అమెరికాలో కర్నూలు యువకుడి ఆత్మహత్య
ABN , Publish Date - May 02 , 2026 | 04:54 AM
కర్నూలు, గీతా నగర్ కాలనీకి చెందిన ఇరగనబోయిన చందు(26) అమెరికాలో ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్నో ఆశలతో అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లిన చందు బలవన్మరణానికి పాల్పడడంతో.....
చికాగోలోని డీపాల్ వర్సిటీలో మాస్టర్స్ చేసిన చందు
ట్రంప్ విధానాలతో ఉద్యోగం రాదనే మనస్తాపంతో బలవన్మరణం
మృతదేహాన్ని ఇండియాకు తెప్పించేందుకు లోకేశ్, రామ్మోహన్ నాయుడు యత్నాలు
కర్నూలు, మే 1(ఆంధ్రజ్యోతి): కర్నూలు, గీతా నగర్ కాలనీకి చెందిన ఇరగనబోయిన చందు(26) అమెరికాలో ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్నో ఆశలతో అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లిన చందు బలవన్మరణానికి పాల్పడడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు విషాదంలో మునిగిపోయారు. విషయం తెలియగానే మంత్రి లోకేశ్, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కుటుంబానికి అండగా నిలవాలని...
కర్నూలు నగరం బళ్లారి చౌరస్తాకు సమీపంలో గీతా నగర్ కాలనీలో ఉంటున్న ఏఆర్ కానిస్టేబుల్ ఇరగనబోయిన కేశవ యాదవ్, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. రెండో సంతానం చందు. చదువులో ఎంతో చురుగ్గా ఉండే చందును ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు పంపించారు. షికాగోలోని డీపాల్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ పూర్తి చేసిన చందు... అక్కడే ఉద్యోగంలో చేరి కుటుంబానికి అండగా నిలవాలనే సంకల్పంతో ఎన్నో ప్రయత్నాలు చేశారు. అమెరికాలో మారిన పరిస్థితులు, అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వల్ల తనకు ఉద్యోగం రాదన్న ఆందోళనతో తీవ్ర మానసిక వ్యథకు గురయ్యారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఏప్రిల్ 28న తాను ఉండే అపార్ట్‌మెంట్ గదిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. తానా సభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. చందు మృతదేహాన్ని ఇండియాకు పంపించేందుకు తానా టీం స్క్వేర్ కో-చైర్మన్ చిరంజీవి గల్లా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికోసం అక్కడి భారతీయ సమూహం ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ చేపట్టారు. రెండు రోజుల్లో సుమారు 76,000 డాలర్లు వచ్చాయి. మృతదేహాన్ని నెల్లూరుకు పంపించడానికి సుమారు 25వేల డాలర్లు ఖర్చు అవుతుంది. మిగిలిన డబ్బులు కుటుంబానికి ఆర్థిక సహాయం కింద అందజేయనున్నట్లు తెలిసింది.
స్పందించిన మంత్రి లోకేశ్
చందు మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సహాయం కోరుతూ సోషల్ మీడియాలో యూజర్ ఒకరు మంత్రి లోకేశ్‌కు లేఖ రాశారు. తక్షణమే స్పందించిన మంత్రి... చందు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మృతదేహాన్ని ఇండియాకు తెప్పించే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చినట్లు చందు సోదరుడు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చందు మృతదేహాన్ని భారత్‌కు తెప్పించడంతో పాటు కర్నూలుకు తరలించేలా చూడాలని పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడును మంత్రి లోకేశ్ కోరారు. ఈ కష్టకాలంలో చందు కుటుంబానికి అండగా నిలబడటానికి తమ వంతు కృషి చేస్తామని రామ్మోహన్‌నాయుడు తెలిపారు.