Share News

రహదారి పనుల్లో నాణ్యతా లోపాలు

ABN , Publish Date - Aug 20 , 2026 | 04:20 AM

కర్నూలు జిల్లా హోళగుంద మండ లం నుంచి ఢణాపురం, హెబ్బటం గ్రామాల ప్రధాన రహదారి పనుల్లో నాణ్యతా లోపాలపై మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.

రహదారి పనుల్లో నాణ్యతా లోపాలు

  • ఇంజనీరింగ్‌ అధికారులపై మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆగ్రహం

  • విజిలెన్స్‌ విచారణకు ఆదేశం.. ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

కర్నూలు, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా హోళగుంద మండ లం నుంచి ఢణాపురం, హెబ్బటం గ్రామాల ప్రధాన రహదారి పనుల్లో నాణ్యతా లోపాలపై మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత ఇంజనీరింగ్‌ ఉన్నతాధికారులను తీవ్రంగా మందలించారు. 2 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణకు ఆదేశించారు. రహదారి దుస్థితిని క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, అంచనా వేసేందుకు తక్షణమే ఆయా గ్రామాలకు వెళ్లాలని ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ క్వాలిటీ కంట్రోల్‌ అధికారి శేషుకుమార్‌, ఆర్‌అండ్‌బీ కర్నూలు ఎస్‌ఈ మహేశ్వరరెడ్డిని ఆదేశించారు. హోళగుంద- ఢణాపురం రోడ్డు నిర్వహణ కోసం కూటమి ప్రభుత్వం రూ.11.30 కోట్లు మంజూరు చేసింది. దీంతో 25.8 కిలోమీటర్ల మేర రోడ్డు అధునికీకరణకు శ్రీకారం చుట్టారు. పనులను ఇద్దరు కాంట్రాక్టర్లు చేపట్టారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో నెల గడవక ముందే తారు లేచిపోయి రహదారి ధ్వంసం కావడంపై ‘30 ఏళ్ల రోడ్డు కల.. 30 రోజుల్లో తారుమారు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ బుధవారం కథనం ప్రచురించింది. దీనిపై మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి స్పందించారు. దీంతో ఎస్‌ఈ మహేశ్వరరెడ్డి, ఆదోని ఈఈ పద్మనాభరెడ్డి, డీఈఈ వెంకటేశ్వర్లు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

Updated Date - Aug 20 , 2026 | 04:21 AM