సర్కార్ గీ చైర్మన్
ABN , Publish Date - Feb 28 , 2026 | 05:47 AM
శాసనమండలిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తిరుమల లడ్డూ ప్రసాదంపై చర్చ ను గురువారం పాలకపక్షమే అడ్డుకుందని చైర్మన్ మోషేన్‌రాజు అన్నారు.
మండలిలో ‘లడ్డూ చర్చ’పై వాదోపవాదాలు
పాలకపక్షంపై మోషేన్‌రాజు ఆరోపణలు
ఖండించిన అధికార పక్ష సభ్యులు
అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): శాసనమండలిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తిరుమల లడ్డూ ప్రసాదంపై చర్చ ను గురువారం పాలకపక్షమే అడ్డుకుందని చైర్మన్ మోషేన్‌రాజు అన్నారు. చైర్‌ను అవమానించారని ఆరోపించారు. దీనిని మంత్రు లు, టీడీపీ ఎమ్మెల్సీలు ఖండించారు. చర్చను వైసీపీయే అడ్డుకుందని చెప్పారు. శుక్రవారం మండలి సమావేశం ప్రారంభం కాగానే.. చైర్మన్ మాట్లాడారు. ‘నిన్నటి రోజు(గురువారం) సభ పునఃప్రారంభమైనప్పుడు.. ప్ర శ్నోత్తరాలను డీమ్డ్ చేసిన తర్వాత కూడా అధికార పార్టీ సభ్యులు రూల్స్‌కు విరుద్ధంగా క్వశ్చన్ అవర్ జరిపించాలని అడిగి.. లడ్డూ ప్రసాదంపై లఘు చర్చను అడ్డుకునే ప్రయ త్నం చేయడం విచారకరం. అదే సందర్భంలో ఆర్థిక మంత్రి నాపై కొన్ని సత్యదూరమైన ఆరోపణలు చేయడం కూడా కరెక్టు కాదు. లఘు చర్చ జరిపే సన్నాహక చర్యల్లో భాగం గా సెక్రటరీ జనరల్ సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శికి లఘు చర్చ టాపిక్‌పై నోట్స్ పంపిన ప్రతిని చూపించి.. స్టేట్‌మెంట్ ఇవ్వడానికి నేను అంగీకారం తెలిపిన పత్రంగా నమ్మబలికే ప్రయత్నం చేసి, సభను తప్పుదోవ పట్టించే యత్నం చేశారు. అదీ కరెక్టు కాదు. ఇరు పక్షాల సభ్యులూ సభ గౌరవాన్ని పెంపొందించే విధంగా నడుచుకోవాలని తెలియజేసుకుంటున్నా’ అని తెలిపారు. పలువు రు మంత్రులు, అధికార పార్టీ సభ్యులు తమ స్థానాల వద్ద నిలబడి ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరు మాట్లాడి న దానిపై క్లారిటీ ఇవ్వాలి కదా అని మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడే ప్రయత్నం చేయ గా.. వద్దని చైర్మన్ వారించారు. మంత్రులు, అధికార పార్టీ సభ్యులు సార్ సార్ అంటుండగా.. ‘వదిలేయండి.. చైర్‌ను ఇంకా అవమానించాలనుకుంటే కరెక్టు కాదు’ అని మోషేన్‌రాజు అన్నారు. మీరంటే మాకు అపారమైన గౌరవం ఉందంటూ మంత్రులు అచ్చెన్నాయు డు, మనోహర్, బాలవీరాంజనేయస్వామి, పలువురు టీడీపీ సభ్యులు అన్నారు. వారు చైర్మన్ సీటును అగౌరవపరిచారని వైసీపీ సభ్యులు వ్యాఖ్యానించారు. చైర్మన్ జోక్యం చేసుకుని.. ‘జరిగింది నాకు.. మీకు సంబంధం లేదు కదా’ అని వారినుద్దేశించి అన్నారు.
వాళ్లే భయపడుతున్నారు: అచ్చెన్న
చైర్మన్ అంటే తమకు అపారమైన గౌరవమని అచ్చెన్నాయుడు చెప్పారు. ‘పార్లమెంట రీ సంప్రదాయాల ప్రకారం ప్రతిపక్షం ఒక సబ్జెక్టు మీద చర్చించాలంటే నోటీసివ్వాలి. నోటీసివ్వకపోయినా బీఏసీలో అంగీకరించాం కాబట్టి మేమే ఒక అడుగు ముందుకొచ్చి నిన్న చర్చించడానికి కాపీలన్నీ సిద్ధం చేసి,మండలిలో పెట్టాం. ముందు రోజు అసెంబ్లీ లో ప్రతిపక్షం లేకపోయినా కూడా.. మా సభ్యుడు నరేంద్రతో నోటీసు ఇప్పించి, కాపీలన్నీ సభలో పెట్టి, సంబంధిత మంత్రి దానిని చదివిన తర్వాత చర్చ సాగింది’ అని తెలిపారు. ‘అది అసెంబ్లీలో అవ్వొచ్చు.. ఇక్కడ (మండలిలో) ప్రొసీడింగ్స్ వేరు’ అని చైర్మన్ అన్నారు. తాము చెప్పేది విన్న తర్వాత ఆయ న మాట్లాడాలని అచ్చెన్న కోరారు. ‘మండలి లో వైసీపీ వాళ్లు నోటీసివ్వకపోయినా మీ దగ్గర బీఏసీలో అంగీకరించాం కాబట్టి.. మీ మాటను గౌరవించాలి కాబట్టే.. వాళ్లకు ఆసక్తి లేకపోయినా మేం బాధ్యత కలిగిన ప్రభుత్వంగా కాపీలన్నీ ఇక్కడ పెట్టి మా మంత్రి చదువుతారని చెబితే.. ఆయన ప్రసంగించకుండా అడ్డుకోవడం మీరే చూశారు. దానిపైనే సభా వ్యవహారాల మంత్రి పయ్యావుల మాట్లాడుతుంటే.. వాస్తవాలు బయటకు వస్తాయని వాళ్లు భయపడ్డారు. మేం వెనకడుగు వేయం. తిరుపతి లడ్డూపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకరోజు చాలకపోతే 4, 5, 6 తేదీల్లో మూడు రోజులూ చర్చించడానికి సిద్ధం’ అని స్పష్టం చేశారు.
అర్ధాంతరంగా ముగిసిన సమావేశం
అనంతరం.. లడ్డూప్రసాదంపై వైసీపీ సభ్యులు రమేశ్ యాదవ్, భరత్, సుబ్రహ్మణ్యం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే లడ్డూ అంశంపై చర్చ జరపాలని వారు పట్టుబట్టారు. మంత్రి నాదెండ్ల మనోహర్ సభ్యుల ప్రశ్నకు సమాధానం ఇస్తుండగా.. వైసీపీ ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టారు. లడ్డూ అం శంపై చర్చ జరపాలని ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేశారు. దీంతో టీడీపీ సభ్యులు కూడా పోడియం వద్దకు వెళ్లి సభను ఆర్డర్ లో పెట్టాలని చైర్మన్‌ను కోరారు. అయితే ప్రశ్నోత్తరాలను సాగనివ్వకుండా వైసీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. దీంతో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. అనంతరం మంత్రులు చైర్మన్ చాంబర్‌కు వెళ్లారు. ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరారు.