బంగారు గనుల ‘కుప్పం’!
ABN , Publish Date - Jun 28 , 2026 | 04:47 AM
కర్నూలు జిల్లా జొన్నగిరిలో దేశంలోనే మొట్టమొదటి భారీ ప్రైవేటు బంగారు గనుల ప్రాజెక్టు ఉత్పత్తిని ప్రారంభించింది. రూ.405 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన ఈ మైన్స్‌ను సీఎం చంద్రబాబు ఇటీవల ప్రారంభించారు.
చిగురుగుంట గోల్డ్ మైన్స్‌లో భారీ నిక్షేపాలు
8.5 టన్నుల బంగారం ఉండొచ్చని అంచనా
పలు కారణాలతో 25 ఏళ్ల క్రితం మూత
తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు
గతేడాది సర్వే.. తాజాగా 272 హెక్టార్లకు టెండర్
గనులు ప్రారంభమైతే 5 వేల మందికి ఉపాధి
(చిత్తూరు-ఆంధ్రజ్యోతి)
కర్నూలు జిల్లా జొన్నగిరిలో దేశంలోనే మొట్టమొదటి భారీ ప్రైవేటు బంగారు గనుల ప్రాజెక్టు ఉత్పత్తిని ప్రారంభించింది. రూ.405 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన ఈ మైన్స్‌ను సీఎం చంద్రబాబు ఇటీవల ప్రారంభించారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలంలోని ‘చిగురుగుంట గోల్డ్ మైన్స్’ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. 2001లో మూతపడిన ఈ గనులను మళ్లీ ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. గనుల నిర్వహణకు గత నెలలో టెండర్లను ఆహ్వానించగా.. ఈ నెల 25న రెండు కంపెనీలు ఆ టెండర్ ప్రక్రియలో పాల్గొన్నాయి. గతంలో 263 హెక్టార్లలో ఈ గనులు విస్తరించి ఉండగా, ఇప్పుడు తాజా సర్వేలో భాగంగా మరో 9 హెక్టార్లను కలిపారు. బంగారు నిక్షేపాలపై గతేడాది ఆయా శాఖల అధికారులు సర్వే చేసి, రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. ఇక్కడ ఇప్పటికీ 18 లక్షల టన్నుల బంగారం ముడి ఖనిజం ఉండొచ్చని ఎన్‌ఎండీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఓ టన్ను ముడి పదార్థం నుంచి 5.5 గ్రాముల బంగారం లభించనుండగా.. సుమారు 8.5 టన్నుల బంగారం ఉండొచ్చని చెబుతున్నారు. చిగురుగుంట గోల్డ్ మైన్స్ మళ్లీ ప్రారంభమైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 వేల మందికి ఉపాధి లభించనుంది.
1968లోనే గని ప్రారంభం
వాస్తవానికి చిగురుగుంట గోల్డ్ మైన్స్ ఇప్పటిది కాదు. దశాబ్దాల క్రితమే ఇక్కడ ముడి ఖనిజం తవ్వకాలు జరిగాయి. గుడుపల్లె మండలంలోని రెండు ప్రాంతాల్లో బంగారం గనులున్నాయని గుర్తించి.. బిసానత్తంలోని గనిని 1968లో, చిగురుగుంటలోని గనిని 1978లో ప్రారంభించారు. ఎంఈసీఎల్ సంస్థ సారథ్యంలో తవ్వకాలు మొదలుపెట్టారు. ఇక్కడ క్వార్ట్జ్ రాయిని (బంగారు ముడి పదార్థం) వెలికితీసి విక్రయిస్తూ వచ్చారు. ఎంఈసీఎల్ సుమారు పదేళ్ల పాటు క్వార్ట్జ్‌ను వెలికి తీసి, కేజీఎఫ్‌లోని బీజీఎంఎల్ (భారత్ గోల్డ్ మైనింగ్ లిమిటెడ్)కు అందిస్తూ వచ్చింది. కాలక్రమేణా ఈ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. గనుల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. దీంతో మరో మార్గం లేక గనులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీజీఎంఎల్‌కు విక్రయించింది. 1982లో కొనుగోలు చేసిన బీజీఎంఎల్ అప్పటి నుంచి 2001 జనవరి 15 వరకు బంగారు ముడి ఖనిజం వెలికి తీస్తూ వచ్చింది. కేజీఎఫ్‌లో బీజీఎంఎల్ నిర్వహిస్తున్న ఓ గని నష్టాల్లో పడటంతో దాని ప్రభావం చిగురుగుంట, బిసానత్తం గనులపై కూడా పడింది. దీంతో కంపెనీ లాకౌట్ ప్రకటించింది. దీంతో గనులు మూతపడ్డాయి. వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
కూటమి ప్రభుత్వం చొరవ
2011లో కాంగ్రెస్ ప్రభుత్వం 263 హెక్టార్ల భూమిని ఎంపిక చేసి, 150 బోర్లు డ్రిల్ చేసి బంగారం లభ్యతపై అన్వేషణ చేసింది. చిగురుగుంట, బిసానత్తం ప్రాంతాల్లో ఇంకా బంగారం ఉన్నట్లు నిర్ధారణకు వచ్చింది. జగన్ ప్రభుత్వంలో 2022లో రూ.450 కోట్లతో ఎన్‌ఎండీసీ సంస్థ టెండర్ దక్కించుకుంది. అయితే అది కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో గుడుపల్లె మండలంలోని మైన్స్ నిర్వహణను తిరిగి ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతేడాది చిత్తూరు జిల్లా భూగర్భ, గనుల శాఖ డీడీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఓ బృందం చిగురుకుంట, అతినత్తం, బిసానత్తం ప్రాంతాల భౌగోళిక పరిస్థితులపై అధ్యయనం చేసింది. బంగారం నిక్షేపాలపై సర్వే చేసింది. గతంలో బీజీఎంఎల్, జీఎస్‌ఐలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జియాలజిస్టులు చేసిన అధ్యాయనాలనూ పరిశీలించింది. 250 నుంచి 300 మీటర్ల లోతులో ఖనిజాలు లభ్యమవుతాయని అంచనా వేస్తున్నారు.