Share News

Visakhapatnam: గూగుల్‌ డేటా సెంటర్‌కు భూసేకరణ వేగవంతం

ABN , Publish Date - Jan 14 , 2026 | 04:35 AM

విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్‌ డేటా సెంటర్‌కు భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది.

Visakhapatnam: గూగుల్‌ డేటా సెంటర్‌కు భూసేకరణ వేగవంతం

  • రైతులతో ఎమ్మెల్యే గంటా సమావేశం

విశాఖపట్నం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్‌ డేటా సెంటర్‌కు భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో రైతులు భూములు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తంచేశారు. మార్చి నెలలో డేటా సెంటర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని భావిస్తున్న తరుణంలో గంటా రైతులను పిలిచి మాట్లాడారు. రైతుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం రేటు కంటే ఎక్కువ పరిహారం ఇవ్వడానికి అంగీకరించింది. దాంతో పాటు ఎకరానికి 20 సెంట్ల భూమి, ఔట్‌సోర్సింగ్‌లో ఒక ఉద్యోగం, షాపింగ్‌ కాంప్లెక్స్‌లో ఒక షాపు, మూడు సెంట్ల ఇంటి స్థలాన్ని ఇస్తామని హామీ ఇచ్చింది. సమావేశంలో రైతులు మాట్లాడుతూ గ్రామానికి ప్రధాన రహదారితో పాటు కల్యాణ మండపం మంజూరు చేయాలని కోరారు. అలాగే ప్రభుత్వ భూముల్లో చెట్లు పెంచుకున్న 520 మంది రైతులకు ఇంటి నిర్మాణం కోసం మూడు సెంట్లు ఇస్తామని చెప్పారని, దానిని ఐదు సెంట్లకు పెంచాలని కోరారు. ఆ గ్రామంలో వైసీపీ నాయకులు కూడా ముందే భూములు ఇవ్వడానికి ముందుకు రావడంతో.. మిగిలినవారు కూడా రెవెన్యూ అధికారుల సమక్షంలో సమ్మతిని తెలియజేస్తూ లేఖలు ఇచ్చారు.

Updated Date - Jan 14 , 2026 | 04:49 AM