Share News

బచావత్‌ కేటాయింపుల పునఃసమీక్ష కుదరదు!

ABN , Publish Date - Aug 14 , 2026 | 05:28 AM

కృష్ణా నదిపై నిర్మించిన ఆనకట్టలకు కృష్ణా నదీ జల వివాద ట్రైబ్యునల్‌-1 (బచావత్‌ ట్రైబ్యునల్‌) చేసిన నీటి కేటాయింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ పునఃసమీక్షించేందుకు వీల్లేదని ఆంధ్రప్రదేశ్‌ స్పష్టం చేసింది.

బచావత్‌ కేటాయింపుల పునఃసమీక్ష కుదరదు!

  • ఏ మార్పులు చేసినా 4 రాష్ట్రాలకూ వర్తిస్తాయి: ఏపీ

అమరావతి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): కృష్ణా నదిపై నిర్మించిన ఆనకట్టలకు కృష్ణా నదీ జల వివాద ట్రైబ్యునల్‌-1 (బచావత్‌ ట్రైబ్యునల్‌) చేసిన నీటి కేటాయింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ పునఃసమీక్షించేందుకు వీల్లేదని ఆంధ్రప్రదేశ్‌ స్పష్టం చేసింది. కృష్ణా ట్రైబ్యునల్‌-1, 2లు ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల్లో మార్పులు చేస్తే.. వాటిని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకూ వర్తింపజేయాలని, నాలుగు రాష్ట్రాల వాదనలూ వినాల్సిందేనని తేల్చి చెప్పింది. కృష్ణా జలాల పంపకాలు, గత ట్రైబ్యునళ్ల కేటాయింపులపై గురువారం బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ఎదుట ఏపీ తరఫు సీనియర్‌ న్యాయవాది జైదీప్‌ గుప్తా వాదనలు వినిపించారు. ‘నీటి కేటాయింపులపై ఒకసారి ట్రైబ్యునల్‌ ఆదేశాలు జారీ చేశాక.. దానిపై జోక్యం చేసుకునే అధికారం ఎవరికీ ఉండదు. కొత్తగా కృష్ణా జలాల కేటాయింపులు జరపాలన్న తెలంగాణ వాదన సహేతుకం కాదు. ఇప్పటికే కృష్ణా డెల్టా సిస్టమ్‌, కేసీ కెనాల్‌, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు చేసిన కేటాయింపులు, పొదుపు చేసిన నీటిని కదిలించేందుకు వీల్లేదు. నదీ పరీవాహక ప్రాంతాల ఆధారంగా నీటి కేటాయింపులు జరగవు. సాంకేతిక సూత్రీకరణలు ప్రాజెక్టుల వారీ నీటి కేటాయింపులకు వర్తించవు. నదీ పరీవాహక ప్రాంతం ఆధారంగా నీటి కేటాయింపులు ఉండాలన్న తెలంగాణ వాదన అర్థరహితం.. నిరాధారం. దీర్ఘకాలికంగా ప్రాజెక్టు అవసరాలను అంచనావేసుకుని నీటి కేటాయింపులు ఉంటాయు. రాష్ట్రాన్ని ఏకమొత్తంగా తీసుకుని.. దుర్భిక్ష ప్రాంతాలు, నదికి సమీపంలోని పరీవాహక ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుంటారే తప్ప.. కేవలం నదీ పరీవాహక ప్రాంతాన్ని బట్టి కేటాయింపులు ఉండవు’ అని పేర్కొన్నారు. కృష్ణా ట్రైబ్యునల్‌-1 కేటాయింపులను.. అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్‌ 11లో పొందుపరచిన ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. గురువారంతో బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌-2 ఎదుట ఆంధ్రప్రదేశ్‌ వాదనలు ముగిశాయి. శుక్రవారం నుంచి తెలంగాణ వాదనలు ప్రారంభమవుతాయి.

Updated Date - Aug 14 , 2026 | 05:29 AM