Share News

కర్ణాటకపై తెలంగాణ ఫిర్యాదు

ABN , Publish Date - Jun 17 , 2026 | 05:37 AM

తుంగభద్ర నదిపై నిర్మించిన రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌(ఆర్డీఎస్‌) ఆనకట్టను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) చైర్మన్‌ బిశ్వాస్‌, సభ్యుడు కేకే జాంగిద్‌లు కర్ణాటక, తెలంగాణ, ఏపీ ఇంజనీర్లతో కలసి మంగళవారం పరిశీలించారు.

కర్ణాటకపై తెలంగాణ ఫిర్యాదు

  • ఆర్డీఎస్‌ను పరిశీలించిన కేఆర్‌ఎంబీ చైర్మన్‌

కర్నూలు, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): తుంగభద్ర నదిపై నిర్మించిన రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌(ఆర్డీఎస్‌) ఆనకట్టను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) చైర్మన్‌ బిశ్వాస్‌, సభ్యుడు కేకే జాంగిద్‌లు కర్ణాటక, తెలంగాణ, ఏపీ ఇంజనీర్లతో కలసి మంగళవారం పరిశీలించారు. నీటి వాటాలు, వినియోగంపై మూడు రాష్ట్రాల ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్షించారు. కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా రాజోలి దగ్గర ఆర్డీఎస్‌ ఎడమ కాలువ స్లూయిస్‌, ఏపీలోని కర్నూలు జిల్లా కోసిగి మండలం సాతనూరు సమీపంలోని ఆనకట్ట స్లూయి్‌సలను పరిశీలించారు. వరద నీటి ప్రవాహం లెక్కలు తనిఖీ చేశారు. ‘ఎగువ రాష్ట్రం కర్ణాటక మా వాటా నీటిని అడ్డుకుంటోంది. మాకు సగం వాటా నీరు కూడా రావడం లేదు. ఆయకట్టు పొలాలు బీడుగా మారుతున్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు’ అంటూ తెలంగాణ ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి చేసిన ఫిర్యాదు మేరకు ఈ తనిఖీలు జరిగాయి. ఆర్డీఎస్‌ వాటా జలాలు, ఆధునికీకరణ పనులు, తదితర అంశాలపై కేఆర్‌ఎంబీ బోర్డు చైర్మన్‌.. కర్ణాటక, తెలంగాణ, ఏపీ ఇంజనీర్లతో చర్చించారు. ‘ఆంధ్రప్రదేశ్‌ వైపు ఆర్డీఎస్‌ ఆనకట్ట ఆధునికీకరణ, కాంక్రీట్‌ స్కిన్‌ వాల్‌ నిర్మాణం చేయకుండా కర్నూలు జిల్లా రాజకీయ నాయకులు అడ్డుకుంటున్నారు. అటువైపు ఉన్న రివర్‌ స్లూయిస్‌ ద్వారా నిరంతరాయంగా నీటిని తీసుకెళ్తున్నారు’ అని కర్ణాటక ఇంజనీర్లు ఫిర్యాదు చేశారు. కాగా, రాయలసీమ రైతుల కరువు, వలసలను పూర్తిగా నివారించాలంటే తుంగభద్రపై గుండ్రేవుల జలాశయం నిర్మాణమే ఏకైక మార్గమని, ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలని ఆర్డీఎస్‌ కుడి కాలువ ప్రాజెక్ట్‌ డీఈఈ రామకృష్ణ... కేఆర్‌ఎంబీ చైర్మన్‌ బిశ్వాస్‌ను కోరారు.

Updated Date - Jun 17 , 2026 | 05:39 AM