Share News

ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని 5 లక్షల టోకరా!

ABN , Publish Date - May 18 , 2026 | 05:00 AM

ప్రభుత్వ ఉద్యోగం పేరుతో ఇద్దరు అన్నాచెల్లెళ్లు ఓ వ్యక్తికి రూ.50 లక్షల టోకరా వేశారు. గ్రూపు-2 పరీక్ష రాసినా.. వారు చెప్పిన విధంగా ఎక్సైజ్‌ ఎస్‌ఐ ఉద్యోగం రాకపోవడంతో పాటు, ఇచ్చిన డబ్బులు కూడా తిరిగివ్వలేదు.

ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని  5 లక్షల టోకరా!

  • రాని జాబ్‌.. డబ్బులూ తిరిగివ్వని మోసగాళ్లు

  • ఇద్దరు అన్నాచెల్లెళ్లపై పోలీసులకు బాధితుల ఫిర్యాదు

  • కర్నూలు జిల్లాలో వెలుగు చూసిన ఘటన

ఆదోని రూరల్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగం పేరుతో ఇద్దరు అన్నాచెల్లెళ్లు ఓ వ్యక్తికి రూ.50 లక్షల టోకరా వేశారు. గ్రూపు-2 పరీక్ష రాసినా.. వారు చెప్పిన విధంగా ఎక్సైజ్‌ ఎస్‌ఐ ఉద్యోగం రాకపోవడంతో పాటు, ఇచ్చిన డబ్బులు కూడా తిరిగివ్వలేదు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు.. తాజాగా పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా ఆదోని మండలం మాంత్రికి గ్రామానికి చెందిన తలారి విశ్వనాథ్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి, ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. భరత్‌, శ్రావణి అనే ఇద్దరు అన్నాచెల్లెళ్లు కర్నూలులో ఓవైపు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో పాటు క్వారీలు నడుపుతుంటారు. మరోవైపు భరత్‌ హైదరాబాద్‌లో, శ్రావణి బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు కూడా చేస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని, ఎవరైనా ఉంటే చెప్పాలని వారు తమకు డ్రైవర్‌గా పనిచేసే వెల్దుర్తికి చెందిన సొట్ట కృష్ణకు చెప్పారు. దీంతో తమ బంధువైన ధనేశ్వరి భర్త విశ్వనాథ్‌ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడని కృష్ణ వారికి చెప్పారు. దీంతో ఆ అన్నాచెల్లెళ్లు.. విశ్వనాథ్‌ దంపతులను 2023లో కర్నూలులో కలిశారు. అప్పటికే గ్రూపు-2 నోటిఫికేషన్‌ జారీ కావడంతో విశ్వనాథ్‌కు ఎక్సైజ్‌ ఎస్‌ఐ ఉద్యోగం ఇప్పిస్తామని, రూ.కోటి ఇవ్వాలని అడిగారు. చివరకు రూ.50 లక్షలు ఇవ్వడానికి విశ్వనాథ్‌ దంపతులు ఒప్పుకున్నారు. పొలాలు, బంగారం అమ్ముకుని మరీ రెండు విడతల్లో రూ.30 లక్షలు, రూ.20 లక్షలు ఇచ్చారు. 2023లో విశ్వనాథ్‌ గ్రూపు-2 పరీక్షలు రాయగా.. 2025లో ఫలితాలు వచ్చాయి. అయితే ఉద్యోగం రాలేదని విశ్వనాథ్‌ దంపతులు భరత్‌, శ్రావణిని ప్రశ్నించారు. దీంతో తాము తీసుకున్న డబ్బులు తిరిగిస్తామని చెప్పి.. ఖాళీ చెక్కులు, ప్రామిసరి నోట్లు రాసిచ్చారు. అయితే రోజులు గడుస్తున్నా స్పందించకపోవడంతో బాధితులు ఆదివారం రాత్రి పెద్దతుంబళం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విద్యాశ్రీ తెలిపారు.

Updated Date - May 18 , 2026 | 06:01 AM