Share News

కుప్పం చరిత్రలో సరికొత్త అధ్యాయం

ABN , Publish Date - Jul 06 , 2026 | 05:28 AM

తన సొంత నియోజకవర్గం కుప్పంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి మూడు నెలలకోసారి పర్యటిస్తున్నారు. వచ్చిన ప్రతిసారి మూడు రోజుల పాటు..

కుప్పం చరిత్రలో సరికొత్త అధ్యాయం

  • రూ.9,322 కోట్ల పెట్టుబడులతో ఏకంగా 30 భారీ పరిశ్రమలు

  • వాటితో ఎంవోయూలు,శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

  • 322 మంది రైతులకు 460 ఎకరాల పట్టాలు

  • మూడ్రోజుల సీఎం పర్యటన సక్సెస్‌

కుప్పం/అమరావతి, జూలై 5(ఆంధ్రజ్యోతి): తన సొంత నియోజకవర్గం కుప్పంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి మూడు నెలలకోసారి పర్యటిస్తున్నారు. వచ్చిన ప్రతిసారి మూడు రోజుల పాటు పర్యటించి ఆయా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు పార్టీ శ్రేణులతో సమావేశమవుతున్నారు. ఈసారి సీఎం పర్యటన మాత్రం కుప్పం చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. ఒకట్రెండు కాదు ఏకంగా 30 భారీ పరిశ్రమలు రూ.9,322 కోట్ల పెట్టుబడులతో కుప్పానికి వచ్చాయి. పర్యటనలో తొలిరోజైన శుక్రవారం ఈ ప్రాజెక్టులకు ఎంవోయూలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీటితో ప్రత్యక్షంగా 39,535 మందికి, పరోక్షంగా 47,539 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత అడిడాస్‌ ఫుట్‌వేర్‌ తయారీ సంస్థ నుంచి ఎయిర్‌క్రాఫ్ట్‌ ట్రైనింగ్‌ విమానాల తయారీ ప్రాజెక్టు వరకు వీటిలో ఉన్నాయి. పౌల్ట్రీ రైతులకు లాభం చేకూర్చే చికెన్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏబీఐఎస్‌ ప్రొటీన్స్‌ సంస్థను, 167 పారిశ్రామిక ప్లాట్లతో తీర్చిదిద్దిన ఎంఎస్ఎంఈ పార్కును సీఎం ప్రారంభించారు. అలాగే 7489 మంది ఎస్సీ ఎస్టీల ఇళ్లపై రూ.28 కోట్లతో ఏర్పాటుచేసిన సోలార్‌ రూఫ్‌టాప్‌ వ్యవస్థను ప్రజలకు అంకితం చేశారు. ఐదు రెస్కో సబ్‌స్టేషన్లను ప్రారంభించారు. 46 వేలకుపైగా బీసీ, ఓసీ కుటుంబాల ఇళ్లపై రూ.559 కోట్లతో సోలార్‌ రూఫ్‌టాప్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కుప్పం పట్టణాన్ని శరవేగంగా అభివృద్ధి చేసే లక్ష్యంలో భాగంగా రూ.118 కోట్లతో అత్యాధునిక మోడల్‌ బస్‌ స్టేషన్‌, డిపో నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు.


ఆరు దశాబ్దాల కంగుంది భూసమస్యకు సీఎం పరిష్కారం చూపారు. అడవి పోరంబోకు నుంచి అసెస్డ్‌ వేస్ట్‌ డ్రైగా వర్గీకరించి భూములు సాగు చేసుకుంటున్న 322 మంది రైతులకు 460 ఎకరాల డీకేటీ పట్టాలు అందించారు. మరోవైపు కుప్పం ఆస్పత్రిలో సీటీ, డయాలసిస్‌ సెంటర్లను ప్రారంభించారు. కుప్పంలో రూ.118 కోట్లతో అత్యాధునిక మోడల్‌ బస్‌ స్టేషన్‌, డిపో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మూడో రోజు కుప్పంలో పౌల్ర్టీ, అభ్యుదయ రైతులు, పీ4 లబ్ధిదారులతో సీఎం వేర్వేరుగా ముఖాముఖి నిర్వహించారు. ఈ రెండేళ్లలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో జరిగిన పురోగతిపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి కుప్పంలోనే బస చేసిన సీఎం.. సోమవారం ఉదయం 11 గంటలకు కుప్పం నుంచి నేరుగా అమరావతి చేరుకుంటారు.


5 రోజులుగా బిజీబిజీ!

ఈ నెల 1 నుంచి 5 వరకు నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో సీఎం విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1న గూడూరు నియోజకవర్గం పున్నపువారిపాలెంలో పింఛన్లు అందించారు. తిరుపతి జిల్లా సత్యవేడులోని మాదన్నపాలెంలో హీరో మోటార్స్‌కు చెందిన గ్లోబల్‌ పార్ట్స్‌ సెంటర్‌ 2.0కు శంకుస్థాపన చేశారు. 2న వీబీ-జీరామ్‌జీ పథకాన్ని రైల్వేకోడూరు నుంచి ప్రారంభించారు. 3న కడప జిల్లా సున్నపురాళ్లపల్లిలో జిందాల్‌ సౌత్‌ వెస్ట్‌(జేఎ్‌సడబ్ల్యూ) రాయలసీమ స్టీల్‌ ప్లాంట్‌ పనులను ప్రారంభించారు. అదేరోజు కుప్పం చేరుకొని మూడ్రోజుల పాటు అక్కడే వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సోమవారం అమరావతి ఆర్టీజీఎస్‌లో సమీక్ష జరుపుతారు. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనమిక్‌ రీజియన్లకు సంబంధించి అభివృద్ధి కార్యాచరణపై అధికారులతో భేటీ అవుతారు.

Updated Date - Jul 06 , 2026 | 05:30 AM