Share News

ఏమో నాకు తెలియదు

ABN , Publish Date - Mar 18 , 2026 | 04:25 AM

ఏది అడిగినా.. ‘ఏమో నాకు తెలియదు’ అంటూ మౌనముద్ర! లేదంటే ముక్తసరి సమాధానాలతో సరి! కారు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏ-2, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు సతీమణి లక్ష్మీదుర్గ వరుసగా రెండో రోజు కూడా విచారణకు ఏమాత్రం సహకరించలేదు.

ఏమో నాకు తెలియదు

  • మౌనముద్ర, ముక్తసరి జవాబులు

  • డ్రైవర్‌ హత్య, డోర్‌ డెలివరీ కేసులో రెండోరోజూ లక్ష్మీదుర్గను ప్రశ్నించిన సిట్‌

  • ముసుగు ధరించి విచారణకు.. బంధువులు, అనుచరుల ‘అతి’

కాకినాడ, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ఏది అడిగినా.. ‘ఏమో నాకు తెలియదు’ అంటూ మౌనముద్ర! లేదంటే ముక్తసరి సమాధానాలతో సరి! కారు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏ-2, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు సతీమణి లక్ష్మీదుర్గ వరుసగా రెండో రోజు కూడా విచారణకు ఏమాత్రం సహకరించలేదు. ముఖం కనిపించకుండా, ముసుగు ధరించి మంగళవారం ఆమె విచారణకు హాజరయ్యారు. యథాప్రకారమే విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పినట్టు సమాచారం. పోలీసులను సైతం తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని తెలిసింది. డ్రైవర్‌ హత్య సమయంలో లక్ష్మీదుర్గ అక్కడే ఉన్నట్టుగా పోలీసులు పూర్తిఆధారాలతో అనుబంధ చార్జిషీటు దాఖలు చేయడం, ఏ2గా ఆమె పేరును చేర్చడంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ సమయంలో ఆమె ఎక్కడున్నారు? ఎవరెవరిని కలిశారు? అనేది సిట్‌ అధికారులు ఆరా తీసినట్టు తెలిసింది. అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆమె పెద్దగా నోరు మెదపలేదని తెలిసింది. ఏమి అడిగినా తనకేమీ తెలియదని, హత్య సమయంలో తాను అక్కడలేనని ముక్తసరిగా సమాధానాలు చెప్పినట్టుగా సమాచారం. తొలిరోజు పలు విషయాలపై లక్ష్మీదుర్గను ప్రశ్నించిన అధికారులకు రెండో రోజూ కూడా ఆమె నుంచి సరైన సమాధానాలేవీ లభించలేదని తెలుస్తోంది. బుధవారం కూడా విచారణ కొనసాగనుంది. కాగా, తొలిరోజులానే రెండో రోజు కూడా అనంతబాబు అనుచరులు ‘అతి’ చేశారు. లక్ష్మీదుర్గను విచారణకు తీసుకు వచ్చే సమయంలో, తీసుకువెళ్లే సమయంలో కుటుంబసభ్యులు, అనుచరులు హడావుడి చేశారు. ఆమెను కారులో తీసుకువచ్చినట్టుగా నటించి, మీడియా దృష్టిని మరల్చేలా ప్రవర్తిచారు.


ఆ తర్వాత స్కూటీపై విచారణ జరిగే ఎస్‌డీపీవో కార్యాలయంలో దించారు. విచారణ పూర్తయిన తర్వాత లక్ష్మీదుర్గ ఒక్కరే నడుచుకుంటూ గేటు వరకు వచ్చారు. అక్కడి నుంచి బంధువులు ఆమెను స్కూటీపై ఎక్కించుకుని తీసుకువెళ్లారు. విచారణ జరుగుతున్న సమయంలో అటువైపు.. ఎవరు వస్తున్నారు? ఎవరెవరు అక్కడ ఉంటున్నారనేది రెక్కీ నిర్వహించారు. కాకినాడ వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అనుచరులు కారులో ఎస్‌డీపీవో కార్యాలయం పరిసర ప్రాంతాల్లో వేచి ఉన్నారు.

Updated Date - Mar 18 , 2026 | 04:30 AM