హంద్రీనీవాకు కృష్ణమ్మ
ABN , Publish Date - Aug 05 , 2026 | 11:18 PM
శ్రీశైలానికి భారీ వరద వచ్చి చేరుతోంది. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు 129.4646 టీఎంసీలు నీటి నిల్వ చేరింది.
మల్యాల నుంచి 350 క్యూసెక్కుల విడుదల
నేడు పోతిరెడ్డిపాడు నుంచి విడుదలకు సన్నాహాలు
శ్రీశైలానికి కొనసాగుతున్న భారీ వరద
డ్యాంలో చేరిన 129.4646 టీఎంసీలు
తుంగభద్రలో 59.718 టీఎంసీలు చేరిన వరద
తాగునీటికే ప్రాధాన్యత అంటున్న ఇంజనీర్లు
కర్నూలు, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలానికి భారీ వరద వచ్చి చేరుతోంది. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు 129.4646 టీఎంసీలు నీటి నిల్వ చేరింది. ఎగువ నుంచి 2.44 లక్షల క్యూసెక్కులు ఇనఫ్లో కొనసాగుతోంది. దీంతో ఆయకట్టుకు సాగునీరు ఇస్తారని రైతులు ఆశించారు. అయితే.. తీవ్రంగా వెంటాడుతున్న ఎల్‌నినో ప్రభావం రాబోయే రోజుల్లో ఎలాంటి ముప్పును తీసుకొస్తుందో..? అనే భయం పాలకులను వెంటాడుతోంది. దీంతో తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. సీమ కరువు పల్లెల్లో తాగునీటి అవసరాల కోసం హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం కుడిగట్టు ప్రధాన కాలువ (ఎస్‌ఆర్‌ఎంసీ)కు కృష్ణా జలాలు విడుదలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లా ఇనచార్జి మంత్రి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఈఎనసీ ఆదేశాల మేరకు హంద్రీనీవా ప్రాజెక్టు కర్నూలు-1 సర్కిల్ ఎస్‌ఈ రాజనబాబు బుధవారం సాయంత్రం హంద్రీనీవా ప్రాజెక్టు మాల్యాల లిఫ్ట్ నుంచి ఒక పంప్ ఆన చేసి 350 క్యూసెక్కులు విడుదల చేశారు. తుంగభద్రకు వరద కొనసాగుతుండడంతో సాగునీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని టీబీపీ ఎల్లెల్సీ ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
జూరాల ప్రాజెక్టు గేట్లు దాటుకొని 2,44,998 క్యూసెక్కులు వరద శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో 129.4646 టీఎంసీలకు చేరింది. గరిష్ట నీటి మట్టం 885 అడుగులు, సామర్థ్యంలో 215.8070 టీఎంసీలు కాగా.. 866.90 అడుగుల లెవల్‌లో కొనసాగుతోంది. పూర్తి సామర్థ్యం 215.80 టీఎంసీలకు చేరుకోవాలంటే మరో వారం పది రోజులు పడుతుంది. 843 అడుగుల లెవల్ దాటగానే హంద్రీనీవా ఎత్తిపోతల పథకం, 854 అడుగులకు చేరుకోగానే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం కుడిగట్టు ప్రధాన కాలువ (ఎస్‌ఆర్‌ఎంసీ)కు కృష్ణా జలాలు విడుదల చేసి, బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి తెలుగుగంగ, గాలేరు-నగరి వరద కాలువ, ఎస్‌ఆర్‌బీసీ కాలువలకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. శ్రీశైలం డ్యాం నీటి మట్టం 266.90 అడుగులకు చేరింది. జలాశయంలో 129.4646 టీఎంసీలు నిల్వ ఉంది. ఎగువ నుంచి 2,44,998 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. అంటే.. రోజూ 20-21 టీఎంసీల మేర వరద వస్తోంది. ఈ ప్రవాహం ఇలాగే కొనసాగితే ఐదు రోజుల్లో డ్యాం పూర్తి సామర్థ్యానికి చేరుకునే అవకాశం ఉంది. ఆ తరువాత వచ్చిన వరదను విద్యుత ఉత్పత్తి కేంద్రాలు, క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువ నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం విద్యుత ఉత్పత్తి పేరిట 4,267 క్యూసెక్కులు సాగర్‌కు వదిలేస్తోంది. ఇది సీమ రైతుల్లో ఆగ్రహానికి కారణం అవుతోంది. ఇది పసిగట్టిన రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం ఆయా కాలువకు నీటిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. సంబంధిత శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఇంజనీరింగ్ ఇన చీఫ్ (ఈఎనసీ)లు ఉమ్మడి జిల్లా ప్రాజెక్ట్స్ సీఈ కబీర్‌బాషా, ఉన్నతాధికారులతో చర్చించారు. తాగునీటికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ నీటి హంద్రీనీవా పంపులు ఆన చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో హడావిడిగా ఆ ప్రాజెక్టు కర్నూలు-1 సర్కిల్ ఎస్‌ఈ రాజనబాబు, ఈఈ ప్రసాద్‌రావు, ఇంజనీరింగ్ సిబ్బంది మాల్యాల ఎత్తిపోతల పథకం పంప్‌హౌ్‌సకు ప్రత్యేక పూజలు చేసి, కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి ఒక పంప్ ఆన చేశారు. 350 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. క్రమక్రమంగా పంపుల సంఖ్య పెంచుతామని ఇంజనీర్లు తెలిపారు. అలాగే.. గురువారం ఉదయం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తి ఎస్‌ఆర్‌ఎంసీ, తెలుగుగంగ, గాలేరు-నగరి, ఎస్సార్బీసీ కాలువకు నీటిని విడుదల చేసేందుకు టీజీపీ నంద్యాల ఎస్‌ఈ శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రయత్నాలు చేస్తున్నారు.
ఫ రెండు జిల్లాల్లో 102.427 టీఎంసీలు
శ్రీశైలం డ్యాంలో ప్రస్తుతం 129.46 టీఎంసీలు చేరాయి. మరో పది రోజుల్లో వంద టీఎంసీలు చేరుతాయని అంచనా వేశారు. తాగునీటికే తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం వెల్లడించాడు. ఏపీ వాటా 63 శాతంలో హంద్రీనీవా కాలువకు 13 టీఎంసీలు, నాగార్జున సాగర్ కెనాల్స్‌కు 32 టీఎంసీలు, చెన్నై తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు తీసుకుంటామని తెలిపారు. అందులో భాగంగానే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పరిధిలోని జలాశయాలకు 10 టీఎంసీలు తీసుకుంటామని వెల్లడించాడు. అయితే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పరిధిలో నంద్యాల జిల్లాలో వెలుగోడు, గోరుకల్లు, అవుకు జలాశయాల సామర్థ్యం 33.535 టీఎంసీలు, కడప జిల్లాలో గండికోట, చిత్రావతి, పైడిపాలెం, బ్రహ్మంసాగర్, ఎస్‌ఆర్-1, ఎస్‌ఆర్-1, సర్వరాయసారగ్, వామికొండ, మైలావరం జలాశయాల సామర్థ్యం 68.894 టీఎంసీలు. అంటే.. రెండు జిల్లాల్లోనే 102.427 టీఎంసీలు నింపుకోవాల్సి ఉంది. కనీసం సగం రిజర్వాయర్లు నింపాలన్నా 50 టీఎంసీలు అవసరం అవుతాయి. దీనిపై ప్రభుత్వ పాలకులు కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తాగునీటి అవసరాలు దృష్ట్యా పూర్తిస్థాయిలో నింపేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఫ చెరువులు నింపేందుకు ప్రధాన్యం
హంద్రీనీవా ద్వారా విడుదల చేసిన నీటిని ఉమ్మడి కర్నూలు జిల్లాలో చెరువులు, జలాశయాలు నింపేందుకు తొలి ప్రాధ్యాత ఇవ్వాలి. ఇప్పటికే పశ్చిమ ప్రాంతంలో తీవ్ర కరువు దుర్భిక్ష పరిస్థితులు తలెత్తాయి. రాబోయే రోజుల్లో ఎననినో ప్రభావ తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. హంద్రీనీవా కాలువ పరిధిలోని సూయిస్ ద్వారా నీటిని విడుదల చేసి 68 చెరువులు, కృష్ణగిరి, పత్తికొండ, గాజులదిన్నె జలాశయాలు పూర్తిగా నింపిన తరువాతే, పక్క జిల్లాలకు కృష్ణా జలాలు మళ్లించాలని పశ్చిమ ప్రాంతం రైతులు కోరుతున్నారు. స్లూయిస్‌లు మూసేసి నీటిని తీసుకెళితే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం లేకపోలేదు.
ఫ టీబీపీ ఎల్లెల్సీ రైతుల ఆశలు తీరేనా..?
తుంగభద్ర డ్యాంలో 59.718 టీఎంసీలు వరద చేరడంతో ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజవర్గాల రైతుల్లో సాగు ఆశలు చిగురించాయి. అయితే... తాగునీటికి తొలి ప్రాధాన్యత అనడంతో నిరాశ చెందుతున్నారు. డ్యాం గరిష్ట నీటి మట్టం 1,633 అడుగులు, సామర్థ్యం 105.780 టీఎంసీలు కాగా బుధవారం 1,619 అడుగుల లెవల్‌లో 59.718 టీఎంసీల నీటి నిల్వ చేరింది. 1,00,750 క్యూసెక్కుల ఇనఫ్లో ఉదయం ఉంటే, మధ్యాహ్నానికి భారీగా వరద తగ్గిపోయిందని డ్యాం ఇంజనీర్లు తెలిపారు. తాగునీటి కోసం 1,445 క్యూసెక్కులు విడుదల చేయగా, ఏపీ సరిహద్దుల్లో టీబీపీ ఎల్లెల్సీ కాలువలో 410 క్యూసెక్కులు ప్రవాహం కొనసాగుతోంది.