‘కృష్ణలంక’ కలకలం!
ABN , Publish Date - Jun 19 , 2026 | 04:26 AM
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పేరు రాష్ట్రంలో మారుమోగుతోంది. రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అలియాస్ పిల్ల సాయి అదృశ్యం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.
సీఐ నాగరాజు చుట్టూ వివాదాలు
సాయికృష్ణ అదృశ్యం కేసులో సస్పెన్షన్
హింసించడం చూశానంటూ మరొకరి వీడియో
సీఐ వల్లే చనిపోతున్నానన్న మరో ‘సస్పెక్ట్ షీటర్’
గత నెలలో ఆత్మహత్య.. బయటపడ్డ వీడియో
తిప్పికొట్టిన ‘కుల తంత్రం’
సీఐదీ అదే కులం కావడంతో ఇరకాటంలో వైసీపీ
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పేరు రాష్ట్రంలో మారుమోగుతోంది. రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అలియాస్ పిల్ల సాయి అదృశ్యం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సాయి అదృశ్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ, సస్పెన్షన్‌కు గురైన సీఐ నాగరాజు చుట్టూ వివాదం ముసురుకుంటోంది. తాజాగా... ఆయన వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకున్నానంటూ క్రైమ్ సస్పెక్ట్ షీటర్ పేరిపోగు క్రాంతికుమార్ తీసుకున్న వీడియో ఒకటి బయటపడింది. అలాగే... సాయి కృష్ణను చిత్రహింసలు పెట్టడం తాను చూశానంటూ కృష్ణలంకకే చెందిన మహంకాళి చందు అనే క్రైమ్ సస్పెక్ట్ షీటర్ ఒక వీడియో విడుదల చేశాడు.
ఆలస్యంగా వెలుగులోకి ఆత్మహత్య
‘‘నా చావుకు కారణం కృష్ణలంక సీఐ నాగరాజు. నన్ను వేటాడి, వెంటాడి వేధిస్తున్నారు. మూడు నెలలుగా నన్ను కొడుతూనే ఉన్నారు. నేను బతకలేకపోతున్నాను’’ అని విజయవాడ ఫకీర్‌గూడేనికి చెందిన పేరిపోగు క్రాంతికుమార్ తీసుకున్న సెల్ఫీ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. క్రాంతి కుమార్ గత నెల 21న ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు పేరిపోగు వెంకటేశ్వరరావు కుమారుడు. రాత్రి గస్తీ తిరిగే పోలీసులు క్రైం సస్పెక్ట్ షీట్ ఉన్న వారి ఇళ్లకు వెళ్లి పరిశీలిస్తుంటారు. ఇలా పోలీసులు పదేపదే ఇంటికి వస్తున్నారని, క్రాంతి కుమార్‌కు భార్యతో వివాదాలు ఉన్నాయని ఈ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నాడని అప్పట్లో తండ్రి పేరిపోగు వెంకటేశ్వరరావు కృష్ణలంక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా... సీఐ నాగరాజు వేధింపులవల్లే తాను చనిపోతున్నట్లు చెబుతున్న క్రాంతికుమార్ వీడియో బయటపడింది. క్రాంతికుమార్‌పై కృష్ణలంక పోలీసు స్టేషన్‌లో క్రైం సస్పెక్ట్ షీటు ఉంది. కృష్ణలంక పోలీ్‌సస్టేషన్‌లో పనిచేస్తూ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న కానిస్టేబుల్ ఎస్.సురేశ్, క్రాంతికుమార్ కలిసి రెండు నెలల క్రితం బస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న బార్‌కు వెళ్లారు. అక్కడ అర్ధరాత్రి వరకు తాగి గొడవ చేయడంతో సురేశ్‌పై సస్పెన్షన్ వేటు పడింది.
సాయిని హింసించడం చూశా
రౌడీషీటర్ గాదె సాయికృష్ణను పోలీసులు తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టడం తాను చూశానని కృష్ణలంకకు చెందిన క్రైం సస్పెక్ట్ షీటర్ మహంకాళి చందు అలియాస్ పూరి వీడియో విడుదల చేశాడు. ‘‘పిల్ల సాయిని తీసుకొచ్చినప్పుడు స్టేషన్‌లో ఉన్నా. నేను లాక్‌పలో ఉన్నప్పుడే సాయిని చిత్రహింసలు పెట్టారు. సాయిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపుతుంటే బెయిల్ మీద బయటకు వస్తున్నాడు. నేనూ క్రిమినల్నే. అయితే ఆరోజు నన్ను స్టేషన్ నుంచి పంపించేశారు. ఎందుకో తెలియదు’’ అంటూ చందు తన వీడియోలో పలు వివరాలు తెలిపాడు.
తిప్పికొట్టిన ‘కుల తంత్రం’
సాయికృష్ణ అదృశ్యం కేసుతో రాజకీయ క్రీడకు తెరలేపిన వైసీపీ ‘కుల తంత్రం’ ఇప్పుడు బెడిసి కొట్టింది. కాపు సామాజిక వర్గానికి చెందిన సాయికృష్ణను సీఐ నాగరాజు లాక్‌పడెత్ చేశారంటూ... ఈ కేసును కూటమి సర్కారుతో ముడిపెట్టి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఇరకాటంలోకి నెట్టాలని ప్రయత్నించింది. అయితే బాధితుడు సాయికృష్ణతోపాటు సీఐ నాగరాజు కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారని తేలడంతో వైసీపీ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. రెండురోజులుగా వైసీపీ నాయకులు కాపు సెంటిమెంట్‌ను రాజేస్తుండగా... గురువారం సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన జగన్ అక్కడ మాత్రం ఆ మాటెత్తలేదు.