తాగునీరందక.. ఇంజనీర్ల నిర్బంధం
ABN , Publish Date - Apr 14 , 2026 | 06:26 AM
కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవెళ్లి గ్రామ జనాభా పది వేలకు పైనే!. గ్రామానికి నెలకు పైగా రక్షిత తాగునీరు అందడంలేదు. వందేళ్ల క్రితం నాటి పురాతన బావితోపాటు, డ్రమ్ములతో నీళ్లు కొనుక్కోవాల్సి వస్తోంది.
కర్నూలు జిల్లా మొలగవెళ్లిలో ఘటన
కర్నూలు, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవెళ్లి గ్రామ జనాభా పది వేలకు పైనే!. గ్రామానికి నెలకు పైగా రక్షిత తాగునీరు అందడంలేదు. వందేళ్ల క్రితం నాటి పురాతన బావితోపాటు, డ్రమ్ములతో నీళ్లు కొనుక్కోవాల్సి వస్తోంది. గత్యంతరం లేక.. తమకు నీళ్లిచ్చి దాహం తీర్చాలంటూ సోమవారం తమ గ్రామానికొచ్చిన ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్లను గ్రామస్థులు దిగ్బంధించారు. గ్రామంలోని పెద్దబావి నీరు కలుషితంగా మారడంతో తాగలేక.. కొందరు ఒక డ్రమ్ము బోరుబావి నీటిని (పది బిందెలు) రూ.50కు కొనుగోలు చేస్తున్నారు. వారం క్రితం గ్రామస్థులు ఆలూరులోని ఆర్‌డబ్ల్యూఎస్ డివిజన్ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో సమస్య తెలుసుకుందామని సోమవారం ఆర్‌డబ్ల్యూఎస్ ఆదోని డివిజన్ ఈఈ పద్మజ, ఆలూరు డీఈఈ మల్లికార్జునయ్య, ఏఈఈ రామలీల ఆ గ్రామానికి వెళ్లారు. దీంతో తమకు తాగునీరిచ్చే వరకు ఇక్కడి నుంచి కదలనివ్వమంటూ జనమంతా ఏకమై వారిని గ్రామ సచివాలయం వద్దే దిగ్బంధించారు. కాగా, మొలగవెళ్లి సహా ఆలూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్యలు ఉన్నమాట నిజమేనని అని కర్నూలు గ్రామీణ తాగునీటి విభాగం ఎస్‌ఈ మనోహర్ తెలిపారు. 53 గ్రామాలకు రక్షిత అందించడానికి జల్‌జీవన్ మిషన్ కింద రూ.120 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని, నిధులు మంజూరైతే అవసరమైన చర్యలు చేపడతామని చెప్పారు.