మూడు నెలల్లో ప్రతి సమస్యా పరిష్కరిస్తా
ABN , Publish Date - Mar 21 , 2026 | 04:26 AM
‘ప్రజలకు, పాలకులకు మధ్య వారిఽధిగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతి చేపట్టిన అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా.. కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయి సమస్యలు, వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నాను.
‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంకల్పం అద్భుతం
క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోగలిగాను
‘అక్షరం అండగా..’ సదస్సులో టీజీ భరత్
సదస్సు దృష్టికి 20 ప్రధాన సమస్యలు..
పరిష్కారానికి రూ.1.50 కోట్ల అంచనా
కర్నూలు, మార్చి 20(ఆంధ్రజ్యోతి): ‘ప్రజలకు, పాలకులకు మధ్య వారిఽధిగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతి చేపట్టిన అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా.. కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయి సమస్యలు, వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నాను. ఈ సదస్సు ద్వారా నా దృష్టికొచ్చిన 20 సమస్యల అంచనా విలువ రూ.1.50 కోట్లకు పైగా ఉంటుంది. 3 నెలల్లో ప్రతి సమస్యను పరిష్కరిస్తా’అని మంత్రి టీజీ భరత్ హామీ ఇచ్చారు. కర్నూలు నగర పాలక సంస్థ 44, 45 వార్డుల పరిధిలోని రామలింగేశ్వరనగర్ కాలనీ పార్కులో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ సదస్సు శుక్రవారం జరిగింది. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి పార్కుల అభివృద్ధి, డ్రైనేజీలు, ప్రధాన రహదారుల మరమ్మతులు, కల్వర్టుల నిర్మాణం, వెంకటరమణ కాలనీలో స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు, వీధి దీపాల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పలువురు వృద్ధులు పింఛన్ రావడం లేదని, ఇంటి పట్టా, పక్కా ఇళ్లు మంజూరు వంటి వ్యక్తిగత సమస్యలను కూడా మంత్రికి చెప్పుకొన్నారు. మంత్రి స్పందిస్తూ.. ‘సదస్సులో ప్రధానంగా 20 సమస్యలు వచ్చాయి. వాటిని తీర్చాలంటే దాదాపుగా రూ.1.50 కోట్లు అవసరమని అంచనా.. కమిషనర్, అధికారులతో చర్చించి 3నెలల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తాను. ఆ తర్వాత ఇక్కడే విజయోత్సవ సభ నిర్వహిద్దాం’ అని చెప్పారు. 44, 45 వార్డుల్లో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్, వీధి దీపాలు ఏర్పాటుపై మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
‘ఈ కార్యక్రమం అద్భుతంగా ఉంది. కర్నూలులోని 32 వార్డుల్లోనూ ఈ సదస్సులు నిర్వహించాలి. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు, ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించడం వల్ల ఎమ్మెల్యేలకు వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి. ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధులు, మా వాళ్లతో ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి.. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తా’ అని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మరో పాతికేళ్లు కూటమి ప్రభుత్వం స్థిరంగా కొనసాగితే సంక్షేమం, అభివృద్ధిలో దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని భరత్ అన్నారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్ ఎ.లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.