ఇన్‌స్టాలో అమ్మకానికి బిడ్డ!
ABN , Publish Date - May 16 , 2026 | 05:57 AM
జల్సాలకు అలవాటు పడిన అతడు.. డబ్బు కోసం ఏకంగా తన కన్నబిడ్డలనే అమ్ముకొనే పనిపెట్టుకున్నాడు! ఏడాది క్రితం ఓ బిడ్డను విక్రయించిన ఆ తండ్రి..
జల్సాలకు అలవాటు పడి..చిన్నారిని విక్రయానికి పెట్టిన తండ్రి
కర్నూలు జిల్లాలో పోలీసుల రెస్క్యూ ఆపరేషన్
ఆదోని, మే 15 (ఆంధ్రజ్యోతి): జల్సాలకు అలవాటు పడిన అతడు.. డబ్బు కోసం ఏకంగా తన కన్నబిడ్డలనే అమ్ముకొనే పనిపెట్టుకున్నాడు! ఏడాది క్రితం ఓ బిడ్డను విక్రయించిన ఆ తండ్రి.. ఇప్పుడు మరో బిడ్డను ఇన్‌స్టాలో అమ్మకానికి పెట్టాడు!! ఆ వీడియో రీల్ చూసిన పోలీసులు.. వెంటనే రెస్క్యూ చేసి ఆ నాలుగేళ్ల బాలుడిని కాపాడారు. వివరాల ప్రకారం.. కర్నూలు నగరంలోని ఐటీసీ నగర్‌లో నివాసముంటున్న నబీ రసూల్, దిల్షాద్ దంపతులకు ముగ్గురు సంతానం. జల్సాలకు అలవాటు పడిన నబీ ఏడాది క్రితం ఓ బిడ్డను తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో రూ.2 లక్షలకు అమ్మేశాడు. దీనిపై అప్పట్లో కర్నూలు నాలుగో పట్టణ పోలీ్‌సస్టేషన్‌లో నమోదైంది. ఆ బాలుడు ఎక్కడున్నాడో, ఎవరి వద్ద ఉన్నాడో తెలియరాలేదు. ఈ క్రమంలో శుక్రవారం తన మరో కుమారుడు పటాన్ బషీర్‌ను అమ్మేందుకు సిద్ధమయ్యాడు. ‘నా కొడుకును అమ్ముతున్నాను..’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. గమనించిన కర్నూలు ఫోర్త్ టౌన్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. నిందితుడి సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడు ఆదోనిలో ఉన్నట్లు గుర్తించారు. తల్లి దిల్షాద్‌ను వెంట పెట్టుకుని ఆదోనికి వచ్చారు. స్థానిక త్రీటౌన్ పోలీసులతో కలిసి జలాల్ డొంగ్రీ మసీదు వద్ద నబీ రసూల్‌ను పట్టుకున్నారు. నిందితుడు తన కాలి చెప్పులో సిద్ధంగా ఉంచుకున్న బ్లేడును బయటకు తీసి.. ‘దగ్గరకు వస్తే గొంతు కోసుకొని చచ్చిపోతా..’ అంటూ బెదిరించాడు. తనను తాను గాయపర్చుకొని హంగామా సృష్టించాడు. పోలీసులు ప్రాణాలకు తెగించి నిందితుడిని పట్టుకున్నారు. అతడి నుంచి చిన్నారి బషీర్‌ను రక్షించి తల్లి ఒడికి చేర్చారు. నబీ రసూల్‌పై కిడ్నాప్ కేసు నమోదు చేశారు.