Share News

మింగేసిన నిద్రమత్తు

ABN , Publish Date - Apr 17 , 2026 | 06:19 AM

వారంతా కర్ణాటకలోని చిక్‌మంగళూరు జిల్లాకు చెందిన వారు. కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనం కోసం 22 మంది బుధవారం సాయంత్రం మినీ ట్రక్‌లో అక్కడి నుంచి బయల్దేరారు.

మింగేసిన నిద్రమత్తు

  • రెడీమిక్స్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టిన మినీ ట్రక్కు

  • తెల్లవారుజామున ప్రమాదం.. రెప్పపాటులో ఘోరం

  • 8 మంది దుర్మరణం.. 14 మందికి గాయాలు

  • ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

  • కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో ప్రమాదం

  • రాఘవేంద్రస్వామి దర్శనానికి వెళ్తుండగా దుర్ఘటన

  • మృతులంతా కర్ణాటకలోని చిక్‌మంగళూరు వాసులే

కర్నూలు/మంత్రాలయం, న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): వారంతా కర్ణాటకలోని చిక్‌మంగళూరు జిల్లాకు చెందిన వారు. కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనం కోసం 22 మంది బుధవారం సాయంత్రం మినీ ట్రక్‌లో అక్కడి నుంచి బయల్దేరారు. గురువారం తెల్లవారుజామున మంత్రాలయం సమీపానికి వచ్చేశారు. మరో 15 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకుంటారనగా... ఘోరం జరిగిపోయింది. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనం... ఎదురుగా వస్తున్న రెడీమిక్స్‌ ట్యాంకర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతిచెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. తెల్లవారుజామున గాఢనిద్రలోకి జారుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. ఎడమ వైపున మంత్రాలయానికి వెళ్తున్న మినీ ట్రక్కు... ఎదురుగా వస్తున్న రెడీమిక్స్‌ ట్యాంకర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

Untitled-8 copy.jpg


రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా..

కర్ణాటకలోని చిక్‌మంగళూరు జిల్లాకు చెందిన 22 మంది బుధవారం సాయంత్రం ఉడ్డేవ గ్రామం నుంచి మినీ ట్రక్‌లో బయలుదేరారు. వారంతా మినీ ట్రక్‌ యజమాని, డ్రైవర్‌ ఎస్‌కే సునీల్‌ కుటుంబ సభ్యులు, బంధువులు, బాగా తెలిసినవారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో చిలకలడోన గ్రామం దాటగానే వారు ప్రయాణిస్తున్న మినీ ట్రక్‌.. ఎదురుగా వస్తున్న కాంక్రీట్‌ రెడీమిక్స్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో మినీ ట్రక్కు పల్టీలు కొట్టింది. అందులో ఉన్నవారు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. అదేదారిలో మంత్రాలయం వెళ్తున్న ఓ భక్తుడు ఈ ప్రమాదాన్ని చూసి 100కు కాల్‌ చేశారు. దీంతో మంత్రాలయం పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల్లో మినీ ట్రక్‌ యజమాని, డ్రైవర్‌ ఎస్‌కే సునీల్‌ (40), మీనాక్షి (50), లోలాక్షి (50), పుట్టమ్మ (63), నిషిత (3) ఐదుగురు ఘటనా స్థలంలోనే మృతిచెందగా.. కుమార్‌ (60), దీపికవీణ (35), జయమ్మ (60) ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రితో ప్రాణాలు విడిచారు. గాయాలైన 14 మందిలో శుభ, తేజస్విని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృ తుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఉన్నారు.


ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున అందిస్తామని తెలిపారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ కూడా ఈ దుర్ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు కర్నూలు కలెక్టర్‌ సిరికి ఫోన్‌ చేసి ప్రమాదంపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - Apr 17 , 2026 | 06:22 AM