నికర జలాలను వదిలేసి ఎత్తిపోసుకోమంటారా?
ABN , Publish Date - Apr 23 , 2026 | 03:14 AM
కృష్ణానదీ జల వివాద ట్రైబ్యునల్ రాష్ట్రానికి కేటాయించిన నికర జలాలను వదిలేసి నీటిని ఎత్తిపోసుకోమంటారా అని బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్-2 ఎదుట రాష్ట్రం వాదించింది.
నీటి వాడకంపై తెలంగాణ పొంతన లేని మాటలు
గోదావరి జలాలపై డీపీఆర్‌కు కేసులతో అడ్డంకులు
బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ముందు ఏపీ వాదనలు
అమరావతి, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): కృష్ణానదీ జల వివాద ట్రైబ్యునల్ రాష్ట్రానికి కేటాయించిన నికర జలాలను వదిలేసి నీటిని ఎత్తిపోసుకోమంటారా అని బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్-2 ఎదుట రాష్ట్రం వాదించింది. నాగార్జునసాగర్ కుడి కాల్వ (ఎన్‌ఎస్ఆర్‌సీ) ఆధారంగా పండించే పంటలకు సాగునీరు అందించడంపై ట్రైబ్యునల్ ముందు తెలంగాణ చేసిన వాదనల్లో పసలేదని తేల్చిచెప్పింది. కృష్ణా డెల్టాకు 24 టీఎంసీలు ఎలా సరిపోతాయని ప్రశ్నించింది. నీటి వాడకంపై ట్రైబ్యునల్ ముందు తెలంగాణ చెప్పేదొకటి.. చేసేదొకటిగా ఉంటోందని ఆరోపించింది. సాగర్ కుడి కాల్వ కింద 11.94 లక్షల ఎకరాల ఆయకట్టుకు 150 టీఎంసీలు కావాలని, అయితే 132 టీఎంసీలకే ఆమోదించామని వివరించింది. తెలంగాణ వాదనలు ఆచరణాత్మకం కాదని పేర్కొంది. ఏపీ తరఫున సీనియర్ కౌన్సిల్ సభ్యుడు జయదీప్ గుప్త, సీనియర్ న్యాయవాది జి.ఉమాపతి బుధవారం వాదనలు వినిపించారు. సాగర్ కుడి ప్రధాన కాల్వ కింద 11.94 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని, 1969లో కేంద్ర ప్రణాళికా సంఘం ఈ గణాంకాలను ఆమోదించిందని ఉమాపతి గుర్తు చేశారు. పంటలకు అవసరమైన నీటి వినియోగంపై శాస్త్రీయంగా నివేదికలతో కూడిన నోట్‌ను సమర్పించారు. ఎన్‌ఎ్‌సఆర్‌సీ కమాండ్ ప్రాంతంలోని మట్టి రకాల గురించి ఎన్‌ఎస్పీ ఆధునీకరణ నివేదిక ఆధారంగా పంట వ్యవధుల వివరాలు ఇచ్చారు. పారామితుల్లో చిన్న మార్పు కూడా పంటలకు అవసరమైన నీటి పరిమితిపై గణనీయమైన ప్రభావం చూపుతుందని ఉమాపతి పేర్కొన్నారు. ఎన్‌ఎ్‌సఆర్‌సీ కమాండ్ ప్రాంతంపై ప్రభావం చూపే ఐఎండీ స్టేషన్ల ప్రభావాన్ని సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్త వివరించారు. తెలంగాణ వితండ వాదన చేసినట్లుగా పులిచింతలలో 36 టీఎంసీలు అందుబాటులో ఉండదని, ఈ జలాలు కృష్ణాడెల్టా ఆయకట్టుకు అవసరమని వెల్లడించారు. కృష్ణా జలాలను సాగర్ కుడి ప్రధాన కాలువ ఆయకట్టుకు ఎత్తిపోయడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ఎన్‌ఎస్‌ఆర్‌సీ కింద పంటల కోసం 153.29 టీఎంసీలు అవసరమని జయదీప్ పేర్కొన్నారు. మరోవైపు గోదావరి జలాల వినియోగంలో భాగంగా పోలవరం- నల్లమల సాగర్ అనుసంధాన పథకాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తోందని తెలిపారు. గోదావరి, కృష్ణానదీ జలాల వినియోగంలో ఏపీకి పూర్తిగా సహకరిస్తామని ట్రైబ్యునల్ ముందు చెబుతున్న తెలంగాణ.. వాస్తవంలో మరోలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పోలవరం- నల్లమలసాగర్ అనుసంధాన పథకం డీపీఆర్ తయారు చేయడానికి కూడా తెలంగాణ న్యాయపరమైన అవరోధాలు కల్పిస్తోందని వెల్లడించారు. కాగా, గురువారం తుంగభద్ర నదీ జలాలపై ఏపీ వాదనలు వినిపించనుంది.