Share News

‘రాయల్‌’గా ముందడుగు!

ABN , Publish Date - Jun 24 , 2026 | 03:41 AM

కూటమి ప్రభుత్వం కొలువుదీరాక సీఎం చంద్రబాబు చొరవ, సర్కార్‌ భరోసాతో రాయలసీమలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు.

‘రాయల్‌’గా ముందడుగు!

  • కరువు సీమలో గొప్పగా పారిశ్రామిక ప్రగతి

  • కూటమి ప్రభుత్వం రాకతో పరిశ్రమల వరుస

  • ఉమ్మడి కర్నూలు జిల్లాకు భారీగా పెట్టుబడులు

  • జాబితాలో రిలయన్స్‌, టాటా వంటి కంపెనీలు

  • 88,146 కోట్ల పెట్టుబడులు.. 33 వేల ఉద్యోగాలు

  • ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన కొన్ని సంస్థలు

(కర్నూలు-ఆంధ్రజ్యోతి)

కూటమి ప్రభుత్వం కొలువుదీరాక సీఎం చంద్రబాబు చొరవ, సర్కార్‌ భరోసాతో రాయలసీమలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. ఇప్పటికే పలు కీలక ప్రాజెక్టులు నిర్మాణాలను పూర్తి చేసుకొని, ప్రారంభానికి సిద్ధమవగా.. మరోవైపు భారీగా ఇతర పెట్టుబడుల ప్రతిపాదనలు వస్తున్నాయి. విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పరిశ్రమలు పెట్టేందుకు చాలా మంది పెట్టుబడిదారులు ప్రభుత్వంతో ఎంవోయూలు చేసుకున్నారు. ఈ జాబితాలో రిలయన్స్‌ కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌, అగస్త్య ఎనర్జీ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ మిలిటెడ్‌, టీజీవీ ఎస్‌ఆర్‌ఏఏసీ లిమిటెడ్‌, ఇండిచిప్‌ సెమికండక్టర్స్‌ లిమిటెడ్‌, టాటా రెన్యూవబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌, ఎన్టీపీసీ రెన్యూవబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌.. వంటి భారీ సంస్థలు ఉన్నాయి. పలు కంపెనీలు ఇప్పటికే నిర్మాణాలు చేపట్టగా.. ఇంకొన్ని భూసేకరణలో వివిధ దశల్లో ఉన్నాయి. ఈ నెల 24న తగ్గలి మండలం జొన్నగిరి కేంద్రంగా ఉన్న జియోమైసూర్‌ సర్వీసెస్‌ ఇండియా లిమిటెడ్‌ గోల్డ్‌ మైన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలో విస్తరిస్తున్న పారిశ్రామిక ప్రగతిపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.


88,146 కోట్ల పెట్టుబడులు.. 40 పరిశ్రమలు

గతేడాది నవంబరులో జరిగిన విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా ప్రభుత్వంతో 613 కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నా యి. కర్నూలు జిల్లాలో 33,130 మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా రూ.88,146 కోట్ల పెట్టుబడులతో 40 పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చారు. అందులో 35 కంపెనీల ప్రతినిధులు క్షేత్రస్థాయిలో భూపరిశీలన పూర్తిచేశారు. 19 కంపెనీలకు సొంత/లీజ్‌ భూములు ఉన్నాయి. 16 సంస్థల్లో 12 పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను ఏపీఐఐసీ కేటాయించిం ది. మరో 4 కంపెనీలు డీపీఆర్‌లు సమర్పించాల్సి ఉంది. 11 పరిశ్రమ ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయగా, ఒక పరిశ్రమ ట్రయల్‌ రన్‌ మొదలు పెట్టింది.


ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్‌ అభివృద్ధి

రాష్ట్ర విభజన తర్వాత నాటి సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా ఓర్వకల్లు కేంద్రంగా 33 వేల ఎకరాల్లో పారిశ్రామిక హబ్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 2017 జూన్‌ 21న గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసి, రికార్డు స్థాయిలో 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేశారు. 2019 జనవరి 8న సీఎం చంద్రబాబు జాతికి అంకితం చేశారు. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్రం సహకారంతో పారిశ్రామిక ప్రగతికి బీజం పడింది. ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ అభివృద్ధికి కేంద్రం ముందుకు వచ్చింది. 2024-25 కేంద్ర బడ్జెట్‌లో ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్‌ అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. అందు కు అనుగుణంగా ఎన్‌ఐసీడీపీలో ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీల అభివృద్ధికి ఆమోదం తెలిపారు. ఫేజ్‌-1 కింద 2,612 ఎకరాల్లో రూ.2,786 కోట్లతో ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీలో మౌలిక వసతుల కల్పన పనులు వేగంగా సాగుతున్నాయి. ఇక్కడ ఆటోమొబైల్‌ రంగం విడిభాగాల తయారీ, పునరుత్పాదక పరిశ్రమలు, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఏరోస్పెస్‌ అండ్‌ డిఫెన్స్‌ హార్డ్‌వేర్‌, ఫార్మాస్యూటికల్స్‌, వజ్రాలు, బంగారు ఆభరణాల తయారీ, వస్త్ర ఉత్పత్తి రంగ పరిశ్రమలు ఏర్పాటుకు ఎన్‌ఐసీడీసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆయా పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.12 వేల కోట్లు పెట్టుబడులు, 45,071 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేశారు.


ప్రారంభానికి సిద్ధమైన ప్రాజెక్టులు

  • రాష్ట్ర విభజన తర్వాత నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో గ్రీన్‌కో సంస్థ పాణ్యం మండలం పిన్నాపురం వద్ద 5,230 మె గావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా ఇంటిగ్రేటెట్‌ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. సోలార్‌, విండ్‌, హైడల్‌ (పంప్డ్‌ స్టోరేజ్‌) పవర్‌ ఒకే చోట అనుసంధానించబడిన ప్రపంచంలోనే తొలి యూనిట్‌ ఇది. 4,750 ఎకరాల భూమి, గోరుకల్లు రిజర్వాయర్‌ నుంచి ఒక టీఎంసీ నీటిని కేటాయిం చారు. పెట్టుబడి లక్ష్యం రూ.15 వేల కోట్లు. నిర్మాణం, ట్రైల్‌రన్‌ కూడా పూర్తి చేసి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

  • ఓర్వకల్లు సమీపంలో 415 ఎకరాల విస్తీరణంలో రూ.3 వేల కోట్ల పెట్టుబడితో జైరాజ్‌ ఇస్పాత్‌ ఉక్కు పరిశ్రమకు 2017లో నాటి సీఎం చంద్రబాబు పునాదిరాయి వేశారు. 100ు పను లు పూర్తి చేసుకుని ట్రయల్‌ రన్‌ని కూడా కంపెనీ చేపట్టింది.


రానున్న పరిశ్రమలు ఇవీ..

  • ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ నోడ్‌ కారిడార్‌లో రూ.22,976 కోట్ల పెట్టుబడి అంచనాతో ఇండిచిప్‌ సెమీకండక్టర్స్‌ లిమిటెడ్‌ ఏర్పాటుకు ఏపీఐఐసీ 150 ఎకరాలు కేటాయిం చింది. దీని ద్వారా 1,241 మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా.

  • సిగాచి ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ రూ.1,405 కోట్ల పెట్టుబడితో 100 ఎకరాల్లో సింథటిక్‌ ఆర్గానిక్‌ కెమికల్స్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. 1,980 మందికి ఉద్యోగ అవకా శాలు లభిస్తాయని అంచనా. ఆగస్టులో శంకుస్థాపనకు సన్నాహాలు చేస్తున్నారు.

  • రిలయన్స్‌ సంస్థ రెండు దశల్లో 170 ఎకరాల్లో రూ.1,352 కోట్ల పెట్టుబడితో శీతల పానీయాలు, జ్యూస్‌, తాగునీటి తయారీ పరిశ్రమ స్థాపనకు శ్రీకారం చుట్టింది. మెయిన్‌ ఫ్యాక్టరీ భవనాలు 95 శాతం పూర్తయ్యాయి. 800 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి.

  • అగస్త్య ఎనర్జీ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.6,933 కోట్ల పెట్టుబడితో 5జీడబ్ల్యూ సోలార్‌ సెల్స్‌, 5జీడబ్ల్యూ సోలార్‌ మాడ్యూల్‌ తయారీ పరిశ్రమను ఏర్పా టు చేయనుంది. గుట్టపాడు వద్ద 112 ఎకరాలు కేటాయించారు. 2,138 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. సీఎంతో శంకుస్థాపనకు సన్నాహాలు.

  • విరుపాక్ష ఆర్గానిక్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.1,189 కోట్లతో ఏపీఐ తయారీ పరిశ్రమ పె ట్టనుంది. గుట్టపాడు, ఓర్వకల్లు వద్ద 100 ఎకరాలు కేటాయించారు. జూలైలో శంకు స్థాపన చేయనున్నారు. ఉత్పత్తి మొదలైతే 2 వేల మందికి ఉపాధి.

  • టీజీవీ ఎస్‌ఆర్‌ఏఏసీ లిమిటెడ్‌ సంస్థ కాస్టిక్‌ సోడా, సంబంధిత ఉత్పత్తులు, క్లోరోమిథేన్‌, సోలార్‌ పవర్‌ ఉత్పత్తి పరిశ్రమను సొంత భూమిలో ఏర్పాటు చేయనుంది. పెట్టుబడి అంచనా రూ.1,216 కోట్లు. భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. యంత్ర సామగ్రి ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఈ పరిశ్రమ ద్వారా 400 మంది ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయి.

  • ఎన్‌టీపీసీ రెన్యూవబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌ సంస్థ రూ.4,500 కోట్ల పెట్టుబడి, 3,600 ఎకరాల్లో సోలార్‌ పవర్‌ యూనిట్‌ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే 1,500 ఎకరాలు ప్రైవేట్‌ భూమిని సేకరించింది. ఈ యూనిట్‌ పనులు పూర్తయితే 3,100 మందికి ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయి.

Updated Date - Jun 24 , 2026 | 03:43 AM