‘లడ్డూ జిహాద్’ జరిగిందేమో!
ABN , Publish Date - Feb 10 , 2026 | 03:59 AM
లడ్డూ కల్తీపై అప్పటి టీటీడీ పాలకవర్గం నైతిక బాధ్యత వహించి, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ చేశారు.
కల్తీపై అప్పటి పాలకవర్గం క్షమాపణ చెప్పాలి
ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద
డాబాగార్డెన్స్ (విశాఖపట్నం), ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): లడ్డూ కల్తీపై అప్పటి టీటీడీ పాలకవర్గం నైతిక బాధ్యత వహించి, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ చేశారు. లడ్డూ కల్తీపై ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ ఆందోళన చెందుతున్నారని, దీనిపై రాజకీయాలు చేయడం తక్షణమే మానుకోవాలని, లడ్డూ పవిత్రతను కాపాడాలని కోరారు. సోమవారం విశాఖ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూలో నాణ్యత లేదని, కల్తీ జరిగిందని కూటమి నాయకులు మాట్లాడినా తాము పట్టించుకోలేదని తెలిపారు. కానీ ప్రస్తుతం సిట్ నివేదిక చూసి హిందువుల గుండెలు పగిలాయన్నారు. లవ్ జీహాద్ తరహాలో లడ్డూ జీహాద్ జరిగిందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. రసాయనాలు కలిసిన లడ్డూ తిని అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని, హిందువుల శక్తిని తగ్గించే కుట్ర జరుగుతోందన్న భావన కలుగుతోందని పేర్కొన్నారు. తప్పు చేసినవారు వేంకటేశ్వరస్వామి శిక్ష నుంచి తప్పించుకోలేరన్నారు. ఏడు కొండలను రెండు కొండలు అన్న రాజశేఖర్‌రెడ్డికి ఎంతటి శిక్ష పడిందో అందరూ చూశారన్నారు. ఇప్పటికైనా లడ్డూ వివాదానికి ముగింపు పలకాలని కోరారు.