Share News

కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్‌

ABN , Publish Date - Jul 03 , 2026 | 05:31 AM

త్వరలో కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్‌ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మైనార్టీ, న్యాయ శాఖా మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ స్పష్టం చేశారు. హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు స్థలం కూడా పరిశీలించామని..

కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్‌

  • స్థలాన్ని పరిశీలించాం.. ప్రతిపాదనలు పంపాం

  • మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యం

  • పీఎంజేవీకే కింద 1000 కోట్లతో అభివృద్ధి పనులు

  • గత ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి చేసింది శూన్యం

  • రాష్ట్ర మైనార్టీ, న్యాయ శాఖా మంత్రి ఫరూక్‌

అమరావతి, జూలై 2(ఆంధ్రజ్యోతి): త్వరలో కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్‌ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మైనార్టీ, న్యాయ శాఖా మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ స్పష్టం చేశారు. హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు స్థలం కూడా పరిశీలించామని, కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీ సంక్షేమానికి రూ.16,147.23 కోట్ల బడ్జెట్‌ కేటాయించగా గత రెండేళ్లలో రూ. 9,759.70 కోట్లు వ్యయం చేశామన్నారు. ఇందులో మైనార్టీల సంక్షేమ కార్యక్రమాల అమలుకు రూ.4850.91 కోట్లు నేరుగా ఖర్చు చేశామని చెప్పారు. గత రెండేళ్లలో మైనార్టీ, న్యాయశాఖల్లో సాధించిన పురోగతిపై మంత్రి గురువారం అమరావతి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం ఉర్దూ భాషను నిర్లక్ష్యం చేయగా, తమ ప్రభుత్వం ఉర్దూ భాషావృద్ధికి సమ్మర్‌ క్యాంపులు నిర్వహించిందన్నారు. కాగా ఉర్దూ మీడియంలో టెట్‌ చదివే వారి కోసం మెటీరియల్‌ను మంత్రి విడుదల చేశారు. దీనిని రెండు వేల మందికి ఉచితంగా అందజేస్తామన్నారు. జూనియర్‌ లాయర్లకు ఇచ్చే స్టై ఫండ్‌ను రూ.5 వేల నుంచి 10 వేలకు పెంచుతున్నామన్నారు. లా ఆఫీసర్ల పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచామన్నారు 96 కొత్త కోర్టుల ఏర్పాటు, 1770 పోస్టులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.

Updated Date - Jul 03 , 2026 | 05:32 AM