కృష్ణా జలాలను 66:34 నిష్పత్తిలోనే పంచాలి
ABN , Publish Date - May 01 , 2026 | 04:20 AM
కృష్ణా నదిపై తెలంగాణ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను నిలుపుదల చేయాలంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి ఆంధ్రప్రదేశ్ విన్నవించింది.
తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోండి
కృష్ణా బోర్డుకు ఆంధ్రప్రదేశ్ స్పష్టీకరణ
16 ప్రాజెక్టులపై ఆ రాష్ట్రం జారీ చేసిన జీవోపైనా అభ్యంతరం
వచ్చేవారం బోర్డు భేటీ జరిగే అవకాశం!
అమరావతి, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నదిపై తెలంగాణ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను నిలుపుదల చేయాలంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి ఆంధ్రప్రదేశ్ విన్నవించింది. గురువారం జరగాల్సిన బోర్డు సమావేశం.. తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో వాయిదాపడిన సంగతి తెలిసిందే. ఇది వచ్చే వారం జరిగే అవకాశముంది. రెండు రాష్ట్రాలూ తమ తమ ఎజెండాలను కేఆర్‌ఎంబీకి పంపాయి. వీటిపై చర్చించాలని పట్టుబట్టాయి. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తమకు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల చొప్పున 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాలను విడుదల చేయాల్సిందేనని ఏపీ తన ఎజెండాలో విస్పష్టంగా పేర్కొంది. తెలంగాణ చేస్తున్న డిమాండ్ మేరకు అధికంగా నీటిని కేటాయించడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. ‘ట్రైబ్యునళ్ల ఆదేశాలు, 11వ షెడ్యూల్ అనుమతులు లేకుండా తెలంగాణ కృష్ణా నదిపై అక్రమ నిర్మాణాలు చేపడుతోంది. సుంకిశాల ఇన్‌టేక్ వద్ద అక్రమ ఎత్తిపోతలకు సిద్ధమైంది. డీపీఆర్‌ను కూడా సిద్ధం చేస్తోంది. ఈ పథకాన్ని ముందుకు సాగకుండా నిలువరించాలి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి 90 టీఎంసీలు వాడేందుకు సైతం సిద్ధమైంది. కృష్ణా ట్రైబ్యునల్-2 ముం దున్న ఈ ప్రాజెక్టును కొనసాగించకుండా ఆ రాష్ట్రాన్ని నిలువరించాలి. కేఆర్‌ఎంబీ పరిధిలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి ఇప్పటికే అధికారికంగా 25 టీఎంసీలు కేటాయింపులున్నాయి. అదనంగా ఇంకో 15 టీఎంసీలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తోంది. నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని అక్రమంగా నిర్మించి లక్ష ఎకరాలకు సాగునీరందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పరిపాలనా ఆమోదం తెలుపుతూ ఉత్తర్వు కూడా జారీ చేసింది. కేంద్ర జలశక్తి మంత్రి నేతృత్వంలోని ఎపెక్స్ కౌన్సిల్ అనుమతుల్లేని ఈ ప్రాజెక్టును నిలువరించాలి. పులిచింతల దిగువన కృష్ణా నది కుడివైపున వాజేపల్లి గ్రామం వద్ద రాజీవ్‌గాంధీ ఎత్తిపోతల పథకాన్ని అక్రమంగా నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడితే.. ఏపీకి 75 శాతం డిపెండబిలిటీ కింద నికర జలాల్లో కోత పడుతుంది. మున్నేరు (ఖమ్మం) వద్ద కొత్త పథకాలను నిర్మించేందుకు తెలంగాణ చేస్తున్న ప్రయత్నాలనూ నిలువరించాలి. గూడెందొడ్డి, రాళంపాడు రిజర్వాయర్ల కింద నెట్టెంపాడు ద్వారా అదనంగా 25 టీఎంసీలను అక్రమంగా తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలనూ అడ్డుకోవాలి. 16 నీటి ప్రాజెక్టులకు పరిపాలనా ఆమోదం తెలుపుతూ ఆ రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన 34వ నంబరు ఉత్తర్వుపైనా మాకు అభ్యంతరాలున్నాయి’ అని ఏపీ స్పష్టం చేసింది.
తెలంగాణ ఎజెండా ఇదీ..
పోలవరం-నల్లమల సాగర్ అనుసంధాన పథకం ద్వారా ఏపీ అనధికారికంగా రోజుకు రెండు టీఎంసీల చొప్పున 200 టీఎంసీలను తరలించేందుకు ప్రయత్నిస్తోందని బోర్డుకు పంపిన తన ఎజెండాలో తెలంగాణ ఆరోపించింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కొత్తగా నిర్మించే ప్రాజెక్టులకు ఎపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందాలని.. అది లేకుండా పనులు చేపట్టేందుకు వీల్లేదని ఏపీకి బోర్డు స్పష్టం చేయాలని సూచించింది. పోతిరెడ్డిపాడు ద్వారా బేసిన్ ఆవలకు నీరు తరలించకుండా నిరోధించాలని కోరింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ప్రీ-డీపీఆర్ దశలోనే నిలిపేశామని ఏపీ చెబుతున్నప్పటికీ అక్కడ పనులు జరుగుతున్నాయని తెలిపింది. వాస్తవ స్థితిగతులను బోర్డు స్పష్టం చేయాలని పేర్కొంది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఏపీ అనధికారికంగా ప్రాజెక్టులను ఆక్రమంగా కడుతోందని, దీనిపై బోర్డు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని ఆక్షేపించింది.