Share News

వైసీపీకి, వైఎస్‌కు సంబంధం లేదు

ABN , Publish Date - Jun 05 , 2026 | 05:57 AM

నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2005లోనో.. 2006లోనో తనపై రాజకీయ ప్రేరేపిత లేదా అక్రమ కేసులు బనాయించారని జనసేనాని పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను....

వైసీపీకి, వైఎస్‌కు సంబంధం లేదు

  • పవన్‌పై వైఎస్‌ తప్పుడు కేసులు పెట్టలేదు

  • ఆ ఐజీ లై డిటెక్టర్‌ పరీక్షకు రావాలి

  • కేసు పెట్టాలని వైఎస్‌ చెప్పారని ఆయన చెబితే రూ.10 కోట్లు తెలంగాణ సీఎంఆర్‌ఎ్‌ఫకు చెల్లిస్తాం

  • జనసేనానికి కేవీపీ బహిరంగ లేఖ

అమరావతి, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2005లోనో.. 2006లోనో తనపై రాజకీయ ప్రేరేపిత లేదా అక్రమ కేసులు బనాయించారని జనసేనాని పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను వైఎస్‌ ఆత్మబంధువు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేవీపీ రామచంద్రరావు ఖండించారు. ‘వైసీపీకి, వైఎస్‌కూ ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని గుర్తించడంలో చాలా మందిలా పవన్‌ కూడా విఫలమవుతున్నారు’ అని కేవీపీ స్పష్టం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో పవన్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ గురువారం కేవీపీ ఆయనకు బహిరంగ లేఖ రాశారు. జలగం వెంగళరావు నుంచి రేవంత్‌రెడ్డి వరకు కాంగ్రెస్‌ సీఎంల పనితీరును తాను చూశానని, సీఎం స్థాయి వ్యక్తి ఎవరూ తమ రాజకీయ ప్రణాళికల గురించి అలా పోలీసు అధికారులతో చర్చించడం జరగదని తెలిపారు. ‘పవన్‌ కల్యాణ్‌ చెబుతున్న ఐజీ స్థాయి పోలీసు అధికారి లై డిటెక్టర్‌ పరీక్షకు వచ్చి.. పవన్‌పై రాజకీయ కక్షతో అక్రమ కేసు పెట్టాలని రాజశేఖర్‌రెడ్డి చెప్పారని చెబితే మేం రూ.10 కోట్లను తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇస్తాం. లేదంటే పవన్‌ సూచించిన సంస్ధకు అప్పగిస్తాం. నా సవాల్‌కు ఆయన సిద్ధమేనా’ అని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ మెదక్‌లో, పీవీ నరసింహరావు నంద్యాలలో, రాహుల్‌, ప్రియాంక వయనాడ్‌లో పోటీ చేసిన సంగతులు చెప్పిన పవన్‌.. తెలంగాణ కాంగ్రెస్‌ నేత శివశంకర్‌ కూడా తెనాలిలో పోటీచేసిన విషయాన్ని ఎందుకు మరచిపోయారని ప్రశ్నించారు.

Updated Date - Jun 05 , 2026 | 05:57 AM