Share News

‘లడ్డూ’పై రచ్చరచ్చ!

ABN , Publish Date - Feb 27 , 2026 | 04:03 AM

అధికార, విపక్ష సభ్యుల నినాదాలతో శాసనమండలి గురువారం దద్దరిల్లింది. గురువారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌పైన...

‘లడ్డూ’పై రచ్చరచ్చ!

  • దద్దరిల్లిన పెద్దల సభ

  • ప్రతిపక్ష, పాలక సభ్యుల అరుపులు, కేకలు

  • చైర్మన్‌ పోడియం వద్దకు దూసుకెళ్లిన సభ్యులు

  • గందరగోళ పరిస్థితులతో చర్చ లేకుండానే మండలి వాయిదా

అమరావతి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): అధికార, విపక్ష సభ్యుల నినాదాలతో శాసనమండలి గురువారం దద్దరిల్లింది. గురువారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌పైన, మధ్యాహ్నం తిరుపతి లడ్డూ ప్రసాదంపై లఘు చర్చ సందర్బంగా పెద్ద రచ్చే జరిగింది. చైర్మన్‌ మోషేన్‌రాజు, ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ మధ్య ఆసక్తికర సంవాదం జరిగింది. ప్రశ్నోత్తరాల అనంతరం కొంత సేపు విరామం తర్వాత చైర్మన్‌ సభను పునఃప్రారంభించారు. తిరుమల లడ్డూ అంశంపై చర్చ జరుగుతుందని ఆయన ప్రకటించిన వెంటనే.. సభ్యులు వేసిన ప్రశ్నలకు సమాధానాలు సమగ్రంగా, పూర్తిగా చెప్పాల్సి ఉందని కేశవ్‌ అన్నారు. సమాధానాలు ఇచ్చినట్లుగానే భావించాలని తాను ప్రకటన చేశాక.. ప్రశ్నోత్తరాల సమయం ముగిసినట్లేనని చైర్మన్‌ స్పష్టం చేశారు. లడ్డూపై లఘు చర్చ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి.. వైసీపీ సభ్యుడు చంద్రశేఖరరెడ్డికి మాట్లాడే అవకాశమిచ్చారు. దీనిపై అధికార పక్ష సభ్యులు అభ్యంతరం చెప్పారు. దేవదాయమంత్రి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. బీఏసీలో నిర్ణయించిన బిజినెస్‌ ప్రకారమే చర్చ మొదలుపెట్టానని చైర్మన్‌ అన్నారు. వైసీపీ సభ్యులు లేచి కేకలు వేయడం ప్రారంభించడంతో కేశవ్‌ మండిపడ్డారు. ‘సభ ఎలా నిర్వహించాలో కూడా ప్రభుత్వానికి నిర్దేశిస్తారా? ఎందుకు లేస్తున్నారు? వినడానికి ఎందుకు సిద్ధంగా లేరు’ అని నిలదీశారు. ఇదే సమయంలో టీడీపీ సభ్యులు లేచి వైసీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


పయ్యావుల: ప్రభుత్వం ఈ రోజు ఈ అంశం మీద సమాధానం చెప్పడానికి ఎంతసేపైనా సిద్ధంగా ఉంది. వినడానికి ఓపిగ్గా ఉండండి. రోజూ మాదిరిగా వాకౌట్‌ చేయొద్దు. సభ సంప్రదాయం ప్రకారం మంత్రి మాట్లాడతారు. మీరు ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి. ప్రభుత్వం నుంచి రిప్లయ్‌ ఇస్తాం.

చైర్మన్‌: మీరు చెప్పేది కరెక్టుకాదు. లఘు చర్చలో మంత్రి వివరణ ఇవ్వడానికి రూల్‌ లేదు. స్టేట్‌మెంట్‌ ఇవ్వాలనుకుంటే ప్రభుత్వానికి హక్కు ఉంది. వేరే ఫార్మాట్‌లో వస్తే.. కచ్చితంగా అవకాశం ఇస్తాను.

పయ్యావుల: తిరుపతి లడ్డూ ప్రసాదం అంశంపై లఘు చర్చలో ప్రభుత్వం నుంచి స్టేట్‌మెంట్‌ తెలుగు, ఇంగ్లీష్ లో ఇవ్వమని మీరే ఒక లేఖ రాశారు. ఇది మీరిచ్చిన కమ్యూనికేషనే! (సంబంధిత పత్రం చూపించారు)

చైర్మన్‌: నో నో.. దట్‌ ఈజ్‌ రాంగ్‌ కమ్యూనికేషన్‌. అది రాంగ్‌ స్టేట్‌మెంట్‌. దానికి నా పర్మిషన్‌ లేదు.

పయ్యావుల: నిన్న శాంతిభద్రతలపై తమరు (చైర్మన్‌) ఇచ్చిన లెటర్‌ ప్రకారం.. ఇదే సభలో ప్రభుత్వం స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. వ్యవసాయంపై జరగాల్సిన లఘు చర్చ జరగలేదు.

చైర్మన్‌: అది కేవలం రిప్లయ్‌.. స్టేట్‌మెంట్‌ కాదు.

పయ్యావుల: మీరిచ్చిన లెటర్‌ను కూడా కాదంటారేమిటి? తెల్లవారు జామున రెండు గంటల వరకు సభ జరిగినా ఈ ప్రభుత్వం ఇక్కడే ఉంటుంది. లడ్డూ మీద, కల్తీ నెయ్యి మీద సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. వినడానికి మీరు (వైసీపీ ఎమ్మెల్సీలు) ఎందుకు డిఫెన్స్‌లోకి వెళ్తున్నారు? చర్చకు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు పారిపోతున్నారు? మీరు చేసిన అవినీతిని, దుర్మార్గాన్ని, హిందూ సమాజానికి చేసిన ద్రోహాన్ని ఎండగట్టడానికి ఈ రోజు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

బొత్స: ఎవరు పారిపోయారు? వీళ్ల అవసరం కోసం లడ్డూ కల్తీ అంశాన్ని తెచ్చారు. ఆ దేవదేవుడిని తక్కువ చేసేలా సభలో లడ్డూ అంశాన్ని తెచ్చారు.


పయ్యావుల: ప్రభుత్వం స్టేట్‌మెంట్‌ ఇస్తుందంటే ఎందుకు భయపడుతున్నారు? నిజాలు వెలుగులోకి వస్తాయనా? దేవదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తిరుపతి లడ్డూ ప్రసాదంపై అసెంబ్లీలో మాట్లాడారు. దాని తాలుకు స్టేట్‌మెంట్‌ మండలిలో చదువుతారు. రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, పది గంటలైనా చర్చిస్తాం. సంప్రదాయాల ప్రకారం ఈ సభను నడపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరే భయపడుతున్నారు. ఈ దశలో ‘100 కోట్ల మనోభావాలు వినాలి. ఓం నమో వేంకటేశాయ..’ అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. అధికార, ప్రతిపక్ష సభ్యుల కేకలతో ఎవరేం మాట్లాడుతున్నారో తెలియని గందరగోలం ఏర్పడింది. దీంతో లడ్డూపై చర్చ లేకుండానే మండలిని శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్‌ ప్రకటించారు.

Updated Date - Feb 27 , 2026 | 04:06 AM