Share News

బాపట్ల జిల్లా ఎస్పీ కుటుంబ సభ్యులపై భూ కబ్జా ఆరోపణలు

ABN , Publish Date - Feb 27 , 2026 | 03:29 AM

తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండ గ్రామంలో 11.71 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు కబ్జాకు గురయ్యాయి.

బాపట్ల జిల్లా ఎస్పీ కుటుంబ సభ్యులపై భూ కబ్జా ఆరోపణలు

  • భాకరాపేట మాజీ సర్పంచ్‌ కుటుంబ ఆధీనంలో 11.71 ఎకరాల భూములు

  • విచారణకు ఆదేశించిన ప్రభుత్వం.. ఆక్రమణదారులకు నోటీసులు

  • 2న సంబంధిత డాక్యుమెంట్లతో హాజరు కావాలని ఆదేశం

  • మాజీ సర్పంచ్‌ భర్త టీడీపీ నేత.. కుమారుడు బాపట్ల జిల్లా ఎస్పీ

తిరుపతి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండ గ్రామంలో 11.71 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు కబ్జాకు గురయ్యాయి. భాకరాపేట మాజీ సర్పంచ్‌ కుటుంబం ఆధీనంలో ఈ భూములున్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. వాటిపై స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీంతో భూములు సర్వే చేసిన అధికారులు కబ్జా వాస్తవమేనని తేల్చారు. మాజీ సర్పంచ్‌ కుటుంబానికి నోటీసులు జారీ చేశారు. దేవరకొండలోని ప్రభుత్వ, అటవీ భూములను భాకరాపేటకు చెందిన బోరుగుడ్ల నాగమ్మ కుటుంబం ఆక్రమించుకుని కంచె వేసుకుందని గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కృష్ణమూర్తి, పలువురు రైతులు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగమ్మ 2009-14 మధ్యకాలంలో భాకరాపేట సర్పంచ్‌గా పనిచేశారని విచారణలో వెల్లడైంది. ఆమె భర్త చిన్నయ్య టీడీపీ నాయకుడు కాగా, ఆమె కుమారుడు ఓ జిల్లాకు ఎస్పీగా పనిచేస్తున్నట్టు తెలిసింది. అయినా పార్టీ కార్యాలయానికి అందిన ఫిర్యాదులపై ప్రభుత్వం స్పందించింది. ఫిర్యాదులను తిరుపతి జిల్లా కలెక్టర్‌కు పంపి విచారించాలని ఆదేశించింది. కలెక్టర్‌ ఆదేశాలతో చిన్నగొట్టిగల్లు తహసీల్దారు భాగ్యలక్ష్మి సిబ్బందితో కలసి రికార్డులు పరిశీలించడంతో పాటు సంబంధిత భూములను సర్వే చేయించారు. మొత్తం 11.71 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు నాగమ్మ ఆక్రమణలో ఉన్నట్టు తేల్చారు. ఆ భూముల్లో మామిడి తోట అభివృద్ధి చేసుకుని చుట్టూ కంచె వేశారని నిర్ధారించారు. సంబంధిత భూములను స్వాధీనం చేసుకునేందుకు నాగమ్మకు తహసీల్దారు నోటీసు జారీ చేశారు. ఆ భూములకు సంబంధించిన రికార్డులు, డాక్యుమెంట్లతో మార్చి 2న హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.


హైకోర్టులో పిటిషన్‌.. కౌంటర్‌ దాఖలుకు ఆదేశం

అమరావతి: తిరుపతి జిల్లా, చిన్నగొట్టిగల్లు మండలం, దేవరకొండ గ్రామంలోని వివిధ సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమిని బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్‌ కుటుంబ సభ్యులు ఆక్రమించారంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, తిరుపతి జిల్లా కలెక్టర్‌, ఆర్‌డీవో, చిన్నగొట్టిగల్లు తహశీల్దార్‌, ఉమామహేశ్వర్‌ తల్లి నాగమ్మకు నోటీసులు జారీ చేసింది. విచారణను మార్చి 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ ఉత్తర్వులు ఇచ్చారు. దేవరకొండలో మొత్తం 15.96 ఎకరాల్లో ఉన్న ఆక్రమణలు తొలగించేలా రెవెన్యూ అధికారులను ఆదేశించాలని కోరుతూ బాపట్ల జిల్లా చుండూరు గ్రామానికి చెందిన గుడేటి బాలకోటిరెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు.

Updated Date - Feb 27 , 2026 | 03:30 AM