Share News

వీఆర్వో ఆత్మహత్య

ABN , Publish Date - Jun 07 , 2026 | 06:26 AM

అధికారుల ఒత్తిడితో వీఆర్వో బలవన్మరణానికి పాల్పడిన సంఘటన కర్నూలులో కలకలం రేపింది. కర్నూలు నగరంలోని 30వ సచివాలయంలో గ్రేడ్‌-2 వీఆర్వోగా పనిచేస్తున్న..

వీఆర్వో ఆత్మహత్య

  • ఉన్న పనులకు తోడు, బీఎల్‌వో బాధ్యతలు

  • అవి తప్పించాలని కోరినా పట్టించుకోని అధికారులు

  • సూసైడ్‌ నోట్‌లో తహసీల్దార్‌, డీటీల పేర్లు

  • కలెక్టరేట్‌ వద్ద మృతదేహంతో కుటుంబ సభ్యుల ఆందోళన

కర్నూలు కలెక్టరేట్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): అధికారుల ఒత్తిడితో వీఆర్వో బలవన్మరణానికి పాల్పడిన సంఘటన కర్నూలులో కలకలం రేపింది. కర్నూలు నగరంలోని 30వ సచివాలయంలో గ్రేడ్‌-2 వీఆర్వోగా పనిచేస్తున్న మహమ్మద్‌ హుస్సేన్‌(49) శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నూలు నగర శివారులోని వెంకాయపల్లెలో నివాసం ఉంటున్న ఆయన, తన ఇంటి ఎదురుగా ఉన్న చెట్టుకు ఉరివేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఆయన రాసిన సూసైడ్‌ నోట్‌ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తన ఆత్మహత్యకు కర్నూలు అర్బన్‌ తహసీల్దార్‌ రవికుమార్‌, డిప్యూటీ తహసీల్దార్‌ ధనుంజయ కారణం అని సూసైడ్‌ నోట్‌ రాశారు. విధి నిర్వహణలో ఒత్తిడి, అధికారుల వేధింపుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని లేఖలో పేర్కొన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. హుస్సేన్‌ కొంతకాలంగా వెన్నెముక సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గతంలో శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. ఎక్కువ సేపు నడవడం, నిలబడటం ఇబ్బందిగా ఉంటోందని పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నారు. అయినప్పటికీ ఇంటింటికి తిరగాల్సిన బీఎల్‌వో బాధ్యతలను తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్లు హుస్సేన్‌కే అప్పగించారు. ఆ బాధ్యతల నుంచి తప్పించాలని ఎంత బతిమిలాడినా తహసీల్దార్‌, డీటీ కనికరించలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన హుసేన్‌ శనివారం ఆత్మహత్య చేసుకున్నారు. కాగా, సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నట్లు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు, సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. వీఆర్వో మృతదేహంతో కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేశారు. దీంతో కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది.


హుస్సేన్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

విజయవాడ సిటీ: పనుల ఒత్తిడి తట్టుకోలేక హుస్సేన్‌ ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యగానే పరిగణిస్తున్నామని గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆరోపించింది. మృతుడి కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకోవాలని, ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించాలని సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు షేక్‌ ముహమ్మద్‌ జాని పాషా, బత్తుల అంకమ్మ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. విజయవాడ, జగ్గయ్యపేట, అనంతపురం జిల్లాల్లోనూ ఇలాగే ఒత్తిడితో చనిపోయారని, మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఆర్థిక సాయం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jun 07 , 2026 | 06:28 AM