Share News

కర్నూలు ఇక కమిషనరేట్‌ ఆఫ్‌ పోలీస్‌..!

ABN , Publish Date - Sep 23 , 2026 | 11:58 PM

కర్నూలు జిల్లా పోలీసు వ్యవస్థలో కీలక మార్పునకు ప్రభుత్వం అడుగులు వేసింది.

   కర్నూలు ఇక  కమిషనరేట్‌ ఆఫ్‌ పోలీస్‌..!

రెండు లా అండ్‌ ఆర్డర్‌ జోన్లు, ఐదు సబ్‌ డివిజన్లు

శాంతిభద్రతల పరిరక్షణలో పటిష్టమైన నిఘా

వేగవంతమైన నేర పరిశోధన

ట్రాఫిక్‌, సైబర్‌ నేరాలపై స్పెషల్‌ ఫోకస్‌

రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం

కర్నూలు, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా పోలీసు వ్యవస్థలో కీలక మార్పునకు ప్రభుత్వం అడుగులు వేసింది. కర్నూలు పోలీస్‌ కమిషనరేట్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఐజీపీ/డీఐజీపీ స్థాయి అధికారి పర్యవేక్షించే కర్నూలు పోలీస్‌ కమిషనరేట్‌కు బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (సీపీ)కు ఎగ్జిక్యూటివ్‌ మేజిసే్ట్రట్‌ అధికారాలు కల్పించడంతో పాటు ప్రస్తుతం ఉన్న కర్నూలు రెవెన్యూ జిల్లా, కర్నూలు పోలీస్‌ జిల్లా పరిధులకు అనుగుణంగా రెండు టెరిటోరియల్‌ జోన్లు (లా అండ్‌ ఆర్డర్‌-1,2 జోన్లు), కర్నూలు అర్బన, కర్నూలు రూరల్‌, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ ఐదు సబ్‌ డివిజనలతో కమిషనరేట్‌ను ఏర్పాటు చేయనున్నారు. సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో జిల్లాలో శాంతి భద్రతలు మెరుగు పడుతాయని మేధావులు పేర్కొంటున్నారు. మహా నగరాలకే పరిమితమైన పోలీస్‌ కమిషనరేట్‌ను కర్నూలు కేంద్రంగా ఏర్పాటు చేయడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కమిషనరేట్‌ ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలు వంటి వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

కర్నూలు జిల్లాలో ప్రస్తుతం సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్పీ) పర్యవేక్షణలో పోలీసు విభాగం పని చేస్తుంది. కర్నూలు, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు పోలీస్‌ సబ్‌ డివిజన్లు ఉన్నాయి. కర్నూలు పోలీస్‌ సబ్‌ డివిజన పరిధిలో 12, ఆదోని సబ్‌ డివిజన పరిధిలో 5, ఎమ్మిగనూరు సబ్‌ డివిజన పరిధిలో 9, పత్తికొండ సబ్‌ డివిజన పరిధిలో 11 పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. జిల్లా కేంద్రంగా ఎస్పీ, అడిషినల్‌ ఎస్పీలు ఉంటే.. సబ్‌ డివిజన స్థాయి అధికారులుగా డీఎస్పీలు పని చేస్తున్నారు. కమిషనరేట్‌ ఏర్పాటు చేస్తే ఐజీపీ/డీఐజీపీ స్థాయి కలిగిన కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (సీపీ) నేతృత్వంలో పోలీస్‌ విభాగం పని చేస్తుంది. అదే క్రమంలో లా అండ్‌ ఆర్డర్‌ జోన్లకు డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీసీపీ), సబ్‌ డివిజన్లకు అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏసీపీ)లు వస్తారు. అంటే.. శాంతి భద్రతల పర్యవేక్షణలో ఐపీఎస్‌, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులే ఉంటారు. సీపీ పర్యవేక్షణలో జోన్లు, సబ్‌ డివిజన్లు, పోలీసు స్టేషన్ల మధ్య సమన్వయం మరింత కేంద్రీకృతం అవుతుంది. పోలీస్‌ కమిషనరేట్‌ వ్యవస్థలో సాధారణంగా కమిషనర్‌కు తోడుగా డీసీపీ, ఏసీపీలు, ఇతర పోలీస్‌ అధికారులు ప్రత్యేక విభాగాలు పని చేసే నిర్మాణం ఉంటుంది.

ఫ రెండు జోన్లు, ఐదు సబ్‌ డివిజన్లు:

మంత్రి మండలి ఆమోదం మేరకు కర్నూలు పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో రెండు టెరిటోరియల్‌ జోన్లు (లా అండ్‌ ఆర్డర్‌-1,2) కర్నూలు అర్బన, కర్నూలు రూర్‌, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ సబ్‌ డివిజన్లు ఉంటాయి. కర్నూలు నగరంతో పాటుగా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు ఒకే కమిషనరేట్‌ పరిధిలో సమగ్ర పోలీసింగ్‌ వ్యవస్థ పని చేస్తుంది. ఇప్పటి వరకు కొనసాగిన కర్నూలు సబ్‌ డివిజనగా రెండుగా విడిపోయి కర్నూలు అర్బన, రూరల్‌ సబ్‌ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణ, సత్వర నేర విచారణ జరగడానికి అవకాశాలు మెరుగుపడ్డాయి.

ఫ కమిషనరేట్‌ వల్ల ప్రయోజనాలెన్నో:

ఫ కర్నూలు పోలీస్‌ కమిషనరేట్‌ ఏర్పాటు వల్ల నేరాలపై సమాచార సేకరణ, విశ్లేషణ, దర్యాప్తు, పర్యవేక్షణ వ్యవస్థలు సమన్వయం, సమర్థవంతంగా పని చేస్తాయి.

ఫ నగరాల్లో పెరుగుతున్న ఆధునిక నేరాలు నిరోధించడం, ప్రత్యేక విభాగాలకు ప్రాధాన్యం, శాంతి భద్రతలు బలోపేతం, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోలీస్‌ వ్యవస్థను బలోపేతం చేయవచ్చు.

ఫ ఆనలైన మోసాలు, బ్యాంకింగ్‌ మోసాలు, సోషల్‌ మీడియా నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్‌ నేరాల దర్యాప్తు, సాంకేతిక ఆధారల సేకరణ కోసం ప్రత్యేక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది.

ఫ ఈ వ్యవస్థ వల్ల క్రైమ్‌ రికార్డులు, క్రిమినల్‌ ఇంటెలిజెన్స, ప్రత్యేక దర్యాప్తు విభాగాలకు ప్రాధాన్యం పెరుగుతుంది.

ఫ విస్తరిస్తున్న కర్నూలు నగరంలో ట్రాఫిక్‌ నిర్వహణపై ప్రత్యేక ఫోకస్‌, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించేలా చేయడం, ట్రాఫిక్‌ విధులకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు అవుతుంది.

ఫ శాంతిభద్రతలపై క్షేత్రస్థాయి నిఘా

జిల్లా అంతటా ప్రస్తుతం ఒకే అధికారి (ఎస్సీ) పర్యవేక్షించాల్సి ఉంది. కమిషనరేట్‌ ఏర్పాటుతో జిల్లాను రెండు లా అండ్‌ ఆర్డర్‌ జోన్లుగా విభజిస్తారు. ప్రతి జోనకు డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీసీపీ)గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను నియమిస్తారు. ప్రతి సబ్‌ డివిజనకు అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏసీపీ)గా డీఎస్పీ స్థాయి అధికారిని నియమిస్తారు. అయితే ఆదోనికి సబ్‌ డివిజనకు మాత్రం ఐపీఎస్‌ అధికారిని నియమిస్తారు. సీపీ, డీసీపీలు, ఏసీపీలు మొత్తంగా ఐదు లేదా ఆరుగురు ఐపీఎస్‌ అధికారుల పర్యవేక్షణలో పోలీస్‌ వ్యవస్థ శాంతి భద్రత పరిరక్షణ కోసం పని చేస్తుంది. శాంతి భద్రతలపై పటిష్టమైన నిఘా క్షేత్రస్థాయిలో ఉంటుందని సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. కమిషనరేట్‌ అమల్లోకి వస్తే పాలనా బాధ్యతలు, పర్యవేక్షణ, సిబ్బంది వినియోగం, ప్రత్యేక విభాగాల నిర్వహణలో మార్పులు బలమైన మార్పులు వస్తాయని అంటున్నారు.

ఫ ఎగ్జిక్యూటివ్‌ మేజిసే్ట్రట్‌ అధికారాలు

జిల్లాలో కలెక్టర్‌, రెవెన్యూ డివిజనలో ఆర్డీవో/సబ్‌ కలెక్టర్లు, మండలాల్లో తహసీల్దార్లకు ఉండే ఎగ్జిక్యూటివ్‌ మేజిసే్ట్రట్‌ అధికారాలను భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎనఎ్‌సఎ్‌స) సెక్షన 14(6) ప్రకారం కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (సీపీ)కు కల్పిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శాంతి భద్రతలు పరిరక్షణ, 144 సెక్షన అమలు చేయడం కోసం, ఇరువర్గాల మధ్య తలెత్తిన గొడవలు, అల్లర్లు, ఘర్షణలు అణచివేయడం కోసం, రౌడీషీటర్లు, పాత నేరస్తుల నుంచి శాంతియుతంగా ఉంటామని హామీ ఇస్తూ ‘గుడ్‌ బిహేవియర్‌ బాండ్లు’ తీసుకోవడం వంటి నిర్ణయాలు వేగంగా తీసుకోవచ్చు. ప్రజారోగ్యానికి, భద్రతకు ముప్పు కలిగించే ఆక్రమణలు, ఇతర ప్రమాదకరమైన కట్టడాలను తొలగించే ఉత్తర్వులు జారీ, తీవ్రమైన హింసాత్మక సంఘటనలు తలెత్తినప్పుడు నిర్ధిష్ట ప్రాంతాల్లో లేదా కమిషనరేట్‌ పరిఽధిలో కర్ఫ్యూ విధించాల్సి వస్తే కీలక నిర్ణయాల కోసం కలెక్టరు అనుమతి కోసం ఎదురు చూడకుండా సీపీనే స్వయంగా తక్షణ నిర్ణయం తీసుకుని అమలు చేయవచ్చు.

ఫ పోలీస్‌ కమిషనరేట్‌ స్వరూపం:

ఫ కమిషనరేట్‌ ఆఫ్‌ పోలీస్‌: కమిషనరేట్‌ను రెండు టెరిటోరియల్‌ జోన్లు (లా అండ్‌ ఆర్డర్‌-1, 2), కర్నూలు అర్బన, కర్నూలు రూరల్‌, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ ఐదు సబ్‌ డివిజన్లుగా ఏర్పాటు చేశారు. కమిషనరేట్‌కు కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (సీపీ), లా అండ్‌ ఆర్డర్‌ జోనకు డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీసీపీ), సబ్‌ డివిజనకు అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏసీపీ)లు పర్యవేక్షిస్తారు.

ఫ లా అండ్‌ అర్డర్‌ జోన-1: కర్నూలు అర్బన సబ్‌ డివిజన పరిధిలో కర్నూలు సిటీలోని కర్నూలు-1,2,3,4 అప్‌ గ్రేడ్‌ పోలీస్‌ స్టేషన్లు (యూపీఎస్‌), కర్నూలు తాలుకా పోలీస్‌ స్టేషన్లు, కర్నూలు రూరల్‌ సబ్‌ డివిజన పరిధిలోకి ఓర్వకల్లు, ఉల్లిందకొండ, కె.నాగులాపురం, కోడుమూరు, గూడూరు, సి.బెళగల్‌, వెల్దుర్తి పోలీస్‌ స్టేషన్లు వస్తాయి

ఫ లా అండ్‌ ఆర్డర్‌ జోన-2: ఆదోని సబ్‌ డివిజన పరిఽధిలోకి ఆదోని-1,2,3 ఆప్‌ గ్రేడ్‌ పోలీస్‌ స్టేషన్లు (యూపీఎస్‌), ఆదోని తాలుకా, ఇస్వీ, పెద్దతుంబళం పోలీస్‌ స్టేషన్లు వస్తాయి. ఎమ్మిగనూరు సబ్‌ డివిజన పరిధిలోకి ఎమ్మిగనూరు టౌన (యూపీఎస్‌), ఎమ్మిగనూరు రూరల్‌, నందవరం, గోనెగండ్ల, మంత్రాలయం, మాధవరం, కోసిగి, పెద్దకడుబూరు, కౌతాళం పోలీస్‌ స్టేషన్లు, పత్తికొండ సబ్‌ డివిజన పరిధిలో పత్తికొండ, తుగ్గలి, జొన్నగిరి, మద్దికెర, దేవనకొండ, ఆస్పరి, ఆలూరు, చిప్పగిరి, హాలహర్వి, హోళగుంద, కృష్ణగిరి పోలీస్‌ స్టేషన్లు వస్తాయి.

ఫ జిల్లాలోనే 11 పోలీస్‌ స్టేషన్లతో అతిపెద్ద సబ్‌ డివిజనగా పత్తికొండ ఏర్పడుతుంది. ఆ తర్వాత 9 స్టేషన్లతో ఎమ్మిగనూరు రెండవ అతిపెద్ద సబ్‌ డివిజనగా ఉంటుంది. ఏడు పోలీస్‌ స్టేషన్లతో కర్నూలు రూరల్‌ సబ్‌ డివిజన మూడో స్థానంలో ఉంటుంది.

ఫ ఒకప్పుడు 26 పోలీస్‌ స్టేషన్లతో జిల్లాలోనే అదిపెద్ద పోలీస్‌ సబ్‌ డివిజనగా ఉన్న ఆదోని సబ్‌ డివిజన ఐదు పోలీస్‌ స్టేషన్లకు, 12 పోలీస్‌ స్టేషన్ల పరిధి కలిగిన కర్నూలు అర్బన సబ్‌ డివిజన ఐదు స్టేషన్లకే పరిమితం కావడం కొసమెరుపు.

Updated Date - Sep 23 , 2026 | 11:58 PM