Share News

కుంకీలు భేష్‌

ABN , Publish Date - Aug 14 , 2026 | 04:49 AM

ఏనుగుల సంరక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ఉపముఖ్య మంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కుంకీ ఏనుగుల వినియోగంతో..

కుంకీలు భేష్‌

  • ఏజెన్సీలో మంచి ఫలితాలు.. ఏటా రెండింటికి శిక్షణ

  • వన్యప్రాణులతో ఘర్షణ లేని జీవనానికి కృషి

  • ప్రపంచ ఏనుగుల దినోత్సవ సదస్సులో పవన్‌

ఏజెన్సీ ప్రాంతాలు, పలమనేరులో ఏనుగుల సంచారంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో మనుషులు, ఏనుగుల మధ్య సంఘర్షణలు తగ్గించడంపై దృష్టిసారించాం. కర్ణాటక నుంచి నాలుగు కుంకీ ఏనుగులను తీసుకువచ్చి శిక్షణ ఇచ్చాం. దీంతో ఏజెన్సీలో మంచి ఫలితాలు వస్తున్నాయి.

- డిప్యూటీ సీఎం పవన్‌

విశాఖపట్నం, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఏనుగుల సంరక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ఉపముఖ్య మంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కుంకీ ఏనుగుల వినియోగంతో రాష్ట్రంలో మానవ-ఏనుగుల ఘర్షణలను గణనీయంగా తగ్గించగలిగామని పేర్కొన్నారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం (ఆగస్టు 12) సందర్భంగా గురువారం రుషికొండలోని రాడిసిన్‌ బ్లూ హోటల్‌లో నిర్వహించిన జాతీయ సదస్సులో... కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్దన్‌ సింగ్‌తో కలిసి పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మనుషులు, వన్యప్రాణుల మధ్య సంఘర్షణ లేకుండా జీవనం సాగించే పరిస్థితులే నిజమైన అభివృద్ధికి సూచిక అని అన్నారు. రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాలు, చిత్తూరు జిల్లా పలమనేరు, పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల సంచారంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు. అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మనుషులు, ఏనుగుల మధ్య సంఘర్షణలు తగ్గించడంపై దృష్టిసారించామని చెప్పారు. దీనికోసం కర్ణాటక సహకారంతో నాలుగు కుంకీ ఏనుగులను తీసుకువచ్చి శిక్షణ ఇచ్చామన్నారు. వాటితో ఏజెన్సీలో మంచి ఫలితాలు వస్తున్నాయని, ఇప్పటివరకూ 15 కీలక కార్యకలాపాల్లో కుంకీ ఏనుగులు సహకరించాయని చెప్పారు. దీంతో మానవ మరణాలు 70 శాతం తగ్గాయని, పంట నష్టం కూడా తగ్గిందని తెలిపారు.


రాష్ట్రంలో 132 నుంచి 142 అడవి ఏనుగులు ఉన్నాయన్నారు. రాష్ట్రం సొంతంగా కుంకీ ఏనుగుల శిక్షణ కేంద్రం ప్రారంభించిందని, ఇక్కడ శిక్షణ పొందిన ‘జయంత్‌’ అనే కుంకీ పార్వతీపురం మన్యం జిల్లాలో సేవలందిస్తోందని పేర్కొన్నారు. ఏటా రెండు కుంకీ ఏనుగులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. ఇప్పటివరకూ 30 జంతువులను రక్షించామని చెప్పారు. అటవీ సరిహద్దుల్లో రైతులు భయం లేకుండా వ్యవసాయం చేసుకునే పరిస్థితులు కల్పించడం ముఖ్యమన్నారు.


‘ప్రాజెక్ట్‌ ఎలిఫెంట్‌’ పుస్తకం ఆవిష్కరణ

ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ శాఖ రూపొందించిన ‘ప్రాజెక్టు ఎలిఫెంట్‌-30 జెయింట్‌ స్టెప్స్‌’ పుస్తకాన్ని కేంద్ర మంత్రితో కలిసి పవన్‌ కల్యాణ్‌ ఆవిష్కరించారు. చిత్రలేఖన పోటీల్లో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. అలాగే ఏనుగుల రక్షణలో ప్రాణాలు కోల్పోయిన ఒడిశా అటవీ అధికారి జుగల్‌నాయక్‌కు ‘గజగౌరవ్‌’ అవార్డును ఆయన కుటుంబ సభ్యులకు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కేంద్ర అటవీశాఖ, రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2026 | 04:54 AM