Share News

దేవరబెట్ట కల్వర్టుకు మోక్షం

ABN , Publish Date - Jun 21 , 2026 | 06:26 AM

కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలోని దేవరబెట్ట గ్రామ కల్వర్టు రోడ్డు సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం దొరికింది.

దేవరబెట్ట కల్వర్టుకు మోక్షం

  • రూ.16 లక్షలు మంజూరు చేసిన కలెక్టర్‌

కోసిగి, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలోని దేవరబెట్ట గ్రామ కల్వర్టు రోడ్డు సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం దొరికింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కల్వర్టు కొట్టుకుపోవడంతో మరో మార్గంలేక విద్యార్థులు ప్రాణాలకు తెగించి.. ట్రెకింగ్‌ చేస్తున్న మారిదిగా.. రాళ్లపై నుంచి ప్రమాదకర పరిస్థితిలో బడికి వెళ్తున్న దుస్థితిని ‘ఆంధ్రజ్యోతి’ కళ్లకు కట్టినట్లు వివరించింది. ‘ట్రెకింగ్‌ కాదు... బడికి’ శీర్షికన ఈనెల 19న ప్రచురితమైన కథనానికి కలెక్టర్‌ ఎ.సిరి స్పందించారు. వెంటనే డివిజన్‌, మండల స్థాయి అధికారులను ధ్వంసమైన కల్వర్టు వద్దకు పంపారు. శాశ్వత చర్యలు చేపట్టేందుకు నివేదికలను సైతం వెంటనే తెప్పించుకున్న కలెక్టర్‌ రూ.16లక్షలు మంజూరు చేశారు. వెంటనే కల్వర్టు పునరుద్దరణ పనులు చేపడతామని మంత్రాలయం ఆర్‌అండ్‌బీ డీఈ రంగస్వామి తెలిపారు. ఇదిలా ఉండగా.. ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఎన్‌.రాఘవేంద్రరెడ్డి కూడా స్పందించారు. పూర్తిగా కొట్టుకుపోయిన కల్వర్టు వద్ద పొక్లెయిన్‌తో మట్టి పోసి తాత్కాలికంగా దారిని పునరుద్ధరించారు. విద్యార్థులు, వాహనదారులు, రాకపోకలు సాగించేలా కల్వర్టు రోడ్డు శనివారం అందుబాటులోకి తెచ్చారు.

Updated Date - Jun 21 , 2026 | 06:26 AM