగో గురువారం నాడు గ్రామసభ నిర్వహించి ఈ కార్యక్రమం పారదర్శకంగా జరిగిందని ప్రజలకు తెలియజేందుకు వచ్చిన అర్జీలు, పరిష్కరించిన సమస్యలు, వాటికి సంబంధించిన ఆధారాలు, తదితర అంశాలను చదివి వినిపిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా తీసుకున్న చర్యలను కలెక్టర్‌కు నివేదిక రూపంలో అందజేస్తారు.